సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 10.30 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉండగా గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నా పట్టించుకునే వారే లేరు. కార్యాలయాల బాస్‌లే ఆలస్యంగా వస్తుండడంతో సిబ్బంది వారినే అనుసరిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు ఖమ్మం, వరంగల్ నుంచి జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లితో పాటు సుదూర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. తరచూ విధులకు ఆలస్యంగా వెళ్తుండటంతో కార్యాలయాల వద్ద ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమయ పాలనపై సోమవారం జిల్లా వ్యాప్తంగా చేసిన పరిశీలనలో జాడ్యం బయటపడింది.
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను భుజానకెత్తుకుంది. వీటి సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో కొంత మంది అధికారులు బిజీగా ఉంటున్నారు. వీరిని మినహాయిస్తే సమయానికి కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ పనులు చెక్కబెట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మిగతా అధికారులు, సిబ్బంది మాత్రం ఏంచక్కా విధులకు డుమ్మా కొడుతున్నారు. లేదంటే ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులకు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఉండటంతో ఇలా సమయ పాలన పాటించని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌తో పాటు మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో పలు శాఖల అధికారులతో గ్రీవెన్స్ నిర్వహించాలి. కానీ తహశీల్దార్లు ఈ కార్యక్రమానికి వస్తే ప్రజల వినతులు స్వీకరించడానికి సంబంధిత శాఖల అధికారులు మాత్రం ప్రభుత్వ పథకాల క్షేత్ర స్థాయి పరిశీలన అంటూ డుమ్మా కొడుతుండటం గమనార్హం. భద్రాచలం ఏజెన్సీలో మాత్రం ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళ్తారో ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఉండట్లేదు.
సేవలు విస్మరించి..అటెండెన్స్ కోసం..
ప్రభుత్వ సేవలను ప్రజల దరిచేర్చకుండా కొంతమంది అధికారులు, సిబ్బంది కేవలం అటెండెన్స్ కోసమే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు ఖమ్మం, వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విధులకు హాజరవుతున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం క్షేత్రస్థాయి పర్యటనలో ఉన్నామంటూ దాటవేస్తున్నారు.
ఎన్నెస్పీ ఖమ్మం మానిటరింగ్ డివిజన్ కార్యాలయంలో రెండు జిల్లాల పరిధిలో వందలాది మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్లు పని చేస్తునాం్నరు. అయితే ఉన్నతాధికారులు మాత్రం వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే లష్కర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు.. తమ బాస్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మధిర తహశీల్దార్ కార్యాలయానికి సకాలంలో వచ్చినప్పటికీ సిబ్బంది మాత్రం సకాలంలో హాజరుకాలేదు. పాల్వంచ ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలైనా సిబ్బంది విధులకు హాజరు కాలేదు.
ఇల్లెందు తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఉదయం 11 గంటల తర్వాత నింపాదిగా ఆఫీస్‌కు వచ్చారు. ఇక్కడ ఉద్యోగులు ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, మహబూబాబాద్ దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థలోనూ అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అన్ని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా కౌన్సెల్ హాలులో హాజరు కావాలని, తర్వాతనే వారి విభాగాలకు వెళ్లి విధులు నిర్వహించాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా..పెడచెవినే పెడుతున్నారు. అధికారులు, సిబ్బంది తరచూ ఫీల్డ్‌లో ఉన్నామంటూ కార్యాలయానికి మాత్రం ఆలస్యంగా వస్తున్నారు.
పేరుకే గ్రీవెన్స్
మండల స్థాయిలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో ప్రజల అర్జీలు నెలలు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే ఈ కార్యక్రమానికీ పలు శాఖల అధికారులు డుమ్మా కొడుతున్నారు. సమస్యలపై వినతులు అందించడానికి వచ్చే ప్రజలు సంబంధిత అధికారులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఆ సమస్యకు ఇతర అధికారులు కూడా సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలస్థాయి అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లినా ఆశాఖ నుంచి ఎవరినైనా గ్రీవెన్స్‌కు పంపాలి. కానీ ఈ విధానం అమలు కాకపోవడంతో ప్రజల వినతులకు మోక్షం కలగడం లేదు. మళ్లీ వారం రోజుల తర్వాత ఇదే సమస్యపై ప్రజలు గ్రీవెన్స్ బాట పట్టాల్సి వస్తోంది.
ఏజెన్సీలో అస్తవ్యస్త పాలన
ఏజెన్సీలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసినా ప్రజలకు సమాధానం చెప్పేవారుండరు. అసలు అధికారి, సిబ్బంది ఎటు వెళ్లారోనన్న సమాచారం కూడా ఉండదు. అశ్వారావుపేట తహశీల్దార్ ఆలస్యంగా రావడంతో గ్రీవెన్స్‌డే సందర్భంగా వినతులు సమర్పించేందుకు వచ్చిన వారికి పడిగాపులు తప్పలేదు. భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయంలో కింది స్థాయి అధికారులు ఆలస్యంగా రావడంతో దూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వృద్ధులు.. అధికారుల కోసం ఎదురుచూశారు.
వాజేడు తహశీల్దార్ కార్యాలయానికి మధ్యాహం 12 గంటల వరకు అధికారులు, సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాలేదు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కూడా కిందస్థాయి సిబ్బంది కుర్చీలు ఖాళీగా కనిపిస్తూ దర్శనమిచ్చాయి. వివిధ గూడేల నుంచి గిరిజనులు ఎన్నో ఆశలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినా వారి సమస్యలు వినేవారు లేకపోవడంతో చేసేదేమీ లేక నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు.
వేళా‘పాలన’ లేదు
Published Tue, Nov 18 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement