కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్తలు, తాతల, తండ్రుల పేర్లు చెప్పుకొని ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవు. ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాళ్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే)’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు.
ఆదివారం ప్రగతిభవన్‌లో మధ్యప్రదేశ్ బీఆర్‌ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్‌దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్‌దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మార్పు తీసుకొచ్చే బాధ్యత ప్రజలదే..
దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్‌కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్టస్థితి, సూర్యరశ్మి వంటి ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి ఉండటం దారుణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే దీనికి కారణమన్నారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల వారు ఇంకా అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా.. తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ‘‘ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే.. పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయి. ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. మిషన్..
బీఆర్‌ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని కేసీఆర్ చెప్పారు. మన కోసం పనిచేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం విఫలమైంది!
తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని, ప్రచారాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో పార్టీ తరఫున రైతు, దళిత, మహిళ, యువ, బీసీ వంటి 9 కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment