ఆండ్రాయిడ్‌ వీల్‌చెయిర్‌.. సూపర్‌ నాజిల్‌ | Android Wheelchair .. Super nozzles | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్‌ వీల్‌చెయిర్‌.. సూపర్‌ నాజిల్‌

Published Sat, Apr 1 2017 4:32 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

ఆండ్రాయిడ్‌ వీల్‌చెయిర్‌.. సూపర్‌ నాజిల్‌ - Sakshi

ఆండ్రాయిడ్‌ వీల్‌చెయిర్‌.. సూపర్‌ నాజిల్‌

స్టార్టప్‌.. స్టార్టప్‌.. స్టార్టప్‌.. ఇటీవల అందరికీ చిరపరిచితమవుతున్న పేరు ఇది. యువతరం కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు.. తద్వారా కొత్త ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని కాసేపు పక్కనబెడితే.. సామాజిక ప్రభావాన్ని చూపే స్టార్టప్‌ కంపెనీలూ దేశంలో బోలెడున్నాయి. వాటిల్లో మచ్చుకు రెండింటి గురించి స్థూలంగా..  
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


గౌరవాన్ని కాపాడే వీల్‌చెయిర్‌..
ప్రమాదం.. తీవ్రవాద దుశ్చర్య.. లేదంటే అంతు చిక్కని రుగ్మత.. ఇలా రకరకాల కారణాల వల్ల కొంతమంది చక్రాల కుర్చీకే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తూంటుంది. అటు ఇటు కదిలేందుకు ఈ చక్రాల కుర్చీలు బాగానే ఉపయోగపడతాయి. మరి.. స్నానం చేయాలంటే? ఉదయాన్నే కడుపులోని బరువు దించేసుకోవాలంటే? ఇతరుల సాయం తప్పనిసరి. దీని వల్ల చాకిరి చేసేవారికీ, చేయించుకునేవారికీ ఇబ్బందే. ఇకపై మాత్రం ఇలా కాదంటున్నారు గణేష్‌ సోనావాణే. ఆర్కాట్రాన్‌ పేరుతో ఈయన ఏర్పాటు చేసిన స్టార్టప్‌ ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే సరికొత్త వీల్‌చెయిర్‌ను సిద్ధం చేసింది.

ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ సాయంతో ఎస్‌ఏఎస్‌100 పేరుతో తయారు చేసిన ఈ సరికొత్త వీల్‌చెయిర్‌ అందుబాటులో ఉంటే స్నానం, బాత్రూమ్‌ అవసరాలకు ఇతరుల సాయం తీసుకునే అవసరమే ఉండదని అంటున్నారు కాలికట్‌ ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ ఇంజనీరింగ్‌ చదివిన గణేష్‌. సహచరులు నలుగురితో కలసి ఆర్కాట్రాన్‌ను స్థాపించారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి వీల్‌చెయిర్‌లు ఇప్పటికే అందుబాటు ఉన్నాయి. కాకపోతే వాటి ఖరీదు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటుంది. చైనా కంపెనీలు కొన్ని నాసికరం వీల్‌చెయిర్లను రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండే, బ్యాటరీతో పనిచేసే కమోడ్, షవర్‌ వీల్‌చెయిర్‌ను రూ.13 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు గణేష్‌ తెలిపారు.

చుక్క కూడా వృథా పోనీదు..
పెట్రోల్‌ బంకుల్లో మీరో విషయం గమనించారా? వాహనంలోకి పెట్రోల్, డీజిల్‌ వేయించుకునేటప్పుడు.. చివరల్లో ఒకట్రెండు చుక్కల ఇంధనం వృథా అవుతూంటుంది. ఆ.. చుక్కలే కదా అని మనం పట్టించుకోము. కానీ బెంగళూరుకు చెందిన ఫజల్‌ ఇమ్‌దాద్‌ షిర్‌పూర్‌వాలా పట్టించుకున్నాడు. ఎందుకంటే.. చుక్క చుక్క కలిసి.. దేశం మొత్తమ్మీద వృథా అవుతున్న ఇంధనం దాదాపు 22 కోట్ల లీటర్లు.. విలువ అక్షరాలా.. 1,300 కోట్ల రూపాయలు కాబట్టి! ఈ వృథాను ఎంత అరికడితే అంత మేరకు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చన్నది తెలిసిందే.

అందుకే ఫజల్‌ ఫియాజ్‌ టెక్‌ పేరుతో ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. ఒక్క చుక్క కూడా వృథా కాకుండా సరికొత్త ఫ్యుయెల్‌ డిస్పెన్సర్‌ సిద్ధం చేశాడు. వీటిని కొనమని చమురు కంపెనీలను కోరితే.. వారెంటీ ఉన్నందున బంకుల్లో ఇప్పటికే వాడుతున్న ఫ్యుయెల్‌ డిస్పెన్సర్లను మార్చడం కష్టమని చేతులెత్తేశారు. దీంతో ఫజల్‌ వాడుతున్న ఫ్యుయెల్‌ డిస్‌పెన్సర్లకు బిగించుకునేలా ఓ సరికొత్త నాజిల్‌తో కూడిన కిట్‌ను తయారు చేశాడు. దీంతో వారెంటీకి ఎలాంటి సమస్య రాదని ఉన్న వాటిని మార్చాల్సిన అవసరమూ ఏర్పడదని అంటున్నారు.

ఆటోడెస్క్‌ సాయం..
ఐడియాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మాత్రం కష్టం. హైటెక్‌ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంటే ఈ పని కొంచెం సులువు అవుతుంది. కానీ వీటి ఖరీదెక్కువ. అందుకే తాము కొత్త కొత్త ఐడియాలతో ముందుకొచ్చే ఇన్నొ వేటర్స్‌కు సాయం అందించాలని నిర్ణయించామని అంటోంది ఆటోడెస్క్‌. ఆటోక్యాడ్‌ వంటి డిజైనింగ్, ఇంజనీరింగ్‌ సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేసే ఈ సంస్థ ‘ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఇంపాక్ట్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా ఏటా కొంత మంది ఇన్నొవేటర్స్‌కు తమ సాఫ్ట్‌వేర్‌ను మూడేళ్లపాటు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టార్టప్‌ కంపెనీలకు ఈ రకమైన సాయం అందించామని, భారత్‌లో ఆర్కాట్రాన్, ఫయాజ్‌టెక్‌ వంటి 20 స్టార్టప్‌లకు చేయూత అందిస్తున్నామని సంస్థ సీనియర్‌ అధికారి జేక్‌ వేల్స్‌ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement