M. Raghunandan Rao
-
అహంకారం వీడండి
రోగులతో మర్యాదగా మాట్లాడండి జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులకు కలెక్టర్ క్లాస్ చిలకలపూడి (మచిలీపట్నం) : అహంకారాన్ని వీడి రోగులతో మర్యాదగా మాట్లాడాలని జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు హితవుపలికారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్లో ప్రభుత్వాస్పత్రి వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి నిరుపేదలు వస్తారని, వారితో మర్యాదగా మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. రోగుల సమస్యలను క్షుణ్ణంగా విన్న తర్వాత వారికి ఏ విధమైన వైద్య సదుపాయం అందించాలో గుర్తించాలని, ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని సూచించారు. వైద్య వృత్తికి న్యాయం చేయాలని, రోగులతో అసభ్యకరంగా మాట్లడవద్దని చెప్పారు. వెంటనే డాక్టర్లు తమ పనితీరును మార్చుకోవాలని హెచ్చరించారు. సమయపాలన పాటించి అందరూ కలిసి ప్రభుత్వాస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించనున్నారని, ఈ సర్వేలో రోగులు, వైద్యుల హాజరు, పనితీరు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఇందుకోసం వైద్యులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరం, డీసీఎంహెచ్ఎస్ డాక్టర్ నరసింగరావు, ఆర్ఎంవో డాక్టర్ జయకుమార్, వైద్యులు వినయ్‌కుమార్, అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌గా రఘునందన్‌రావు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముక్కుసూటి అధికారిగా పేరున్న ఎం.రఘునందన్‌రావును జిల్లా కలెక్టర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు రంగారెడ్డి జిల్లా పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన రఘునందన్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరపరిచితుడు కావడం, పాలనా వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉండడంతో కీలకమైన రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అఖిల భారత సర్వీసు అధికారుల కేడర్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను కదిలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. 2002 బ్యాచ్‌కు చెందిన రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయితే ఈయన పోస్టింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. రాజధానిని అనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వీటిని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేసే అధికారి అవసరముంది. ఈ నేపథ్యంలో రెవెన్యూలో కీలకమైన రంగారెడ్డి జిల్లాకు సమర్థుడైన రఘునందన్‌రావును నియమించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న బి.శ్రీధర్ ఏపీ రాష్ట్రానికి చెందినవారు కావడంతో బదిలీ అనివార్యమవుతోంది. కేంద్రం మార్గదర్శకాల ఖరారు తర్వాత స్థానచలనం తప్పదని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు వారివారి రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రత్యూష్ సిన్హా కమిటీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అటు రఘునందన్.. ఇటు శ్రీధర్‌లు తమ స్వరాష్ట్రాల్లో సేవలు అందించడం తప్పనిసరిగా మారింది. -
ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచేలా సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్) చేపడుతున్న కార్యక్రమానికి విద్యాశాఖ అధికారుల సహకారం అవసరమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలతో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతానికి పైగా, నగరం, పట్టణ ప్రాంతాల్లో 69 శాతం నమోదైందని వివరించారు. సాధారణ ఎన్నికలలో జిల్లాలో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచటానికి, ఓటర్లను చైతన్యపరచేందుకు 2010 నుంచి స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పనిసరిగా ఓటు వేస్తామని వారి తల్లిదండ్రులతో వాటిపై సంతకాలు చేరుుంచి తిరిగి అధికారులకు అందజేసే విధంగా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ఐవో వెంకటరామయ్య, డీఈవో డి.దేవానందరెడ్డి, స్వీప్ నోడల్ అధికారి టి.దామోదర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ విజయవాడ సిటీ : ‘ప్రశ్నించండి.. వాటికి సమాధానాలు పొందండి.. సందేహాలతో శిక్షణ కార్యక్రమం నుంచి వెళ్లకండి..’ అని మాస్టర్ ట్రైనర్లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, 112 మంది మాస్టర్ ట్రైనర్లకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 7న జరిగే సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి క్షేత్రస్థారుులో వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందన్నారు. పీవో డైరీ రూపొందించడం, ఫారం17సీ పూర్తి చేయడం, ఈవీఎంల సీలింగ్ విధానాలను వివరించారు. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ల సందేహాలను జారుుంట్ కలెక్టర్ జె.మురళి, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు నివృత్తి చేశారు. డ్వామా పీడీ అనిల్‌కుమార్, రాష్ట్ర మాస్టర్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ పి.మురళి, డీఈవో దేవానందరెడ్డి, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధి’ లక్ష్యాలు సాధించండి : కలెక్టర్
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలోని వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం అధికారులతో ఆయా శాఖల పరిధిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు ఈ నెల 25లోగా లక్ష్యాలు సాధించేలా చూడాలన్నారు. గృహనిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణం, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు నిర్మాణ దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. సంక్షేమశాఖకు సంబంధించి వసతి గృహాల్లోని విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ వెంటనే పంపిణీ చేయాలని చెప్పారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు 35 శాతం రెన్యువల్ చేసినట్లు, కొత్తగా వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాలు సాధిస్తామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అమలు చేస్తున్న జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం రెండో దశ పాఠశాలల్లో వేసవి సెలవులు ఇవ్వకముందే అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇప్పుడే పూర్తయ్యిందని, వార్డు సభ్యులకు మాత్రం షెడ్యూలు ప్రకారం మార్చి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం కింద సామూహిక వివాహాలు కార్యక్రమం, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. ఈవీఎం గోడౌన్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి... కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీలం తుపాను పంట నష్టపరిహారం రైతులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సొంత భవనాలు లేని 15 సీడీపీవో కార్యాలయాలకు స్థలాల సేకరణ త్వరగా చేయాలని చెప్పారు. పీహెచ్‌సీల భవన నిర్మాణాలు, ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు వివిధ పథకాల కింద పంపిణీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మెరైన్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించామని, స్థలాల సేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, సీపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీపీవో కె.ఆనంద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, ఆర్వీఎం పీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని తోలండి...
=సీఎం పర్యటనకు అధికారుల హైరానా =డ్వాక్రా సంఘాలు,విద్యార్థులపై గురి =బలవంతంగా బస్సుల స్వాధీనం =ప్రైవేటు పాఠశాలలకు సెలవులు =జనసమీకరణలో ఉద్యోగులు విజయవాడ సిటీ, న్యూస్‌లై న్ : ‘పులిచింతల’ అధికారులకు చింతలే మిగులుస్తోంది. ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు నగరంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి బహిరంగసభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది. జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాదాపు లక్షమందిని సమీకరించి సభను జయప్రదం చేసే భారాన్ని అధికార యంత్రాంగంపై మోపారు. ఇటు ప్రొటోకాల్ ఏర్పాట్లతోపాటు అటు జనాన్ని తోలే కార్యక్రమం కూడా జిల్లా యంత్రాంగంపై పడింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన పర్యవేక్షణలో రవాణా, విద్యాశాఖ, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయాధికారులు, సిబ్బంది సభకు జనాన్ని తరలించే బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. జిల్లాలో రెండు వేల ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా లాక్కునే పనిలో రవాణా, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు.. ఎంఈవోలు అన్ని మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. శనివారం విజయవాడలో జరగనున్న సీఎం సభకు బస్సులు పంపాలని హుకుం వేశారు. ఆ రోజు పాఠశాలలన్నింటికీ సెలవలు ఇచ్చి టీచర్లు, విద్యార్థులను కూడా తరలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఉప విద్యాశాఖాధికారులు మంగళ, బుధవారాల్లో ప్రైవేటు పాఠ శాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు కూడా నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను నియమించి బస్సుల నంబర్లతోపాటు హాజరయ్యే వారి సంఖ్యను కూడా నమోదు చేయాలని ఆదేశించారు. డ్వాక్వా సంఘాలపై ఆశలు జిల్లాలో పంటలు మునిగి పుట్టెడు కష్టంలో ఉన్న రైతులు ఈ సభకు పెద్దగా వచ్చే అవకాశం లేకపోవడంతో డ్వాక్వా సంఘాలపై అధికార యంత్రాంగం అశలు పెట్టుకుంది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది గ్రామగ్రామాన తిరిగి మహిళలను సమీకరించాలని ఆదేశాలందాయి. ఎంపీడీవోలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని గ్రామ కార్యదర్శులతో చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి ఆదర్శ రైతులు, రైతు సంఘాల ద్వారా జనాన్ని సమీకరించేపనిలో పడ్డారు. సర్వత్రా నిరసన సీఎం సభకు అధికారులు బలవంతంగా జనాన్ని తరలించే కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు సరిగా జరగలేదని, అనవసరంగా సెలవు ఇవ్వడం తమ వల్ల కాదని విద్యాసంస్థల ప్రతినిధులు అంటున్నారు. తమ బస్సులను కూడా పంపబోమని కొందరు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మొండికేస్తున్నట్లు సమాచారం. -
పంట నష్టం అంచనాకు వారమే గడువు
=దెబ్బతిన్న వరిని కలెక్టర్‌కు చూపిన పేర్ని నాని =మళ్లీ అల్పపీడన ద్రోణి =రైతుల గుండెల్లో గుబులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్, లెహర్ తుపానుల ధాటికి జరిగిన పంట నష్టం అంచనాలను వారంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పంట నష్టం నివేదికలను స్పష్టంగా తయారుచేయాలని చెప్పారు. రైతుల పేర్లు, పంట నష్టం శాతంలో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పొలాన్ని పరిశీలించి వాస్తవంగా జరిగిన నష్టాన్ని వీఆర్వో, వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ సర్పంచి, రైతుమిత్ర గ్రూపు కన్వీనరు, ఆదర్శరైతు, పంచాయతీ కార్యదర్శి, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పరిశీలించాలన్నారు. వీరందరితో గ్రామ కమిటీని ఏర్పాటుచేసి గ్రామంలో సాగు విస్తీర్ణం, పంట నష్టం జరిగిన విధానం తదితరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. తహశీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారులు మండలస్థాయి కమిటీగా ఏర్పడి నష్టం అంచనా విధానాన్ని పర్యవేక్షించాలన్నారు. గ్రామ కమిటీలు తయారుచేసిన నివేదికలను ఏరోజుకారోజు కంప్యూటరీకరించి తనకు అందజేయాలని కలెక్టర్ సూచిం చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, ఉద్యానవనశాఖ ఏడీ సుబానీ, ఆయా మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయండి.. తుపానుల ప్రభావంతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కలెక్టర్‌ను కోరారు. బందరు మండలంలోని కానూరు, సీతారామపురం, తుమ్మలచెరువు, గుండుపాలెం, సుల్తానగరం తదితర గ్రామాలకు చెందిన రైతులను తీసుకుని ఆయన సోమవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిశారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరిపైరును కలెక్టర్‌కు చూపించారు. వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేసే సమయంలో నేలవాలిన పైరు ఉంటేనే నష్టం జరిగినట్లు నమోదు చేస్తామని చెబుతున్నారని, పంట నేలవాలకున్నా గింజలు గట్టిపడని పొలాలను పంట నష్టం జరిగినట్లు అంచనా వేసి రైతులకు తగు న్యాయం చేయాలన్నారు. అలాగే నష్టపరిహారంతోపాటు పంట బీమా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నాని కలెక్టర్‌ను కోరారు. రైతులు తెచ్చిన దెబ్బతిన్న వరిపైరును పరిశీలించిన రఘునందన్‌రావు వెంటనే వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. రైతులు పేర్కొన్న ప్రాంతాల్లో గింజలు గట్టిపడకుంటే పంట నష్ట పరిహారం కింద నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్ఎన్ గొల్లపాలెం సర్పంచి మట్టా వెంకటనాంచారయ్య, సీతారామపురానికి చెందిన రైతు బెజవాడ కోటేశ్వరరావు, గుండుపాలేనికి చెందిన నిమ్మగడ్డ వాసు, కానూరుకు చెందిన గణపాబత్తుల శివశంకర్, తుమ్మలచెరువుకు చెందిన తలారి శ్రీనివాసరావు, ఇంకా