‘మోనో’ను లాభాల బాట పట్టించేందుకు ఎమ్మెమ్మార్డీయే కంకణం
త్వరలో రిటర్న్ టికెట్ విధానం
సాక్షి, ముంబై: మోనో రైలును లాభాల బాట పట్టించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రయాణికులకు రిటర్న్ టికెట్‌లను కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సింగిల్ టికెట్ విధానం అమలులో ఉంది. ఇందువల్ల తిరుగు ప్రయాణంలో బుకింగ్ కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడి టికెట్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చేది. క్యూ బాధను భరించలేక అనేకమంది తిరుగు ప్రయాణంలో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మోనో రైలుకు రాబడి తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిటర్న్ టికెట్లను జారీ చేస్తే ప్రయాణికులు తిరిగి మోనో రైలు ఎక్కి తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారని ఎమ్మెమ్మార్డీయే భావించింది.
దీంతో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మేలో ప్రారంభమైన మెట్రో రైలుకు రిటర్న్ టికెట్ సౌకర్యం కల్పించారు.అయితే అంతకంటే ముందు ఫిబ్రవరిలో ప్రారంభమైన మోనో రైలుకు మాత్రం ఈ సౌకర్యం కల్పించలేదు. దాని ప్రభావం క్రమేణా కనిపిస్తుండడంతో ఎమ్మెమ్మార్డీయే కళ్లు తెరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంబూర్- వడాలా ప్రాంతాల మధ్య తొలి విడత మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి వారం మినహా ఆ తరువాత నుంచి మోనో రైలు సేవలకు ఆదరణ గణనీయంగా తగ్గిపోయింది. ఆనాటి నుంచి ఇప్పటికీ మోనో నష్టాల బాటలోనే నడుస్తోంది.
టికెట్ల ద్వారా తగినంత ఆదాయం రావడం లేదు. తత్ఫలితంగా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను భరించడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రిటర్న్ టికెట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఎమ్మెమ్మార్డీయే సంకల్పించింది. ఇందుకు సంబంధించి కొన్ని షరతులను విధించింది. రిటన్ టికెట్ కోసం రూ.22 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న రోజు మాత్రమే చెల్లుతుంది. లోకల్ రైళ్ల మాదిరిగా తిరుగు ప్రయాణం మరుసటి రోజు చేయడం కుదరదు. ఒకవేళ తిరుగు ప్రయాణం చేయకపోయినప్పటికీ డబ్బులు వెనక్కి మాత్రం ఇవ్వబోరు.