బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.
సాంప్రదాయ పార్టీలు తమ చిత్తశుద్ధి లేని కార్యాచరణతో, మూస పద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినంత కాలం దేశాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వనరులను ఉపయోగించుకోవాలనే తపన ఉండాలి..
‘దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలనే తపన, మనసు పాలకులకు ఉండాలి. ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాలుగా పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం.
భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు భారత్ సొంతం. అయినప్పటికీ, ఇన్ని దశాబ్దాలైనా.. రైతులు, బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలైన నీరు విద్యుత్ కోసం తపిస్తున్నారు. ప్రభుత్వాలు రైతు కేంద్రంగా, దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలి. మేం అలా చేసుకోగలిగాం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యింది..’అని సీఎం తెలిపారు.
మనసుంటే మార్గం ఉంటుందని తెలంగాణ నిరూపించింది..
‘ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్ మోడల్ కాగలిగింది? నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్‌నే కోరుకోవడానికి కారణమేంటి?’అనే విషయాలను కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్ధతిలో ఈ దేశంలో పాలన సాగటం లేదు. దేశంలో పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదు.
ప్రజా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలనే మనసు లేనే లేదు..’ అని విమర్శించారు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుందనే విషయాన్ని తొమ్మిదేళ్ల తెలంగాణ నిరూపించిందని అన్నారు. అభివృద్ధి దిశగా భారతదేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని, అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో..
ఎన్‌సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్‌తో పాటు ఆ పార్టీ ఓబీసీ సెల్ అహ్మద్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కర్, దర్శకుడు ప్రకాష్ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్ షిండే, మాజీ చైర్మన్ విలాస్ భైలుమే, సర్పంచ్‌లు కేశవ్ జెండే, షాహాజీ ఇతాపే, శరద్‌పవార్‌తో పాటు చంద్రకాంత్ పవార్, ప్రకాష్ పోతే, ప్రశాంత్ షెలార్, సిద్ధేష్ ఆనంద్కర్, ప్రవీణ్ షెలార్, సంజయ్ వాగాస్కర్, వహతుక్ సేన అధ్యక్షుడు సందీప్ దహతోండే, సేవాదళ్‌కు చెందిన షామ్ జారే తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేతలు ఖదీర్ మౌలానా, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment