mono train
-
తిరుమలకు మోనో రైలు..!
సాక్షి, తిరుపతి: తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండీతో చర్చించి, నివేదిక అడిగామని చెప్పారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని మెట్రో ఎండీని కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆగమ పండితులతో చర్చిస్తామని చెప్పారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏడుకొండల్లో టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు నిర్మాణానికి పరిశీలించమని కోరినట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు. రోప్‌వేలు, కేబుల్ కార్లు లాంటివి వద్దని చెప్పామన్నారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు మోనో రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందన్నారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపై మోనో రైలు వెళుతోందని.. దాన్ని మోడల్‌గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతాం... ట్విట్టర్లో టీటీడీపై దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో నకిలీ ఖాతా సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ ఖాతా అజిత్ దోవల్‌ది కాదని పేర్కొన్నారు. అది ఫేక్ అని తమ పరిశీలనలో తేలిందన్నారు. టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని.. త్వరలోనే సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
‘మోనో’ను లాభాల బాట పట్టించేందుకు ఎమ్మెమ్మార్డీయే కంకణం
త్వరలో రిటర్న్ టికెట్ విధానం సాక్షి, ముంబై: మోనో రైలును లాభాల బాట పట్టించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రయాణికులకు రిటర్న్ టికెట్లను కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సింగిల్ టికెట్ విధానం అమలులో ఉంది. ఇందువల్ల తిరుగు ప్రయాణంలో బుకింగ్ కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడి టికెట్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చేది. క్యూ బాధను భరించలేక అనేకమంది తిరుగు ప్రయాణంలో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మోనో రైలుకు రాబడి తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిటర్న్ టికెట్లను జారీ చేస్తే ప్రయాణికులు తిరిగి మోనో రైలు ఎక్కి తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారని ఎమ్మెమ్మార్డీయే భావించింది. దీంతో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మేలో ప్రారంభమైన మెట్రో రైలుకు రిటర్న్ టికెట్ సౌకర్యం కల్పించారు.అయితే అంతకంటే ముందు ఫిబ్రవరిలో ప్రారంభమైన మోనో రైలుకు మాత్రం ఈ సౌకర్యం కల్పించలేదు. దాని ప్రభావం క్రమేణా కనిపిస్తుండడంతో ఎమ్మెమ్మార్డీయే కళ్లు తెరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంబూర్- వడాలా ప్రాంతాల మధ్య తొలి విడత మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి వారం మినహా ఆ తరువాత నుంచి మోనో రైలు సేవలకు ఆదరణ గణనీయంగా తగ్గిపోయింది. ఆనాటి నుంచి ఇప్పటికీ మోనో నష్టాల బాటలోనే నడుస్తోంది. టికెట్ల ద్వారా తగినంత ఆదాయం రావడం లేదు. తత్ఫలితంగా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను భరించడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రిటర్న్ టికెట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఎమ్మెమ్మార్డీయే సంకల్పించింది. ఇందుకు సంబంధించి కొన్ని షరతులను విధించింది. రిటన్ టికెట్ కోసం రూ.22 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న రోజు మాత్రమే చెల్లుతుంది. లోకల్ రైళ్ల మాదిరిగా తిరుగు ప్రయాణం మరుసటి రోజు చేయడం కుదరదు. ఒకవేళ తిరుగు ప్రయాణం చేయకపోయినప్పటికీ డబ్బులు వెనక్కి మాత్రం ఇవ్వబోరు. -
గ్రీన్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మైట్రో రైలు... ముంబై మోనో రైలు... ఢిల్లీలోని టెర్మినల్-3 ఇలా ఏ భారీ ప్రాజెక్టు చూసినా వాటి వెనక ‘ఆటోడెస్క్’ హస్తం కనిపిస్తుంది. ఇవే కాదు! అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి పూర్తి గ్రాఫిక్స్‌తో నిండిన సినిమాల్లోనూ ఆటోడెస్క్ అద్భుతాలుంటాయి. అంతెందుకు! మన తెలుగులో రాబోతున్న రాణి రుద్రమ, బాహుబలి సినిమాల్లోనూ ఆటోడెస్క్ డిజైన్స్ కళ్లకు కట్టబోతున్నాయి. అదీ! ఆటోడెస్క్ ప్రత్యేకత అంటే. అందుకే ఒక చిన్న ఆఫీసులో ఆరంభమైన ఈ సంస్థ ఇపుడు ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఐపాడ్, ఐఫోన్ అప్లికేషన్స్‌తో పాటు 3డీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్ సేవలందిస్తున్న ఈ సంస్థ సీనియర్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మేనేజర్(ఐపీఎం) టెర్రీ డి బెన్నెట్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇండియాతో సహా రాష్ట్ర మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఇండియాలో ఆటోడెస్క్ ఎలాంటి సేవలందిస్తోంది? ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. కొన్ని నేరుగా మేమే క్లయింట్లకు అందిస్తున్నాం. మరికొన్ని ఆర్డర్లను మాత్రం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు మా ద్వారా అందిస్తున్నాయి. మేం డెవలప్ చేసిన టూల్స్‌ను అవి వినియోగించుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం మీ ఆర్డర్‌బుక్ ఎంత? మా కంపెనీ పాలసీ ప్రకారం దేశాలవారీగా ఆదాయాలు, ఆర్డర్ బుక్ విలువ చెప్పలేం. కానీ ఇక్కడ ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, టాటా గ్రూపు, కల్యాణి వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మొత్తం అన్నిదేశాలూ కలిపితే అంతర్జాతీయంగా మా సంస్థ ఆదాయం 2.5 బిలియన్ డాలర్లు దాటుతోంది. ఆటోడెస్క్ టెక్నాలజీ వినియోగిస్తే ప్రాజెక్టు వ్యయం ఏ మేరకు తగ్గుతుంది? సమయం ఎంత ఆదా అవుతుంది? మా టెక్నాలజీతో ఎంతటి భారీ ప్రాజెక్టునైనా 3డీలో డిజైన్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే వాటిని రియల్ టైమ్‌లోనే క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఆటోడెస్క్ను వినియోగించారు. దీంతో మలుపుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండేలా చక్కగా డిజైన్ చేయగలిగారు. పైపులకు సంబంధించి ఎన్ని వంపులు తిరిగినా మా టెక్నాలజీతో అక్కడొచ్చే సమస్యలు ఇట్టే తెలిసిపోతాయి. ఇక వ్యయం, సమయం ఎంత తగ్గుతుందనేది ప్రాజెక్టును బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద సగటున 20-30% ఖర్చు కలిసొస్తుంది. ఆర్థిక మందగమనంతో ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి కదా! మీ వ్యాపారం కూడా..? అలాంటిదేమీ లేదు. ఇండియాలో మౌలిక వసతుల రంగం ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మున్ముందు 40 శాతం మంది జనాభా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళతారని అంచనా. వీరందరికీ మౌలిక వసతులు కల్పించడానికి భారీ పెట్టుబడులు కావాలి. తాజాగా 17 విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్, సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్స్ సంఖ్య 25 శాతం పెరుగుతుందని అంచనా. వీటన్నిటికీ మా టెక్నాలజీ అవసరం కనక ఇండియా మాకు కీలకమైన మార్కెట్. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఏం చేస్తున్నారు? మీడియా, వినోద రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాల్లో మా టెక్నాలజీనే వినియోగించారు. మా టెక్నాలజీ వల్ల అవి గ్రాఫిక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తెలుగులో నిర్మిస్తున్న బాహుబలి, రాణి రుద్రమ అనే కాదు... గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే ఏ సినిమా అయినా మా టెక్నాలజీని వాడాల్సిందే. ఇండియాలో విస్తరణ సంగతేంటి? ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రం పనిచేస్తోంది. ఆటోడెస్క్ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఏఐసీటీఈ, విద్యాశాఖలతో ఒప్పందాలు చేసుకున్నాం. -
‘మోనో’ల్లాసం
సాక్షి, ముంబై: మోనో రైల్లో ప్రయాణించేందుకు ముంబైకర్లు ఆసక్తి చూపుతున్నారు. ఊహించిన దానికంటే వారినుంచి ఎక్కువ స్పందన వస్తోంది.దేశ ఆర్థిక రాజధానిలో ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలును ప్రారంభించిన విషయం విధితమే. ఈ రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించినప్పటికీ ప్రత్యక్షంగా రెండో తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. గడచిన వారం రోజుల్లో ఏకంగా 1.36 లక్షలకు పైగానే ప్రయాణికులు మోనో రైలు సేవలను ఆస్వాధించినట్లు జారీ చేసిన టికెట్లను బట్టి వెల్లడైంది. నగర ప్రజలకు సేవలు అందిస్తున్న లోకల్ రైళ్లు, బెస్ట్ బస్సులతో పోలిస్తే మోనోరైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంది. పైగా చార్జీలు కూడా తక్కువే కావడంతో అత్యధిక శాతం ఇందులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అన్ని స్టేషన్లలో విపరీతంగా రద్దీ కనిపించింది. ప్రారంభంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని గంటన్నర వరకు సేవలను పొడగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పరిస్థితి రాలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న లక్ష్యం వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను ప్రారంభించినా చాలామంది జాయ్ రైడ్ చేసేందుకు ప్రయాణించినట్లు అంచనా వేశారు. ఈ రద్దీ మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఏ లక్ష్యం కోసం ఈ సేవలు ప్రారంభించామో అది నెరవేరనుందని అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ప్రారంభించిన చెంబూర్-వడాల టర్మినస్ల మధ్య వారం రోజుల్లో మొత్తం 592 ట్రిప్పులు నడవగా అందులో సుమారు 1.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 1,400 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోగా 1,32,523 టోక న్లు, 1,33,932 టికెట్లు విక్రయాలు జరిగాయి. అయితే వీరంత కేవలం మోనో రైలు ప్రయాణాన్ని ఆస్వాధించేందుకు అందులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
‘మోనో’ ప్రయాణికులకు పాట్లు
కొత్త రూపాయి నాణేలను స్వీకరించని టీవీఎం మెషీన్లు నిరాశతో వెనుదిరిగిన నగరవాసులు సాక్షి, ముంబై: దేశంలోనే ప్రప్రథమంగా ప్రారంభమైన మోనో రైలులో ప్రయాణించేందుకు ఆశగా వచ్చిన ముంబైకర్లకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టికెట్ జారీ చేసే యంత్రంలో సమస్యలు తలెత్తడంతో నిరాశగా వెనుదిరిగారు. అయితే ఈ టికెట్ వెండింగ్ మిషన్(టీవీఎం) పురాతన రూపాయి నాణేలను మాత్రమే స్వీకరిస్తోంది. కొత్త రూపాయి నాణేలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నాణేలను ఈ మిషన్ స్వీకరిస్తున్నప్పటికీ టికెట్లను మాత్రం జారీ చేయడం లేదని ప్రయాణికులు వాపోయారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది ప్రయాణికులు మోనోరైలులో ప్రయాణించేందుకు స్టేషన్లకు తరలివచ్చారు. అయితే ఈ మిషన్లు పాత నాణేలను మాత్రమే స్వీకరించడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు. ‘ఈ మిషన్లను మూడు ఏళ్ల క్రితమే సిద్ధం చేసి ఉంచారు. అప్పుడు కొత్త ఒక్కరూపాయి నాణేం అందుబాటులోకి రాకపోవడంతో ఈ నాణాన్ని టీవీఎం మిషన్ తిరస్కరిస్తోంద’ని ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఇండియన్ మాన్యుఫాక్చర్స్’ నుంచి కొనుగోలు చేసిన ఈ యంత్రాలు వడాలాలోనే కాకుండా ఇతర స్టేషన్లలో కూడా పనిచేయలేదన్నారు. వీటివల్ల తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతుండటంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి వీటి సేవలను నిలిపివేశామని తెలిపారు. చాలామంది ప్రయాణికులు కొత్త రూపాయి నాణేలను ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ మిషన్లు తరచూ పని చేయకుండా పోతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు ఏ నాణేం ఇన్సర్ట్ చేసిన ఈ మిషన్ స్వీకరించే విధంగా త్వరలోనే తీర్చిదిద్దుతామని అధికారి వెల్లడించారు. -
మోనో రైలు వచ్చేసింది!
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం వడాలా డిపోలో జెండా ఊపి మోనో రైలును ప్రారంభించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ఈ రైలులో తొలిసారి ప్రయాణించేందుకు రాజకీయ ప్రముఖులతోపాటు ఉన్నతాధికారులు వడాలా డిపోకు వచ్చారు. వీరి టలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎంఆర్డీఏ అధికారులున్నారు. వడాలా డిపో నుంచి బయలుదేరిన మోనో రైలు 20 నిమిషాల్లో చెంబూర్ స్టేషన్‌కు చేరుకుంది. మోనో రైలు సేవలు ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రైలును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినా.. ఆయన రావడం కుదరకపోవడంతో సీఎం ప్రారంభించారు. మోనో రైలును ప్రారంభంలో ప్రతీ 15 నిమిషాలకు ఒకటి చొప్పున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నడపనున్నారు. నెల తర్వాత రెండు షిఫ్టుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులను పెంచనున్నారు. ఒక బోగీలో 20 మంది కూర్చొని, 130 మంది నిలబడి ప్రయాణించే వీలుంది. మొత్తం నాలుగు బోగీల్లో ఒకేసారి 600 మంది ప్రయాణించవచ్చు. ఒక్క గంటలో సుమారు 20 వేల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణించేందుకు ఆస్కారం. రైలు మార్గం పొడవు.. 8.93 కిలోమీటర్లు. వేగం.. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు అన్నీ ఎయిర్ కండిషన్డ్ బోగీలు. మొదటి బోగీ నుంచి చివరి బోగీ వరకు వెళ్లొచ్చు చార్జీ రూ.5. కార్డు పంచింగ్ చేశాకే రైల్వే స్టేషన్లోకి ప్రవేశం మెట్రో రైలుతో పోల్చితే మోనో రైలు నిర్మాణ వ్యయం చాలా తక్కువే. ్ఞ నగరాల్లోని రోడ్లు విస్తరించేందుకు (వెడల్పు) స్థలం లభించని సమయంలో మోనో రైలు చాలా తక్కువ స్థలంలో పరుగెత్తనున్నాయి. ముఖ్యంగా భూమికి సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తుపై నుంచి వెళ్లే ఈ రైళ్లు రోడ్ల మధ్య ఉండే డివైడర్లపై ఒకే ఒక్క స్తంభంపై రెండు రైళ్లు వెళ్లేందుకు రైల్వేమార్గం. వడాలా-చెంబూర్‌ల మధ్య బస్సు ప్రయాణం వేగవంతం మెట్రోరైళ్లు సహా సాధారణంగా రైళ్లు సమాంతరంగా ఉండే రెండు పట్టాలపై నడుస్తాయి. మోనోరైళ్లకు ఒకే పట్టా ఉంటుంది. పట్టా వెడల్పు కూడా రైలు కంటే చాలా తక్కువగా ఉంటుంది. తొలుత జర్మనీలో మోనోరైళ్లు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో 1950లలో ఇవి ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ ఇక్కట్లను గట్టెక్కేందుకు జపాన్ వీటిని విరివిగా వాడుకలోకి తెచ్చింది. -
మోనో.. రయ్..రయ్..!
