సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగానా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతోందని, ఆ ఎన్నికల విధి విధానాలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ చట్టానికి సవరణలు చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహించారు. రెండు విడతల్లో సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయితీ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
500 జనాభా.. 1.5 కిలోమీటర్ల దూరం
రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మరో నాలుగు వేలు కొత్త పంచాయతీలు ఏర్పాటు కావచ్చు. కనీసం 500 జనాభా, ఇప్పుడున్న గ్రామ పంచాయతీకి కనీసం ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరం ఉండాలి. న్యాయపరమైన చిక్కులకు తావు లేకుండా కొత్త పంచాయితీలు ఏర్పాటు కావాలి. కలెక్టర్లు కొత్త పంచాయతీల భౌగోళిక సరిహద్దులు (పరిధి) నిర్ణయించి జనవరి 25 కల్లా ప్రభుత్వానికి పంపించాలి. పనిచేసే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పంచాయతీరాజ్ ఎంతో గొప్పగా రూపొందించబడిన మహత్తరమైన ఉద్యమం. ఇప్పుడు గ్రామాలు పెంట కుప్పలుగా ఉంటున్నాయి. అందుకే చర్చలు జరుపుతున్నాం.
ప్రత్యక్ష ఎన్నికా? పరోక్ష ఎన్నికా? కూడా చర్చిస్తున్నాం. సర్పంచ్‌ను పనిచేసే సర్పంచ్‌గా చేయాలి, ఒకప్పుడు పంచాయతీల మీద జిల్లా కలెక్టరుకు ఎన్నో అధికారాలుండేవి. ఇప్పడు నియంత్రణ లేకుండా పోయింది. మున్సిపల్ చట్టానికి సవరణ చేసే ఆలోచనలు పరిశీలిస్తున్నాం. పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండాలో కలెక్టర్లు తమ సలహాలు, సూచనలను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి పంపాలి. సర్పంచ్‌లతో పని చేయించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సూచనలు ఇవ్వాలి. వాటి ఆధారంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెడుతాం.
గ్రామాల్లో వంద శాతం పన్ను వసూళ్లు
రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేశాం. బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయిస్తాం. íమార్చి 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తాం. చిన్న గ్రామ పంచాయితీకి (500 వరకు జనాభా ఉన్నవి) రూ. 5 లక్షలు, తర్వాత స్థాయికి అనుగుణంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలు ఇలా ప్రభుత్వం సమకూరుస్తుంది. గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయిస్తుంది. జాతీయ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకుంటాం. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఆస్తులను సమకూర్చుకుంటాం. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకుంటాం. ఎమ్మెల్యే, ఎంíపీల నిధుల నుంచి గ్రామాభివృద్ధికి వెచ్చిస్తాం. మనందరం పట్టుబడితే పరిశుభ్ర, అభివృద్ధికరమైన గ్రామీణ తెలంగాణను సాధించుకోగలం.
మార్చి నుంచి మండలాల్లో రిజిస్ట్రేషన్లు
మార్చి 12 నుంచి రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తాయి. మొత్తం 584 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు నెలల కొద్దీ సమయం పట్టదు. కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ తరహా విధానం అమలు చేస్తాం. పాస్‌బుక్కులను కొరియర్ ద్వారా ఇంటికే పంపుతాం. ‘ధరణి’వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెంటనే అప్‌డేట్ అవుతాయి. భూరికార్డుల ప్రక్షాళన నుంచి మార్చి 12 వరకు జరిగే క్రయ విక్రయాల వివరాలను కలెక్టర్లు ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి. భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైంది. మనం ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ ఇంత గొప్పగా చేయలేం. ఇది సాహసంతో చేశాం. దేశమంతా మనల్ని అభినందిస్తోంది. మనం కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శమయ్యాం. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. మున్ముందు పూర్తి అవినీతిరహితంగా జరగాలి.
సాదాబైనామాలు ఇక బంద్
ఇప్పటివరకు అందిన సాదాబైనామా దరఖాస్తులను పూర్తి చేయాలి. మార్చి 12 తర్వాత సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించొద్దు భూ బదలాయింపులన్నీ రిజిస్ట్రేషన్ లేదా వారసత్వ హక్కుగా మ్యుటేషన్‌గా జరగాలి. సబ్‌రిజిస్ట్రార్లు, అధికారులకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ఐటీ అప్లికేషన్లలో శిక్షణనివ్వాలి. బ్యాంకులు ఇకపై పంట రుణాల కోసం పట్టాదారు పాస్ పుస్తకాలు తాకట్టు పెట్టుకోకూడదు. ధరణి వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవాలి. ఆర్‌వోఎఫ్‌ఆర్ ప్రతిపాదనలు, భూప్రక్షాళనకు సంబంధించి ఇంకేమైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపించాలి. అసైన్డ్ భూములపై ఒక విధానం రూపొందించాలి. రెవెన్యూ శాఖ తగిన మార్గదర్శకాలు సిద్ధం చేయాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తమ జిల్లాలలో వాటిని అన్వయించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలి. అసైన్డ్ భూముల విషయంలో మానవతా కోణంలో ఆలోచించాలి.
మార్చి 11న కొత్త పాస్ పుస్తకాలు
రైతులకు మార్చి 11 నాడు కచ్చితంగా కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలి. దానికి ఒకరోజు ముందు, లేదా అదే రోజు ఉదయం ప్రతి గ్రామానికి పాస్ పుస్తకాలను చేరవేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి.
కోటి ఎకరాలకు సాగునీరు
2020 సంవత్సరం నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. ఈ సంవత్సరం డిసెంబర్ చివరికే చాలా వరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. స్థానిక తక్షణావసరాల కోసం పెద్ద జిల్లాల కలెక్టర్లకు రూ.1.5 కోట్లు, చిన్న జిల్లాలకు రూ. కోటి కేటాయిస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతులు కంప్యూటరైజ్ చేయాలి. వీటి ఆధారంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక నిధిలో కేటాయించిన నిధులు వృథా కాకుండా ఉపయోగపడాలి. గొర్రెల పంపకం పథకం పకడ్బందీగా అమలవుతోంది. ఇప్పటికే 38,28,987 గొర్రెల పంపిణీ జరగ్గా.. వాటికి 14,56,376 పిల్లలు పుట్టాయి. ఇది పెద్ద కార్యక్రమం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది. గొర్రెల పెంపకంతో పాటు అవసరమైన గడ్డిని పెంచాలి. జిల్లాల్లో ఉన్న పండ్ల తోటల వివరాలు సేకరించి అక్కడ గడ్డి పెంచే అవకాశాలను పరిశీలించాలి..’’
Comments
Please login to add a commentAdd a comment