కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలోని వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం అధికారులతో ఆయా శాఖల పరిధిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు ఈ నెల 25లోగా లక్ష్యాలు సాధించేలా చూడాలన్నారు.
గృహనిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణం, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు నిర్మాణ దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. సంక్షేమశాఖకు సంబంధించి వసతి గృహాల్లోని విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ వెంటనే పంపిణీ చేయాలని చెప్పారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు 35 శాతం రెన్యువల్ చేసినట్లు, కొత్తగా వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాలు సాధిస్తామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
పాఠశాల విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అమలు చేస్తున్న జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం రెండో దశ పాఠశాలల్లో వేసవి సెలవులు ఇవ్వకముందే అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇప్పుడే పూర్తయ్యిందని, వార్డు సభ్యులకు మాత్రం షెడ్యూలు ప్రకారం మార్చి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం కింద సామూహిక వివాహాలు కార్యక్రమం, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు.
ఈవీఎం గోడౌన్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి...
కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీలం తుపాను పంట నష్టపరిహారం రైతులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సొంత భవనాలు లేని 15 సీడీపీవో కార్యాలయాలకు స్థలాల సేకరణ త్వరగా చేయాలని చెప్పారు. పీహెచ్‌సీల భవన నిర్మాణాలు, ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు వివిధ పథకాల కింద పంపిణీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మెరైన్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించామని, స్థలాల సేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, సీపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీపీవో కె.ఆనంద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, ఆర్‌వీఎం పీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
‘అభివృద్ధి’ లక్ష్యాలు సాధించండి : కలెక్టర్
Published Tue, Feb 11 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement
Advertisement