మహారాష్ట్రకు బయల్దేరే ముందు కార్యకర్తలతో కేసీఆర్ కరచాలనం
సాక్షి, హైదరాబాద్: రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్ర బయలుదేరి వెళ్లిన భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం షోలాపూర్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. కేసీఆర్ చేతికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి వీడ్కోలు పలికారు.
600 కార్లతో కూడిన భారీ వాహన శ్రేణి ఆయన వాహనాన్ని అనుసరించింది. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను దాటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగు పెట్టారు. మొత్తం 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కాగా మహారాష్ట్రకు వెళ్లే మార్గమంతా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వెలిశాయి. ప్రజలు, పార్టీ శ్రేణులు పూలు, గులాబీ కాగితాలు వెదజల్లుతూ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట సుమారు 6 కిలోమీటర్ల పొడవున వాహన శ్రేణి బారులు తీరింది.
ఒమర్గాలో మధ్యాహ్న భోజనం
కేసీఆర్ వాహన శ్రేణి తెలంగాణలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ప్రయాణించి కర్ణాటకలో అడుగు పెట్టింది. ముర్కుంద, మన్నెకెల్లి, తలమడిగి, హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్రలోని దారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లా ఒమర్గాకు కేసీఆర్ చేరుకున్నారు. స్థానిక మహిళలు సాంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
తన వెంట వచ్చిన నేతలతో కలిసి ఒమర్గాలో సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం షోలాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు స్థానిక తెలుగు ప్రజలతో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకగా, మహిళలు హారతులు ఇచ్చారు. భారీగా డప్పు చప్పుళ్లు, స్థానిక కళారూపాల ప్రదర్శన నడుమ తాను బస చేసే బాలాజీ సరోవర్ హోటల్‌కు కేసీఆర్ చేరుకున్నారు.
మాజీ ఎంపీ సాదుల్ ధర్మన్న ఇంటికి కేసీఆర్
షోలాపూర్ మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహా్వనం మేరకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి షోలాపూర్ భావనారుషి పేట్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్ తేనీటి విందుకు వెళ్లారు. తిరిగి హోటల్‌కు వెళ్తున్న సమయంలో మీడియా ప్రశ్నించడంతో.. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధించిన తర్వాత పండరీపూర్ విఠలేశ్వరుని మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకుంటానని మొక్కుకున్నానని చెప్పారు. ఇప్పుడు దైవ దర్శనం కోసమే వచ్చానని, రాజకీయాలు మాట్లాడనని అన్నారు.
నలుగురు మినహా కేబినెట్ మొత్తం..
సీఎం కేసీఆర్ వెంట నలుగురు మంత్రులు మినహా రాష్ట్ర కేబినెట్ మొత్తం తరలి వెళ్లింది. మంత్రులు కేటీ రామారావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ మినహా మిగతా మంత్రులంతా ఆయన వెంట ఉన్నారు. వారితో పాటు బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, సంతో‹Ùతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్లారు. మొత్తంగా వందలాది మంది నేతలు షోలాపూర్‌కు వెళ్లడంతో స్థానిక హోటళ్లు, లాడ్జీలు కిక్కిరిసిపోయాయి. బసకు ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు స్థానికంగా స్థిరపడిన తెలంగాణవాసుల ఇళ్లలో ఆశ్రయం పొందారు.
నేడు పండరీపూర్, తుల్జాపూర్‌లో ప్రత్యేక పూజలు
కేసీఆర్ మంగళవారం ఉదయం పండరీపూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సమీపంలోని సర్కోలి పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగే సభకు హాజరవుతారు. సర్కోలి సభ వేదికగా స్థానిక ఎన్‌సీపీ నేత భగీరథ్ భల్కే బీఆర్‌ఎస్‌లో చేరుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం తుల్జాపూర్‌కు చేరుకుని భవానీ మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment