సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఇళ్లు ఇచ్చేందుకు ఎట్టకేలకు ముహూర్తం లభించింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికుల కోసం కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 18న అధికారికంగా ఆదేశాలు జారీ అవుతాయని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి.
వీటిని మాడా లాటరీ ద్వారా మిల్లు కార్మికులకు అందజేయనుంది. ఎమ్మెమ్మార్డీయే ఇళ్లు, మిల్లు స్థలాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, మాడా లాటరీ డ్రా ద్వారా ఇవ్వనున్న ఇళ్లు స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై మిల్లు యూనియన్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఆజాద్ మైదానంలో ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’, ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’, మహారాష్ట్ర గిర్నీ కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ సంఘటన ఆధ్వర్యంలో ఆందోళన కూడా జరిగింది. అనంతరం మిల్లు కార్మిక యూనియన్ల ప్రతినిధుల బృందం సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో కార్మిక శాఖ సహాయక మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయింది.
ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఆదేశాలు బయటికి రాలేదని సచిన్ తెలిపారని యూనియన్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. ప్రస్తుతం 69 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు లభించనున్నట్టు సచిన్ ఆహిర్ పేర్కొన్నారని వివరించారు. కాగా, సెంచూరీ, బాంబే డాయింగ్‌తోపాటు 12 మిల్లుల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో ఫిబ్రవరి 30వ తేదీన భూమిపూజ నిర్వహించనుంది.
తొందర్లోనే గృహ ప్రవేశం...
లాటరీలో ఇళ్లు గెలుచుకున్న మిల్లు కార్మికులకు తొందర్లోనే ఇళ్ల తాళం చెవులు లభించనున్నాయి. ఇళ్లను కార్మికులకు అందించేందుకు కావల్సిన ‘ఓసీ’ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లభించింది. తొందర్లోనే గృహ ప్రవేశం చేయనున్నారు.
మిల్లు కార్మికులకు ఇళ్లు రెడీ
Published Thu, Feb 13 2014 11:12 PM | Last Updated on Wed, Aug 29 2018 6:10 PM
Advertisement