Autodesk
-
ఆండ్రాయిడ్ వీల్‌చెయిర్.. సూపర్ నాజిల్
స్టార్టప్.. స్టార్టప్.. స్టార్టప్.. ఇటీవల అందరికీ చిరపరిచితమవుతున్న పేరు ఇది. యువతరం కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు.. తద్వారా కొత్త ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. సాఫ్ట్వేర్ రంగాన్ని కాసేపు పక్కనబెడితే.. సామాజిక ప్రభావాన్ని చూపే స్టార్టప్ కంపెనీలూ దేశంలో బోలెడున్నాయి. వాటిల్లో మచ్చుకు రెండింటి గురించి స్థూలంగా.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గౌరవాన్ని కాపాడే వీల్‌చెయిర్.. ప్రమాదం.. తీవ్రవాద దుశ్చర్య.. లేదంటే అంతు చిక్కని రుగ్మత.. ఇలా రకరకాల కారణాల వల్ల కొంతమంది చక్రాల కుర్చీకే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తూంటుంది. అటు ఇటు కదిలేందుకు ఈ చక్రాల కుర్చీలు బాగానే ఉపయోగపడతాయి. మరి.. స్నానం చేయాలంటే? ఉదయాన్నే కడుపులోని బరువు దించేసుకోవాలంటే? ఇతరుల సాయం తప్పనిసరి. దీని వల్ల చాకిరి చేసేవారికీ, చేయించుకునేవారికీ ఇబ్బందే. ఇకపై మాత్రం ఇలా కాదంటున్నారు గణేష్ సోనావాణే. ఆర్కాట్రాన్ పేరుతో ఈయన ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సరికొత్త వీల్‌చెయిర్‌ను సిద్ధం చేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ సాయంతో ఎస్ఏఎస్100 పేరుతో తయారు చేసిన ఈ సరికొత్త వీల్‌చెయిర్ అందుబాటులో ఉంటే స్నానం, బాత్రూమ్ అవసరాలకు ఇతరుల సాయం తీసుకునే అవసరమే ఉండదని అంటున్నారు కాలికట్ ఎన్ఐటీ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ చదివిన గణేష్. సహచరులు నలుగురితో కలసి ఆర్కాట్రాన్ను స్థాపించారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి వీల్చెయిర్లు ఇప్పటికే అందుబాటు ఉన్నాయి. కాకపోతే వాటి ఖరీదు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటుంది. చైనా కంపెనీలు కొన్ని నాసికరం వీల్‌చెయిర్లను రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండే, బ్యాటరీతో పనిచేసే కమోడ్, షవర్ వీల్‌చెయిర్‌ను రూ.13 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు గణేష్ తెలిపారు. చుక్క కూడా వృథా పోనీదు.. పెట్రోల్ బంకుల్లో మీరో విషయం గమనించారా? వాహనంలోకి పెట్రోల్, డీజిల్ వేయించుకునేటప్పుడు.. చివరల్లో ఒకట్రెండు చుక్కల ఇంధనం వృథా అవుతూంటుంది. ఆ.. చుక్కలే కదా అని మనం పట్టించుకోము. కానీ బెంగళూరుకు చెందిన ఫజల్ ఇమ్దాద్ షిర్పూర్వాలా పట్టించుకున్నాడు. ఎందుకంటే.. చుక్క చుక్క కలిసి.. దేశం మొత్తమ్మీద వృథా అవుతున్న ఇంధనం దాదాపు 22 కోట్ల లీటర్లు.. విలువ అక్షరాలా.. 1,300 కోట్ల రూపాయలు కాబట్టి! ఈ వృథాను ఎంత అరికడితే అంత మేరకు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చన్నది తెలిసిందే. అందుకే ఫజల్ ఫియాజ్ టెక్ పేరుతో ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. ఒక్క చుక్క కూడా వృథా కాకుండా సరికొత్త ఫ్యుయెల్ డిస్పెన్సర్ సిద్ధం చేశాడు. వీటిని కొనమని చమురు కంపెనీలను కోరితే.. వారెంటీ ఉన్నందున బంకుల్లో ఇప్పటికే వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లను మార్చడం కష్టమని చేతులెత్తేశారు. దీంతో ఫజల్ వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లకు బిగించుకునేలా ఓ సరికొత్త నాజిల్‌తో కూడిన కిట్‌ను తయారు చేశాడు. దీంతో వారెంటీకి ఎలాంటి సమస్య రాదని ఉన్న వాటిని మార్చాల్సిన అవసరమూ ఏర్పడదని అంటున్నారు. ఆటోడెస్క్ సాయం.. ఐడియాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మాత్రం కష్టం. హైటెక్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటే ఈ పని కొంచెం సులువు అవుతుంది. కానీ వీటి ఖరీదెక్కువ. అందుకే తాము కొత్త కొత్త ఐడియాలతో ముందుకొచ్చే ఇన్నొ వేటర్స్కు సాయం అందించాలని నిర్ణయించామని అంటోంది ఆటోడెస్క్. ఆటోక్యాడ్ వంటి డిజైనింగ్, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసే ఈ సంస్థ ‘ఎంటర్ ప్రెన్యూర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా ఏటా కొంత మంది ఇన్నొవేటర్స్కు తమ సాఫ్ట్‌వేర్‌ను మూడేళ్లపాటు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టార్టప్ కంపెనీలకు ఈ రకమైన సాయం అందించామని, భారత్‌లో ఆర్కాట్రాన్, ఫయాజ్టెక్ వంటి 20 స్టార్టప్‌లకు చేయూత అందిస్తున్నామని సంస్థ సీనియర్ అధికారి జేక్ వేల్స్ ‘సాక్షి’కి తెలిపారు. -
గ్రీన్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మైట్రో రైలు... ముంబై మోనో రైలు... ఢిల్లీలోని టెర్మినల్-3 ఇలా ఏ భారీ ప్రాజెక్టు చూసినా వాటి వెనక ‘ఆటోడెస్క్’ హస్తం కనిపిస్తుంది. ఇవే కాదు! అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి పూర్తి గ్రాఫిక్స్‌తో నిండిన సినిమాల్లోనూ ఆటోడెస్క్ అద్భుతాలుంటాయి. అంతెందుకు! మన తెలుగులో రాబోతున్న రాణి రుద్రమ, బాహుబలి సినిమాల్లోనూ ఆటోడెస్క్ డిజైన్స్ కళ్లకు కట్టబోతున్నాయి. అదీ! ఆటోడెస్క్ ప్రత్యేకత అంటే. అందుకే ఒక చిన్న ఆఫీసులో ఆరంభమైన ఈ సంస్థ ఇపుడు ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఐపాడ్, ఐఫోన్ అప్లికేషన్స్‌తో పాటు 3డీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్ సేవలందిస్తున్న ఈ సంస్థ సీనియర్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మేనేజర్(ఐపీఎం) టెర్రీ డి బెన్నెట్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇండియాతో సహా రాష్ట్ర మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఇండియాలో ఆటోడెస్క్ ఎలాంటి సేవలందిస్తోంది? ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. కొన్ని నేరుగా మేమే క్లయింట్లకు అందిస్తున్నాం. మరికొన్ని ఆర్డర్లను మాత్రం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు మా ద్వారా అందిస్తున్నాయి. మేం డెవలప్ చేసిన టూల్స్‌ను అవి వినియోగించుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం మీ ఆర్డర్‌బుక్ ఎంత? మా కంపెనీ పాలసీ ప్రకారం దేశాలవారీగా ఆదాయాలు, ఆర్డర్ బుక్ విలువ చెప్పలేం. కానీ ఇక్కడ ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, టాటా గ్రూపు, కల్యాణి వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మొత్తం అన్నిదేశాలూ కలిపితే అంతర్జాతీయంగా మా సంస్థ ఆదాయం 2.5 బిలియన్ డాలర్లు దాటుతోంది. ఆటోడెస్క్ టెక్నాలజీ వినియోగిస్తే ప్రాజెక్టు వ్యయం ఏ మేరకు తగ్గుతుంది? సమయం ఎంత ఆదా అవుతుంది? మా టెక్నాలజీతో ఎంతటి భారీ ప్రాజెక్టునైనా 3డీలో డిజైన్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే వాటిని రియల్ టైమ్‌లోనే క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఆటోడెస్క్ను వినియోగించారు. దీంతో మలుపుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండేలా చక్కగా డిజైన్ చేయగలిగారు. పైపులకు సంబంధించి ఎన్ని వంపులు తిరిగినా మా టెక్నాలజీతో అక్కడొచ్చే సమస్యలు ఇట్టే తెలిసిపోతాయి. ఇక వ్యయం, సమయం ఎంత తగ్గుతుందనేది ప్రాజెక్టును బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద సగటున 20-30% ఖర్చు కలిసొస్తుంది. ఆర్థిక మందగమనంతో ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి కదా! మీ వ్యాపారం కూడా..? అలాంటిదేమీ లేదు. ఇండియాలో మౌలిక వసతుల రంగం ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మున్ముందు 40 శాతం మంది జనాభా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళతారని అంచనా. వీరందరికీ మౌలిక వసతులు కల్పించడానికి భారీ పెట్టుబడులు కావాలి. తాజాగా 17 విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్, సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్స్ సంఖ్య 25 శాతం పెరుగుతుందని అంచనా. వీటన్నిటికీ మా టెక్నాలజీ అవసరం కనక ఇండియా మాకు కీలకమైన మార్కెట్. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఏం చేస్తున్నారు? మీడియా, వినోద రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాల్లో మా టెక్నాలజీనే వినియోగించారు. మా టెక్నాలజీ వల్ల అవి గ్రాఫిక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తెలుగులో నిర్మిస్తున్న బాహుబలి, రాణి రుద్రమ అనే కాదు... గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే ఏ సినిమా అయినా మా టెక్నాలజీని వాడాల్సిందే. ఇండియాలో విస్తరణ సంగతేంటి? ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రం పనిచేస్తోంది. ఆటోడెస్క్ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఏఐసీటీఈ, విద్యాశాఖలతో ఒప్పందాలు చేసుకున్నాం.