Airport Projects
-
కొత్త ఎయిర్‌పోర్టులపై త్వరలో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఆరు కొత్త విమానాశ్రయాలకు సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరించనుంది. ఈ సంస్థ గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల (టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ) నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ఆరు విమానాశ్రయాలకు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను వివరించడంతో పాటు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించనుంది. దీంతో వీటికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి అవుతుంది. ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించిన అసలు ప్రక్రియ మొదలు కానుంది. అనుమానాల నివృత్తి.. అంచనా వ్యయంపై స్పష్టత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే మొత్తం రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుదిక్కులా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నివేదిక కోరుతూ కన్సల్టెన్సీ బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వాణిజ్య విభాగానికి అప్పగించింది. దాని ప్రతినిధులు పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించ (బ్రౌన్‌ఫీల్డ్) వచ్చని తెలిపారు. వాటితో పాటు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించారు. వీటన్నిటిలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమేనని తేల్చి ప్రాథమిక నివేదిక అందజేశారు. ఆ తర్వాత వాటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలు, కావాల్సిన భూమి వివరాలు, ఆయా విమానాశ్రయాల నిర్మాణం జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలతో ఫీజబిలిటీ రిపోర్టును అందజేశారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాలకు సంబంధించి ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో రెండు వేరువేరు అంచనాలను అందజేశారు. ఫేజ్–1 ప్రకారం రూ.1,350 కోట్లు, ఫేజ్–2 ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయం కానుంది. ఇక భూసేకరణకు ఇంతకు మించి ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గింపునకు సంబంధించి ఇప్పుడు జరగబోయే సమావేశంతో స్పష్టత రానుంది. ఇక పాల్వంచ, దేవరకద్ర, బసంత్‌నగర్ విమానాశ్రయాలకు సంబంధించి ఫీజబిలిటీ నివేదిక అస్పష్టంగా ఉంది. వీటిపైనా స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ రెండూ జీఎంఆర్‌కు..! ఆరు విమానాశ్రయాలను నిర్మిస్తామని, వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా విమానయాన శాఖను కోరారు. కానీ ప్రస్తుతం వ్యయ అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో రెండుమూడు ముందు చేపట్టి మిగతావి తర్వాత చేపడితే ఎలా ఉంటుందన్న విషయంలోనూ కొంత చర్చ జరుగుతోంది. దీనిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. మరోవైపు ఇప్పటికే మనుగడలో ఉన్న విమానాశ్రయానికి 150 కి.మీ. పరిధిలో రెండోది ఉండొద్దనే ఒక నిబంధన ఉంది. జీఎంఆర్ సంస్థ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చనే అంశంపై కూడా సమావేశంలో సూచనలు అందే అవకాశం ఉంది. ఆ రెంటినీ జీఎంఆర్‌కు అప్పగించే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లోఎయిర్పోర్టులకు కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ స్క్రీనింగ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో ఆ శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్‌చౌబే నేతృత్వంలోని ఈ కమిటీ సోమవారం సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు విమానాశ్రయాల ఏర్పాటు అంశంపై చర్చించింది. ఈ సమావేశానికి ఇందన, మౌలిక వసతుల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ హాజరై ఎయిర్‌పోర్టులకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో భోగాపురం (విజయనగరం), దగదర్తి (నెల్లూరు), ఓర్వకల్లు (కర్నూలు)లో విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారంతోపాటు, తెలంగాణలో ఓ కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు సైట్ క్లీయరెన్స్‌కు ఆమోదం తెలిపింది. కాగా విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నారు. దీనిని పీపీపీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయనుంది. ఏటా 63 లక్షల ప్రయాణికుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా తొలి విడతలో రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 1,390 ఎకరాలు అవసరమని అంచనా. ఇందులో 840 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 290 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రూ.88 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును కూడా పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. విశాఖ–చెన్నై, బెంగుళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఈ ఎయిర్‌పోర్టు నోడల్ పాయింట్ అవుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు 1,010 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి 240 ఎకరా భూమిని ఇప్పటికే సేకరించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఇది ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలు దేశీయ విమాన సర్వీసులకు పరిమితం కానున్నాయి. దగదర్తి, ఓర్వకల్లులో తక్కువ వ్యయంతో విమానాశ్రయాలను నిర్మించనున్నారు. ఒక్కో విమానాశ్రయాన్ని రూ. 