తెలుగు రాష్ట్రాల్లోఎయిర్పోర్టులకు కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ స్క్రీనింగ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో ఆ శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్‌చౌబే నేతృత్వంలోని ఈ కమిటీ సోమవారం సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు విమానాశ్రయాల ఏర్పాటు అంశంపై చర్చించింది. ఈ సమావేశానికి ఇందన, మౌలిక వసతుల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ హాజరై ఎయిర్‌పోర్టులకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఏపీలో భోగాపురం (విజయనగరం), దగదర్తి (నెల్లూరు), ఓర్వకల్లు (కర్నూలు)లో విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారంతోపాటు, తెలంగాణలో ఓ కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు సైట్ క్లీయరెన్స్‌కు ఆమోదం తెలిపింది. కాగా విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నారు. దీనిని పీపీపీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయనుంది. ఏటా 63 లక్షల ప్రయాణికుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా తొలి విడతలో రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.
నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 1,390 ఎకరాలు అవసరమని అంచనా. ఇందులో 840 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 290 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రూ.88 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును కూడా పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. విశాఖ–చెన్నై, బెంగుళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఈ ఎయిర్‌పోర్టు నోడల్ పాయింట్ అవుతుందని తెలిపారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు 1,010 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి 240 ఎకరా భూమిని ఇప్పటికే సేకరించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఇది ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలు దేశీయ విమాన సర్వీసులకు పరిమితం కానున్నాయి.
దగదర్తి, ఓర్వకల్లులో తక్కువ వ్యయంతో విమానాశ్రయాలను నిర్మించనున్నారు. ఒక్కో విమానాశ్రయాన్ని రూ. 88 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దగదర్తి విమనాశ్రయాన్ని పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. ఓర్వకల్లులో రాష్ట్ర ప్రభుత్వమే విమానాశ్రయం నిర్మించనుంది. దేశీయ విమాన సర్వీసులకు ఈ విమానాశ్రయాలు పరిమితమవుతాయి.