సాక్షి, ముంబై : భవిష్యత్తులో చూనాభట్టి నుంచి సీ లింక్ (బాంద్రా) వరకు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకోసం చూనాభట్టి చౌక్ (ఎడ్వర్డ్‌నగర్) నుంచి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), బీకేసీ నుంచి బాంద్రా-వర్లీ సీలింక్ (బాంద్రా) వరకు సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ రెండు ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే బీకేసీ ముంబైలోని పశ్చిమ, సెంట్రల్ రైల్వేలతోపాటు ప్రధాన రహదారులైన వెస్ట్రన్, ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేల మధ్య అభివృద్ధి పనులను ఎమ్మెమ్మార్డీఏ పూర్తి చేసింది.
రెండు ప్రాజెక్టుల్లో కదలిక
ప్రస్తుతం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నీలయంగా మారింది. తూర్పు, అటు పశ్చిమ ప్రాంతాల నుంచి బీకేసీ వచ్చేవారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు 1.6 కి.మీ. ఫై ్ల ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫై ్ల ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు.
ఇది గత కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవలే మిఠీనది మధ్య భాగంలో ఫ్లై ఓవర్ కోసం ఒక పిల్లర్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుకు కదలికవచ్చింది. దీంతోపాటు బీకేసీ నుంచి బాంద్రా సీలింక్‌ను కలిపేందుకు ఎమ్మెమ్మార్డీఏ ప్రతిపాదించింది. ఈ రెండు ప్రాజెక్టు పనులను తొందరగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సుమారు నాలుగేళ్లలో చూనాభట్టి నుంచి సీలింక్ (బాంద్రా) వరకు పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీఏ ముందుకుసాగుతోందని ఓ అధికారి పేర్కొన్నారు.
సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్
Published Fri, Aug 8 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement