కలెక్టర్‌గా రఘునందన్‌రావు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముక్కుసూటి అధికారిగా పేరున్న ఎం.రఘునందన్‌రావును జిల్లా కలెక్టర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు రంగారెడ్డి జిల్లా పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన రఘునందన్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరపరిచితుడు కావడం, పాలనా వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉండడంతో కీలకమైన రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అఖిల భారత సర్వీసు అధికారుల కేడర్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను కదిలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. 2002 బ్యాచ్‌కు చెందిన రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయితే ఈయన పోస్టింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.
రాజధానిని అనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వీటిని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేసే అధికారి అవసరముంది. ఈ నేపథ్యంలో రెవెన్యూలో కీలకమైన రంగారెడ్డి జిల్లాకు సమర్థుడైన రఘునందన్‌రావును నియమించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న బి.శ్రీధర్ ఏపీ రాష్ట్రానికి చెందినవారు కావడంతో బదిలీ అనివార్యమవుతోంది. కేంద్రం మార్గదర్శకాల ఖరారు తర్వాత స్థానచలనం తప్పదని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు వారివారి రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రత్యూష్ సిన్హా కమిటీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అటు రఘునందన్.. ఇటు శ్రీధర్‌లు తమ స్వరాష్ట్రాల్లో సేవలు అందించడం తప్పనిసరిగా మారింది.