సాక్షి, కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను 1996లో సంభవించిన కోనసీమ తుపానుకు రెట్టింపు వినాశనాన్ని సృష్టించనుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ జిల్లావాసులను హెచ్చరించారు. సోమవారం రాత్రి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. జిల్లా మొత్తం ఈ తుపాను తాకిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు.
ఈ తుపాను పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం మండలానికి రూ.మూడు లక్షలు కేటాయించినట్టు చెప్పారు. బాధిత ప్రజలతో పాటు పాడి పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రావద్దని; పూరిళ్లు, కచ్చా ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. జిల్లాకు పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను కేటాయించారని తెలిపారు. ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, తుని, కొత్తపల్లి మండలాలకు ఒక్కొక్కటి, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలకు రెండేసి చొప్పున ఈ బృందాలను పంపనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం : కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ సోమవారం సందర్శించి, లెహర్ తుపానుపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాణనష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలందరూ బుధవారం ఉదయానికల్లా పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. ఈ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా ఆహారం నిల్వ ఉంచాలని కాట్రేనికోన తహశీల్దారును ఆదేశించారు.
లెహర్.. డర్
Published Tue, Nov 26 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement