తెలుగు జేఏసీ ఆవిర్భావం
సాక్షి, ముంబై: ముంబైలో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు తెలుగు ఐక్యకార్యాచరణ సమితి ఆవిర్భవించింది. సంకు సుధాకర్ చొరవతో గంజి గోవర్ధన్, మహేశ్వరం చంద్రశేఖర్, బండి గంగాధర్ తదితర తెలుగు ప్రముఖులు గురువారం సాయంత్రం వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలిలో ఈ విషయమై చర్చాగోష్ఠి నిర్వహించారు. సంకు సుధాకర్ సభాధ్యక్షుడిగా, వాసాల శ్రీహరి(వంశీ) గౌరవాధ్యక్షుడిగా వేదికనలంకరించారు.
గంజి గోవర్ధన్ సభకు స్వాగతం పలికారు. తెలుగు ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తెలిపారు. తదనంతరం తెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర మాట్లాడుతూ... ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ముంబైలోని తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు ఓ సంస్థ ఉండాలన్నారు. సంకు సుధాకర్ మాట్లాడుతూ.. ముంబైలో ఎన్నో కులసంఘాలు, ఇతర సంఘాలు ఉన్నప్పటికీ వాటన్నింటికి పరిమితులు ఉన్నాయని, తెలుగువారందరికోసం పాటుపడే ఒక సంస్థ ఏదీ లేదని, అందుకే అన్నివర్గాల, అన్నికులాల, అన్నిప్రాంతాల ప్రతినిధులతో కూడిన ఐక్యకార్యాచరణ సమితి ఉండాలనే అభిప్రాయంతో ఈ తెలుగు జేఏసీ ఆలోచన పుట్టుకొచ్చిందన్నారు.
ప్రసంగాల అనంతరం ‘తెలుగు జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటుకు ప్రముఖులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తాత్కాలిక అధ్యక్షుడిగా సంకు సుధాకర్‌ను ఎన్నుకున్నారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. కామాటీపుర, గోవండీ, భివండీ, వాషి, దాదర్ ప్రాంతాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి లక్ష్యాలను, ఉద్దేశాలను తెలుగు ప్రజలందరికీ తెలిపేందుకు ప్రయత్నిస్తామని సుధాకర్ తెలి పారు. భవన నిర్మాణ కూలీల సమస్యలతోపాటు ముంబైలోని తెలుగువారికి చెందిన విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, సాహితీరంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమిటీ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు.
అవసరమైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశంలో మాదిగ మహాసంఘం ప్రధాన కార్యదర్శి నల్లా మల్లికార్జునరావు, తెలుగు మిత్ర బృందం చైర్మన్ మర్రి జనార్ధన్, ఎంటీసేవా డాట్ కామ్ సంస్థాపకులు గాలి మురళీ, గీతా వికాస్ మండలి అధ్యక్షుడు వాసాల కిషన్, కట్టెకోల మల్లేశం, తెలుగు విద్యావంతుల వేదిక చైర్మన్ కంటే అశోక్, పద్మశాలి మిత్రమండలి అధ్యక్షుడు ఆడెపు శ్రీహరి, మున్నూరు కాపు సేవాసంఘం ట్రస్టీలు బోరిగం మల్లేశం, సిరిపురం రాజేశం, పద్మశాలి యువక సంఘం ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, పీఎస్‌ఎస్‌ఎం ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు.