సాక్షి, ముంబై: ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’ అన్నట్లుగా తయారైంది ప్రాజెక్టుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్లక్ష్య వైఖరివల్ల నగరం, శివారు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రతిపాదనలు, అధ్యయనం, స్థలాంతరం, పరిహారం, టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పనులు ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. ఫలితంగా సకాలంలో పనులు పూర్తి కావడంలేదు.
దీంతో నిర్దేశించిన వ్యయం కంటే రెట్టింపు అవుతోంది. ఇటీవల ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చిన మోనో రైలు 11 సార్లు వాయిదా పడింది. దీంతో తొలుత నిర్దేశించిన వ్యయం సుమారు రూ.1,400 కోట్లు ఉండగా పనులు పూర్తయ్యే సరికి అది రూ.2,460 కోట్లకు చేరుకుంది. ఇదే తరహాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎమ్మెమ్మార్డీయే 8 సార్లు విధించిన డెడ్‌లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో అప్పట్లో రూ.2,356 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడదిరూ.4,800 కోట్లకు చేరుకుంది.
అదేబాటలో ఎలివేటెడ్ రైల్వే మార్గం
వీటి తరహాలోనే ఓవల్ మైదాన్ (చర్చిగేట్)- విరార్‌ల మధ్య చేపట్టనున్న ఎలివేటెడ్ రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం తడిసి మోపె డు కావడంతో రైల్వే పరిపాలన విభాగానికి తలనొప్పిగా మారింది. అంతేగాక ఈ ప్రాజెక్టు పనులు ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తికాని పక్షంలో భవిష్యత్తులో ఈ వ్యయం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం రైల్వే పరిపాలన విభాగం ఎదురుచూస్తోంది. 64 కి.మీ. దూరంతో కూడిన ఈ ప్రాజెక్టు 2020 వరకు పూర్తి చేయాల్సి ఉంది. 2012 జనవరిలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.19,513 కోట్లు ఉండగా రెండేళ్లలో అదనంగా రూ.2,487 కోట్ల మేర పెరిగింది. అంతేకాక ఈ ప్రాజెక్టు అధ్యయనం పనులకు సుమారు రూ.19 కోట్లు అదనంగా ఖర్చయ్యాయని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేం దుకు రైల్వే నడుంబిగించింది. అందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2013 నవంబర్ 13న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆఖరు సారి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ప్రాజె క్టు విషయంపై ప్రభుత్వం, రైల్వే మధ్య ఇంతవరకు ఎలాంటి సమావేశంగానీ, చర్చలుగానీ జరగలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇలా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయి వాటి వ్యయం తడిసి మోపెడవుతోంది.
తడిసి మోపెడు
Published Mon, Feb 10 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement
Advertisement