సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నాయి. అయినా పనులు ప్రారంభానికి నోచలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 180 గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. 127 పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు, 47 భవనాలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చాయి. మరో ఆరింటికి కేంద్ర ప్రభుత్వ ఆర్‌జీ ఎస్‌ఏ (రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్) పథకం కింద నిధులు వచ్చాయి. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. గతంలో గిరిజన తండాలుగా ఉండీ ఇప్పుడు పంచాయతీలుగా మారిన చోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి.
పనులే షురూ కాలేదు
వివిధ పథకాల కింద మొత్తం 180 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 79 గ్రామ పంచాయతీ భవనాలకే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 101 భవనాలు ఇంకా ప్రారంభానికి నోచలేదు. నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పనులకు శ్రీకారం చుట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
స్థలాల సమస్య
పలు గ్రామ పంచాయతీల్లో స్థలం లేకపోవడం కూడా భవన నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అనువుగా లేదు. బండలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో పనులు ప్రారంభించలేకపోయామని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment