మోనో కూత.. రేపే | mono rain will start from tommorow | Sakshi
Sakshi News home page

మోనో కూత.. రేపే

Published Fri, Jan 31 2014 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

మోనో కూత.. రేపే

మోనో కూత.. రేపే

 ప్రారంభించనున్న సీఎం పృథ్వీరాజ్
 ఆదివారం నుంచి ప్రజలకు
 అందుబాటులోకి రానున్న సేవలు
 ఎమ్మెమ్మార్డీయే చీఫ్ మదన్
 
 సాక్షి, ముంబై:
 హమ్మయ్యా! మోనో రైలు ప్రారంభానికి ముహూర్తం దొరికింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ రైలు సేవలను శనివారం నుంచి ప్రారంభించాలని ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ప్రారంభం కానున్న మోనో రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారని ఎమ్మెమ్మార్డీయే చీఫ్ యూపీఎస్ మదన్ గురువారం విలేకరులకు తెలిపారు. సీఎం ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ.మూడు వేల కోట్ల వ్యయంతో రెండు దశల్లో నిర్మించాలని అనుకున్న ఈ ప్రాజెక్టులో తొలి దశలో పూర్తయిన 8.8 కిలోమీటర్ల మేర వడాల- చెంబూర్ మార్గంలో ప్రజలకు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రెండో దశలో ఈ సర్వీసులను దక్షిణ ముంబైలోని సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు పొడిగిస్తామని మదన్ వెల్లడించారు. ఈ మోనో రైలు సేవలకు రూ.5 నుంచి 11 మధ్యలో చార్జీలను ఖరారు చేశామన్నారు. తొలి దశలో ఆరు రైళ్లు సేవలందించనున్నాయని, రెండో దశ పనులు పూర్తయిన తర్వాత మరో పది రైళ్లు వచ్చి చేరుతాయన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నాలుగు కోచ్‌ల్లో 2,300 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉందని వివరించారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి సర్వీసులు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ సేవల వల్ల వడాల నుంచి చెంబూరుకు వెళ్లాలంటే ప్రస్తుతం పడుతున్న 40 నిమిషాలకు సరిగ్గా సగానికి తగ్గే అవకాశముందన్నారు. 21 నిమిషాల్లో గమ్యాన్ని చేరే అవకాశముందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన రూ.మూడు వేల కోట్లలో ఇప్పటికే 1,900 కోట్లను ఖర్చు చేశామని వివరించారు.
 
 వడాల-చెంబూర్ 8.8 కి.మీ. మార్గంపై ప్రారంభ దశలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ రైళ్లు పరుగెడుతాయి. ప్రయాణికుల రద్దీ, ఎదురయ్యే ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత రైళ్ల ట్రిప్పులను పెంచే విషయాన్ని ఆలోచిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
 అంతా జాప్యమే ఇదిలావుండగా ఎమ్మెమ్మార్డీయే ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు సంవత్సరన్నర క్రితమే అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే  అనేక సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో తరుచూ గడువు పొడగించింది. ఇదివరకు సుమారు 11సార్లు డెడ్‌లైన్లు పొడిగించారు. అదే సందర్భంలో రైల్వే బోర్డుకు చెందిన ‘సేఫ్టీ సెక్యూరిటీ ఆథారిటీ’ నుంచి భద్రత సర్టిఫికెట్ లభించకపోవడంతో మోనో రైళ్లన్నీ యార్డులకే  పరిమితమయ్యాయి. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో అసలు మోనో రైలు పరుగులు తీస్తుందా అనే సందేహం మొదలైంది. అందులో ప్రయాణిస్తామా..? అనే నమ్మకం కూడా ముంబైకర్లకు లేకుండా పోయింది.
 
 భద్రత ఏర్పాట్లు...
 నగరం ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉండడంతో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్విని భిడే చెప్పారు. అన్ని స్టేషన్లలో,  డిపోలలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని మోహరించామన్నారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్ (ఎంఎస్‌ఎస్‌సీ) నుంచి దాదాపు 500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. పేలుడు పదార్థాలను గుర్తించే స్కాన ర్లను కూడా  త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వేసేందుకు 336 సీసీ టీవీ కెమెరాలను రైళ్లల్లో, స్టేషన్లు, కార్ డిపోలలో ఏర్పాటు చేయనున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement