గ్రీన్ బిల్డింగ్స్, ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మైట్రో రైలు... ముంబై మోనో రైలు... ఢిల్లీలోని టెర్మినల్-3 ఇలా ఏ భారీ ప్రాజెక్టు చూసినా వాటి వెనక ‘ఆటోడెస్క్’ హస్తం కనిపిస్తుంది. ఇవే కాదు! అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి పూర్తి గ్రాఫిక్స్‌తో నిండిన సినిమాల్లోనూ ఆటోడెస్క్ అద్భుతాలుంటాయి.
అంతెందుకు! మన తెలుగులో రాబోతున్న రాణి రుద్రమ, బాహుబలి సినిమాల్లోనూ ఆటోడెస్క్ డిజైన్స్ కళ్లకు కట్టబోతున్నాయి. అదీ! ఆటోడెస్క్ ప్రత్యేకత అంటే. అందుకే ఒక చిన్న ఆఫీసులో ఆరంభమైన ఈ సంస్థ ఇపుడు ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఐపాడ్, ఐఫోన్ అప్లికేషన్స్‌తో పాటు 3డీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సేవలందిస్తున్న ఈ సంస్థ సీనియర్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మేనేజర్(ఐపీఎం)
టెర్రీ డి బెన్నెట్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇండియాతో సహా రాష్ట్ర మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ఇండియాలో ఆటోడెస్క్ ఎలాంటి సేవలందిస్తోంది?
ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. కొన్ని నేరుగా మేమే క్లయింట్లకు అందిస్తున్నాం. మరికొన్ని ఆర్డర్లను మాత్రం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు మా ద్వారా అందిస్తున్నాయి. మేం డెవలప్ చేసిన టూల్స్‌ను అవి వినియోగించుకుంటున్నాయి.
ఇండియాలో ప్రస్తుతం మీ ఆర్డర్‌బుక్ ఎంత?
మా కంపెనీ పాలసీ ప్రకారం దేశాలవారీగా ఆదాయాలు, ఆర్డర్ బుక్ విలువ చెప్పలేం. కానీ ఇక్కడ ఎల్ అండ్ టీ, బీహెచ్‌ఈఎల్, టాటా గ్రూపు, కల్యాణి వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మొత్తం అన్నిదేశాలూ కలిపితే అంతర్జాతీయంగా మా సంస్థ ఆదాయం 2.5 బిలియన్ డాలర్లు దాటుతోంది.
ఆటోడెస్క్ టెక్నాలజీ వినియోగిస్తే ప్రాజెక్టు వ్యయం ఏ మేరకు తగ్గుతుంది? సమయం ఎంత ఆదా అవుతుంది?
మా టెక్నాలజీతో ఎంతటి భారీ ప్రాజెక్టునైనా 3డీలో డిజైన్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే వాటిని రియల్ టైమ్‌లోనే క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఆటోడెస్క్‌ను వినియోగించారు. దీంతో మలుపుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండేలా చక్కగా డిజైన్ చేయగలిగారు. పైపులకు సంబంధించి ఎన్ని వంపులు తిరిగినా మా టెక్నాలజీతో అక్కడొచ్చే సమస్యలు ఇట్టే తెలిసిపోతాయి. ఇక వ్యయం, సమయం ఎంత తగ్గుతుందనేది ప్రాజెక్టును బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద సగటున 20-30% ఖర్చు కలిసొస్తుంది.
ఆర్థిక మందగమనంతో ఇన్‌ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి కదా! మీ వ్యాపారం కూడా..?
అలాంటిదేమీ లేదు. ఇండియాలో మౌలిక వసతుల రంగం ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మున్ముందు 40 శాతం మంది జనాభా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళతారని అంచనా. వీరందరికీ మౌలిక వసతులు కల్పించడానికి భారీ పెట్టుబడులు కావాలి. తాజాగా 17 విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్, సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్స్ సంఖ్య 25 శాతం పెరుగుతుందని అంచనా. వీటన్నిటికీ మా టెక్నాలజీ అవసరం కనక ఇండియా మాకు కీలకమైన మార్కెట్.
మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఏం చేస్తున్నారు?
మీడియా, వినోద రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాల్లో మా టెక్నాలజీనే వినియోగించారు. మా టెక్నాలజీ వల్ల అవి గ్రాఫిక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తెలుగులో నిర్మిస్తున్న బాహుబలి, రాణి రుద్రమ అనే కాదు... గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే ఏ సినిమా అయినా మా టెక్నాలజీని వాడాల్సిందే.
ఇండియాలో విస్తరణ సంగతేంటి?
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రం పనిచేస్తోంది. ఆటోడెస్క్ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఏఐసీటీఈ, విద్యాశాఖలతో ఒప్పందాలు చేసుకున్నాం.