88 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దగదర్తి విమనాశ్రయాన్ని పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. ఓర్వకల్లులో రాష్ట్ర ప్రభుత్వమే విమానాశ్రయం నిర్మించనుంది. దేశీయ విమాన సర్వీసులకు ఈ విమానాశ్రయాలు పరిమితమవుతాయి. -
గ్రీన్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మైట్రో రైలు... ముంబై మోనో రైలు... ఢిల్లీలోని టెర్మినల్-3 ఇలా ఏ భారీ ప్రాజెక్టు చూసినా వాటి వెనక ‘ఆటోడెస్క్’ హస్తం కనిపిస్తుంది. ఇవే కాదు! అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి పూర్తి గ్రాఫిక్స్‌తో నిండిన సినిమాల్లోనూ ఆటోడెస్క్ అద్భుతాలుంటాయి. అంతెందుకు! మన తెలుగులో రాబోతున్న రాణి రుద్రమ, బాహుబలి సినిమాల్లోనూ ఆటోడెస్క్ డిజైన్స్ కళ్లకు కట్టబోతున్నాయి. అదీ! ఆటోడెస్క్ ప్రత్యేకత అంటే. అందుకే ఒక చిన్న ఆఫీసులో ఆరంభమైన ఈ సంస్థ ఇపుడు ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఐపాడ్, ఐఫోన్ అప్లికేషన్స్‌తో పాటు 3డీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్ సేవలందిస్తున్న ఈ సంస్థ సీనియర్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మేనేజర్(ఐపీఎం) టెర్రీ డి బెన్నెట్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇండియాతో సహా రాష్ట్ర మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఇండియాలో ఆటోడెస్క్ ఎలాంటి సేవలందిస్తోంది? ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. కొన్ని నేరుగా మేమే క్లయింట్లకు అందిస్తున్నాం. మరికొన్ని ఆర్డర్లను మాత్రం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు మా ద్వారా అందిస్తున్నాయి. మేం డెవలప్ చేసిన టూల్స్‌ను అవి వినియోగించుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం మీ ఆర్డర్‌బుక్ ఎంత? మా కంపెనీ పాలసీ ప్రకారం దేశాలవారీగా ఆదాయాలు, ఆర్డర్ బుక్ విలువ చెప్పలేం. కానీ ఇక్కడ ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, టాటా గ్రూపు, కల్యాణి వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మొత్తం అన్నిదేశాలూ కలిపితే అంతర్జాతీయంగా మా సంస్థ ఆదాయం 2.5 బిలియన్ డాలర్లు దాటుతోంది. ఆటోడెస్క్ టెక్నాలజీ వినియోగిస్తే ప్రాజెక్టు వ్యయం ఏ మేరకు తగ్గుతుంది? సమయం ఎంత ఆదా అవుతుంది? మా టెక్నాలజీతో ఎంతటి భారీ ప్రాజెక్టునైనా 3డీలో డిజైన్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే వాటిని రియల్ టైమ్‌లోనే క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఆటోడెస్క్ను వినియోగించారు. దీంతో మలుపుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండేలా చక్కగా డిజైన్ చేయగలిగారు. పైపులకు సంబంధించి ఎన్ని వంపులు తిరిగినా మా టెక్నాలజీతో అక్కడొచ్చే సమస్యలు ఇట్టే తెలిసిపోతాయి. ఇక వ్యయం, సమయం ఎంత తగ్గుతుందనేది ప్రాజెక్టును బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద సగటున 20-30% ఖర్చు కలిసొస్తుంది. ఆర్థిక మందగమనంతో ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి కదా! మీ వ్యాపారం కూడా..? అలాంటిదేమీ లేదు. ఇండియాలో మౌలిక వసతుల రంగం ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మున్ముందు 40 శాతం మంది జనాభా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళతారని అంచనా. వీరందరికీ మౌలిక వసతులు కల్పించడానికి భారీ పెట్టుబడులు కావాలి. తాజాగా 17 విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్, సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్స్ సంఖ్య 25 శాతం పెరుగుతుందని అంచనా. వీటన్నిటికీ మా టెక్నాలజీ అవసరం కనక ఇండియా మాకు కీలకమైన మార్కెట్. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఏం చేస్తున్నారు? మీడియా, వినోద రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాల్లో మా టెక్నాలజీనే వినియోగించారు. మా టెక్నాలజీ వల్ల అవి గ్రాఫిక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తెలుగులో నిర్మిస్తున్న బాహుబలి, రాణి రుద్రమ అనే కాదు... గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే ఏ సినిమా అయినా మా టెక్నాలజీని వాడాల్సిందే. ఇండియాలో విస్తరణ సంగతేంటి? ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రం పనిచేస్తోంది. ఆటోడెస్క్ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఏఐసీటీఈ, విద్యాశాఖలతో ఒప్పందాలు చేసుకున్నాం.