సేవలు ప్రారంభం నేటినుంచి పూర్తిస్థాయి అందుబాటులోకి.. సాక్షి, ముంబై: ముంబై వాసుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తాజాగా మోనో రైలు సేవలు ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యనుంచి కూడా ప్రజలకు ఊరట లభించనుంది. చెంబూర్-వడాలా మోనో మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఏసీ బోగీల్లో తక్కువ ఖర్చుతోనే ప్రయాణించేందుకు వీలుపడనుంది. పర్యాటకులకు పండుగే.. దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన మోనో రైలు సేవలు తొందర్లోనే పర్యాటకుల డెస్టినేషన్‌గా మారనున్నాయని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా మోనో రైలును చూడాలని కలలు గంటున్న ముంబైవాసులతోపాటు ముంబైకి వచ్చే పర్యాటకులు మోనోరైలు ప్రయాణాన్ని ఒక్కసారైనా ఆస్వాదించాలని ఆరాటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టెస్ట్ డ్రైవ్ సమయంలో కూడా ఈ రైలు పై నుంచి వెళ్లే సమయంలో కిందకు చూస్తే రోడ్లపై రద్దీ కన్పించేది. అదేవిధంగా ఈ రైలు వెళ్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తూ జనాలు ఆనందించడం కనిపించింది. కాగా, ఆదివారం నుంచి మోనో రైలు అందుబాటులోకి రానుందని తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు దీనిలో ప్రయాణించేందుకు చెంబూర్, వడాలాతోపాటు ఇతర మోనో రైల్వేస్టే షన్లకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. సీజన్ పాసుల్లేవ్.. ! లోకల్ రైళ్ల మాదిరిగా మోనోరైలులో నెలసరి సీజన్ పాస్లుండవని తెలిసింది. కేవలం స్మార్ట్ కార్డు లేదా కూపన్‌ను వినియోగించుకోవాల్సి వస్తుంది. ప్రారంభంలో రూ. 150 కూపన్ తీసుకున్నట్టయితే రూ. 100 డిపాజిట్‌గా ఉంచుకుని రూ. 50 ప్రయాణికులు వినియోగించుకునేందుకు వీలుకల్పించనున్నారు. అనంతరం ఈ కార్డులో డబ్బులు రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. అదే విధంగా మోనో రైల్వేస్టేషన్లలోని మొదటి అంతస్తులో ఉండే టిక్కెట్ కౌంటర్లో డబ్బులు చెల్లించిన అనంతరం నాణం ఆకారంలో ఉండే కూపన్ ఇస్తారు. ఈ కూపన్నుగేట్లో వేస్తే ఫ్లాట్ఫారంలోపలికి ప్రవేశం లభించనుంది. ‘మోనో’ కోసం బస్ట్ బస్సులు: మోనోరైలు సేవలు ప్రారంభంలోకి రాగానే ఆయా రైలుస్టేషన్ల నుంచి ప్రతి 15 నిమిషాలకు బెస్ట్ బస్సు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మోనోరైలు స్టేషన్ల నుంచి తాము బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ.. మోనో రైలు సేవలు ప్రారంభం కాగానే చాలా మంది నగర వాసులు ‘జాయ్ రైడ్’ కోసం మోనోరైలును సందర్శిస్తారన్నారు. దీంతో తాము కూడా వడాలా రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి షటిల్ సేవలను నడపనున్నట్లు తెలిపారు. రవాణావ్యవస్థలో కొత్త శకం.. సాక్షి, ముంబై: దేశరవాణా వ్యవస్థలో కొత్త ఆధ్యాయం ప్రారంభమైంది. దేశంలోని తొలి రైలు ముంబై - ఠాణేల మధ్య 1853లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం దేశవ్యాప్తంగా రైల్వే సేవలను విస్తరించారు. అప్పటినుంచి రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులుచేర్పులు జరిగాయి. కాగా, 161 సంవత్సరాల అనంతరం దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం మోనో రైలు రూపంలో ప్రారంభమైంది. ఈ సేవలు కూడా ముంబైలోనే ప్రారంభ ం కావడం విశేషం. దేశ ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈ రైలు సేవలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటికి తోడు జలరవాణాను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండటం గమనార్హం. -
మోనో కూత.. రేపే
