తీరం దాటింది గండం గడిచింది | Never crossed the coast of danger | Sakshi
Sakshi News home page

తీరం దాటింది గండం గడిచింది

Published Fri, Nov 29 2013 12:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

లెహర్ తుపాను గండం గడిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్ వద్ద ఆరు రోజుల క్రితం ఏర్పడిన లెహర్ తుపాను మచిలీపట్నానికి

=బలహీనపడిన ‘లెహర్’
 =వాయుగుండంగా.. అపై అల్పపీడనంగా మార్పు
 =చలిగాలులకు వృద్ధురాలి మృతి
 =మరో 24 గంటలపాటు భారీ వర్షాలు
 =రైతన్నకు తప్పని నష్టం

 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను గండం గడిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్ వద్ద ఆరు రోజుల క్రితం ఏర్పడిన లెహర్ తుపాను మచిలీపట్నానికి దక్షిణ దిశగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తీరం దాటింది. అల్పపీడనంగా ఏర్పడి గుంటూరు జిల్లా బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని, శుక్రవారం మధ్యాహ్నానికి సమసిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు కోస్తా తీరంలో వర్షాలు కురుస్తాయని వివరించారు.
 
తెల్లవారుజాము నుంచే వర్షాలు...

తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సముద్రతీరంలో బలమైన గాలులతో పాటు వర్షం కురిసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలులు, వర్షం ప్రభావం అధికమైంది. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో దాదాపు ఐదడుగులకు పైగా ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. గురువారం ఉదయం నుంచి సముద్రం హోరెత్తింది. తుపాను ప్రభావంతో చలిగాలులు వీయటంతో బందరు మండలం బుద్దాలపాలేనికి చెందిన తాడంకి ఆదిశేషమ్మ (75) మృతిచెందింది. కృత్తివెన్నులో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో అలజడి నెలకొంది. లీకేజీని సిబ్బంది అరికట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లెహర్ తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి.
 
క్రమేణా బలహీనపడిన తుపాను...

లెహర్ పెను తుపానుగా వస్తుండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ నెల 26 వరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 27వ తేదీ సాయంత్రం తీవ్ర పెనుతుపాను బలహీనపడి తుపానుగా మారినట్లు ప్రకటించారు. గురువారం ఉదయానికి తుపాను కాస్తా మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది. వాతావరణంలో పెరిగిన చలిగాలులు తుపాను తీవ్రతను తగ్గించాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో గాలుల వేగం తగ్గిపోయింది.

ఈ నెల 22న హెలెన్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హెలెన్ తుపాను కంటే లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించటంతో తీరప్రాంత వాసులు బెంబేలెత్తిపోయారు. తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల మేర గాలులు వీయటంతో నష్టం అంతగా జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు.
 
34 శిబిరాలు, 6,900 మందికి పునరావాసం...
 
లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సముద్రతీరంలోని ఆరు మండలాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అధికారులు కసరత్తు చేశారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని 55 గ్రామాల పరిధిలోని 111 ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. 34పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 6,900 మందికి రక్షణ కల్పించారు.

తుపాను తీరం దాటిన సమయంలో విపత్కర పరిస్థితులు ఏర్పడితే రక్షణ చర్యల కోసం 80 మంది ఆర్మీ, 160 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, 877 మంది పోలీసు, 100 మంది ఫైర్, మెరైన్ పోలీసు సిబ్బంది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పహరా కాశారు. మంగినపూడి బీచ్, సాగరసంగమం ప్రాంతాల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వాయుగుండం తీరం దాటడంతో గురువారం పునరావాస కేంద్రాల్లోని వారిని ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపారు. కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, ఏజేసీ చెన్నకేశవరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేశారు.

మచిలీపట్నం హిందూ కళాశాలలో, బంటుమిల్లి, కృత్తివెన్నులలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గురువారం తెల్లవారుజాము నుంచి అక్కడే ఉండి బాధితులకు సేవలందించారు.
 
రైతన్నకు దెబ్బ మీద దెబ్బ...


లెహర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను మరింత కుంగదీశాయి. ఈ నెల 22న సంభవించిన హెలెన్ తుపాను ప్రభావంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. ప్రస్తుత వర్షాలతో ఆ పైరుపై నీరు చేరింది. ఇప్పటికే మూడొంతుల పంటను కోల్పోయామని ఆందోళన చెందుతున్న రైతులు గురువారం కురిసిన వర్షంతో పంట చేతికిరాదని చెబుతున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నుంచి పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నట్లు వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement