=మచిలీపట్నం వద్ద తుపాను నేడు తీరం దాటే అవకాశం
=రక్షణ చర్యల్లో అధికార యంత్రాంగం
=127 పునరావాస శిబిరాల ఏర్పాటు
=తీరప్రాంత స్కూళ్లకు సెలవు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ పేరు వింటేనే జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మచిలీపట్నానికి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నం ఇది మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి రెండు మీటర్ల ఎత్తు వరకు కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్రతీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేకాధికారులు, వీ ఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం కలెక్టర్ ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 127 పునరావాస శిబిరాల వద్ద విద్యుత్ సౌకర్యానికి ఆటంకం ఏర్పడకుండా జనరేటర్లు, ఆయిల్, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో వర్షం ప్రారంభమైన వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తీసుకువచ్చేందుకు పరస్పర సహకారం తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద 24 గంటల పాటు పనిచేసే వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయం సక్రమంగా కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెలెన్ తుపాను ప్రభావంతో తడిసిన వరిని రోడ్లపై వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని.. రెండు, మూడు రోజుల పాటు రోడ్లపై వరి కుప్పలు, కుప్పనూర్పిళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. బంటుమిల్లిలో జేసీ పి.ఉషాకుమారి, ఎస్పీ జె.ప్రభాకరరావు పర్యటించి తుపాను ఏర్పాట్లను సమీక్షించారు.
ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం..
లెహర్ తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్మీకి చెందిన 600 మంది సైనికులను సిద్ధంగా ఉంచారు. వీరిలో ఒక బృందం బందరు బయలుదేరింది. అవసరాన్ని బట్టి కాకి నాడకు పంపేందుకు మరికొంతమందిని సిద్ధంగా ఉంచారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అవనిగడ్డ, కోడూరు, బంటుమిల్లిలో ఒక్కొక్కటి ఉండగా మచిలీపట్నంలో రెండు బృందాలను సంసిద్ధంగా ఉంచారు.
తుపాను తీరం దాటిన సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే ఈ బృందాల సేవలను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన డీఐజీలు ఎస్‌ఎస్ గులేరియా (ఢిల్లీ), ఎస్పీ సెల్వన్ బుధవారం కలెక్టర్‌ను కలిసి తుపాను పరిస్థితులపై చర్చించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు తుపాను రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. సైనిక బృందాలు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
భారీవర్ష సూచన..
లెహర్ తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. మంగినపూడి బీచ్‌తోపాటు సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మంగినపూడి బీచ్ నుంచి బుధవారం ఉదయం 17 బోట్లు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినట్లు గుర్తించిన మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం బీచ్ వద్దకు వెళ్లి సముద్రంలో ఉన్న మత్స్యకారులను బయటకు రప్పించారు. గిలకలదిండి హార్బర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే 92 మెకనైజ్డ్ బోట్లు, 974 ఫైబర్ బోట్లు మొత్తం సముద్రం ఒడ్డునే నిలిపివేసినట్లు కళ్యాణం తెలిపారు. కోడూరు, బందరుల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఎన్‌డీఆర్‌ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ ఉత్తమ్ కశ్యప్ పరిశీలించారు.
లెహర్.. టై
Published Thu, Nov 28 2013 3:13 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement
Advertisement