అహంకారం వీడండి
- రోగులతో మర్యాదగా మాట్లాడండి
- జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులకు కలెక్టర్ క్లాస్
చిలకలపూడి (మచిలీపట్నం) : అహంకారాన్ని వీడి రోగులతో మర్యాదగా మాట్లాడాలని జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు హితవుపలికారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్‌లో ప్రభుత్వాస్పత్రి వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి నిరుపేదలు వస్తారని, వారితో మర్యాదగా మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని చెప్పారు.
రోగుల సమస్యలను క్షుణ్ణంగా విన్న తర్వాత వారికి ఏ విధమైన వైద్య సదుపాయం అందించాలో గుర్తించాలని, ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని సూచించారు. వైద్య వృత్తికి న్యాయం చేయాలని, రోగులతో అసభ్యకరంగా మాట్లడవద్దని చెప్పారు. వెంటనే డాక్టర్లు తమ పనితీరును మార్చుకోవాలని హెచ్చరించారు. సమయపాలన పాటించి అందరూ కలిసి ప్రభుత్వాస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించనున్నారని, ఈ సర్వేలో రోగులు, వైద్యుల హాజరు, పనితీరు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఇందుకోసం వైద్యులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరం, డీసీఎంహెచ్‌ఎస్ డాక్టర్ నరసింగరావు, ఆర్‌ఎంవో డాక్టర్ జయకుమార్, వైద్యులు వినయ్‌కుమార్, అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.