ప్రారంభించనున్న సీఎం పృథ్వీరాజ్ ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న సేవలు ఎమ్మెమ్మార్డీయే చీఫ్ మదన్ సాక్షి, ముంబై: హమ్మయ్యా! మోనో రైలు ప్రారంభానికి ముహూర్తం దొరికింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ రైలు సేవలను శనివారం నుంచి ప్రారంభించాలని ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ప్రారంభం కానున్న మోనో రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారని ఎమ్మెమ్మార్డీయే చీఫ్ యూపీఎస్ మదన్ గురువారం విలేకరులకు తెలిపారు. సీఎం ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ.మూడు వేల కోట్ల వ్యయంతో రెండు దశల్లో నిర్మించాలని అనుకున్న ఈ ప్రాజెక్టులో తొలి దశలో పూర్తయిన 8.8 కిలోమీటర్ల మేర వడాల- చెంబూర్ మార్గంలో ప్రజలకు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రెండో దశలో ఈ సర్వీసులను దక్షిణ ముంబైలోని సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు పొడిగిస్తామని మదన్ వెల్లడించారు. ఈ మోనో రైలు సేవలకు రూ.5 నుంచి 11 మధ్యలో చార్జీలను ఖరారు చేశామన్నారు. తొలి దశలో ఆరు రైళ్లు సేవలందించనున్నాయని, రెండో దశ పనులు పూర్తయిన తర్వాత మరో పది రైళ్లు వచ్చి చేరుతాయన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నాలుగు కోచ్‌ల్లో 2,300 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉందని వివరించారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి సర్వీసులు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ సేవల వల్ల వడాల నుంచి చెంబూరుకు వెళ్లాలంటే ప్రస్తుతం పడుతున్న 40 నిమిషాలకు సరిగ్గా సగానికి తగ్గే అవకాశముందన్నారు. 21 నిమిషాల్లో గమ్యాన్ని చేరే అవకాశముందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన రూ.మూడు వేల కోట్లలో ఇప్పటికే 1,900 కోట్లను ఖర్చు చేశామని వివరించారు. వడాల-చెంబూర్ 8.8 కి.మీ. మార్గంపై ప్రారంభ దశలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ రైళ్లు పరుగెడుతాయి. ప్రయాణికుల రద్దీ, ఎదురయ్యే ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత రైళ్ల ట్రిప్పులను పెంచే విషయాన్ని ఆలోచిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. అంతా జాప్యమే ఇదిలావుండగా ఎమ్మెమ్మార్డీయే ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు సంవత్సరన్నర క్రితమే అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే అనేక సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో తరుచూ గడువు పొడగించింది. ఇదివరకు సుమారు 11సార్లు డెడ్లైన్లు పొడిగించారు. అదే సందర్భంలో రైల్వే బోర్డుకు చెందిన ‘సేఫ్టీ సెక్యూరిటీ ఆథారిటీ’ నుంచి భద్రత సర్టిఫికెట్ లభించకపోవడంతో మోనో రైళ్లన్నీ యార్డులకే పరిమితమయ్యాయి. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో అసలు మోనో రైలు పరుగులు తీస్తుందా అనే సందేహం మొదలైంది. అందులో ప్రయాణిస్తామా..? అనే నమ్మకం కూడా ముంబైకర్లకు లేకుండా పోయింది. భద్రత ఏర్పాట్లు... నగరం ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉండడంతో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్విని భిడే చెప్పారు. అన్ని స్టేషన్లలో, డిపోలలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని మోహరించామన్నారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్ (ఎంఎస్ఎస్సీ) నుంచి దాదాపు 500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. పేలుడు పదార్థాలను గుర్తించే స్కాన ర్లను కూడా త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వేసేందుకు 336 సీసీ టీవీ కెమెరాలను రైళ్లల్లో, స్టేషన్లు, కార్ డిపోలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. -
‘మోనో’ ప్రారంభం మళ్లీ వాయిదా
సాక్షి, ముంబై: ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ప్రముఖులకు సమయం లేకపోవడంతో మోనో రైలు ప్రారంభ కార్యక్రమం మరోసారి వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 26న ప్రారంభం కావాల్సి ఉంది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం నగరానికి చేరుకునే అవకాశముంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను శివాజీపార్కుకు బదులు మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఆ రోజు త్రివిధ దళాలు సంయుక్తంగా విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ కారణంగా మోనో రైలు ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంపై ఎవరూ అంతగా దృష్టిసారించడం లేదు. అయితే ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.