పలువురు రైతులు ఉన్నారు. పలుచోట్ల వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంది. లెహర్ తుపాను అనంతరం మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందనే భయంతో రైతులు వరికోతలను ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో మొవ్వ, కూచిపూడి, పామర్రు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు, వరిపనలపై ఉన్న పైరు తడవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణశాఖ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా వర్షాలు పడతాయని హెచ్చరించడంతో రైతులు భయపడిపోతున్నారు. మంగళవారం నాటికి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే రైతులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని వారు బెంబేలెత్తిపోతున్నారు. -
లెహర్.. టై
=మచిలీపట్నం వద్ద తుపాను నేడు తీరం దాటే అవకాశం =రక్షణ చర్యల్లో అధికార యంత్రాంగం =127 పునరావాస శిబిరాల ఏర్పాటు =తీరప్రాంత స్కూళ్లకు సెలవు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ పేరు వింటేనే జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మచిలీపట్నానికి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నం ఇది మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి రెండు మీటర్ల ఎత్తు వరకు కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్రతీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేకాధికారులు, వీ ఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం కలెక్టర్ ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 127 పునరావాస శిబిరాల వద్ద విద్యుత్ సౌకర్యానికి ఆటంకం ఏర్పడకుండా జనరేటర్లు, ఆయిల్, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో వర్షం ప్రారంభమైన వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తీసుకువచ్చేందుకు పరస్పర సహకారం తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద 24 గంటల పాటు పనిచేసే వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయం సక్రమంగా కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెలెన్ తుపాను ప్రభావంతో తడిసిన వరిని రోడ్లపై వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని.. రెండు, మూడు రోజుల పాటు రోడ్లపై వరి కుప్పలు, కుప్పనూర్పిళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. బంటుమిల్లిలో జేసీ పి.ఉషాకుమారి, ఎస్పీ జె.ప్రభాకరరావు పర్యటించి తుపాను ఏర్పాట్లను సమీక్షించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం.. లెహర్ తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్మీకి చెందిన 600 మంది సైనికులను సిద్ధంగా ఉంచారు. వీరిలో ఒక బృందం బందరు బయలుదేరింది. అవసరాన్ని బట్టి కాకి నాడకు పంపేందుకు మరికొంతమందిని సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవనిగడ్డ, కోడూరు, బంటుమిల్లిలో ఒక్కొక్కటి ఉండగా మచిలీపట్నంలో రెండు బృందాలను సంసిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటిన సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే ఈ బృందాల సేవలను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన డీఐజీలు ఎస్ఎస్ గులేరియా (ఢిల్లీ), ఎస్పీ సెల్వన్ బుధవారం కలెక్టర్‌ను కలిసి తుపాను పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు తుపాను రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. సైనిక బృందాలు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీవర్ష సూచన.. లెహర్ తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. మంగినపూడి బీచ్‌తోపాటు సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగినపూడి బీచ్ నుంచి బుధవారం ఉదయం 17 బోట్లు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినట్లు గుర్తించిన మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం బీచ్ వద్దకు వెళ్లి సముద్రంలో ఉన్న మత్స్యకారులను బయటకు రప్పించారు. గిలకలదిండి హార్బర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే 92 మెకనైజ్డ్ బోట్లు, 974 ఫైబర్ బోట్లు మొత్తం సముద్రం ఒడ్డునే నిలిపివేసినట్లు కళ్యాణం తెలిపారు. కోడూరు, బందరుల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఎన్డీఆర్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ ఉత్తమ్ కశ్యప్ పరిశీలించారు.