ప్చ్: తెలుగు రాష్ట్రాలకు నిరాశే!
సాక్షి, న్యూఢిల్లీ: తాజా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది. తాజా విస్తరణలో మొత్తం 9 మంది కొత్తవారికి అవకాశం కల్పించినా.. అందులో తెలుగువారు ఒక్కరూ లేరు. కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కుతుందన్న ఆశతో శనివారం కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకూ చేదు అనుభవమే ఎదురైంది. ఏపీ నుంచి హరిబాబు లేదా మరొకరికి ఈసారి చాన్స్ దొరకవచ్చునని, తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్ లేదా మురళీధర్‌రావు రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించినా.. అవేమీ ఫలించలేదు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందని మొదటినుంచి ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడం, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడంతో రెండు కేంద్రమంత్రివర్గ స్థానాలను తెలుగు రాష్ట్రాలు కోల్పోయినట్టు అయింది. మరీ, విచిత్రమేమిటంటే.. తాజా మంత్రివర్గ విస్తరణతో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యమే కరువైంది. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేని పరిస్థితులలో ప్రస్తుతం సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు కేబినెట్ హోదాతో ప్రమోషన్ కల్పించినట్టు చెప్తున్నారు. అయితే, తమిళనాడులో జన్మించిన నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారా? అన్న విషయంలో స్పష్టత లేదు.
వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పెద్దపీట వేశారు. అయితే, మరోసారి కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని, అప్పుడు మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకేతోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు.