Gram Swaraj
-
ముందడుగేదీ?... నిర్మాణానికి నోచని 101 గ్రామపంచాయతీ భవనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నాయి. అయినా పనులు ప్రారంభానికి నోచలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 180 గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. 127 పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు, 47 భవనాలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చాయి. మరో ఆరింటికి కేంద్ర ప్రభుత్వ ఆర్జీ ఎస్ఏ (రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్) పథకం కింద నిధులు వచ్చాయి. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. గతంలో గిరిజన తండాలుగా ఉండీ ఇప్పుడు పంచాయతీలుగా మారిన చోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి. పనులే షురూ కాలేదు వివిధ పథకాల కింద మొత్తం 180 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 79 గ్రామ పంచాయతీ భవనాలకే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 101 భవనాలు ఇంకా ప్రారంభానికి నోచలేదు. నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పనులకు శ్రీకారం చుట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. స్థలాల సమస్య పలు గ్రామ పంచాయతీల్లో స్థలం లేకపోవడం కూడా భవన నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అనువుగా లేదు. బండలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో పనులు ప్రారంభించలేకపోయామని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గ్రామ స్వరాజ్యం.. మహిళలకే పెద్దపీట.. రాష్ట్రంలో 4,30,684 సంఘాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్వరాజ్య లక్ష్య సాధనలో గ్రామీ ణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద, ఇతర వర్గాల మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడడంతో పాటు ఒక సంఘటిత శక్తిగా ఎదిగేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారితో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఘాలు మహిళలను పొదుపు వైపు మళ్ళించి, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పతున్నాయి. మెరుగైన స్వయం ఉపాధి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,30,648 సంఘాలు ఉండగా, వాటిలో 46,09,843 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజలు రోజూ ఉపయోగించే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో శిక్షణనిచ్చి వారిని తయారీరంగం వైపు మళ్ళి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 32 జిల్లా, 553 మండల, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. మహిళలు తమకున్న నైపుణ్యాలతో రకర కాల వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మేళాలు ఏర్పా టు చేస్తున్నారు. బంగ్లాదేశ్ సహా వివిధ దేశా ల్లో నిర్వహించిన ప్రదర్శనలకు రాష్ట్ర మహిళలు హాజరయ్యారు. సెర్ప్ ద్వారా రూ.65 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రాష్ట్రంలో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా 2022–23లో ఈ సంఘాలకు రూ.15 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 32 జిల్లాల్లోని మహిళా సంఘాలకు నిర్దేశిత బ్యాంక్ లింకేజీ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించే చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రూ.6,887 కోట్ల మేర లింకేజీ కల్పించారు. 2023 మార్చి 31 లోగా ఈ లింకేజీలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గత 8 ఏళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కలి్పంచినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్లిప్‌కార్ట్, ప్లాంట్ లిపిడ్స్‌తో సెర్ప్ ఒప్పందం మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్ అవకాశాల కల్పనకు ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, ప్లాంట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 140 రకాల ఉత్పత్తులు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్లైన్లో విక్రయానికి వీలు కుదిరింది. ఇలాంటి ఎంవోయూ కుదరడం దేశంలోనే మొదటిసారి. కాగా దీనివల్ల స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపార లక్ష్యంగా నిర్దేశించారు. మహిళా సంఘాలకు చెందిన ఎండుమిర్చి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ ఏడాది రూ.200 కోట్ల వ్యాపారం లక్ష్యంగా ప్లాంట్ లిపిడ్స్‌తో ఒప్పందం కుదిరింది. చదవండి: వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు -
సర్పంచ్ల సేవలు సూపర్
న్యూఢిల్లీ: పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌లకు మోదీ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మానవత్వం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు వారి వారి గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలన్నారు. 75ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ నీటి సంరక్షణపై అత్యధిక దృష్టి పెట్టాలని. ప్రతీ నీటి బొట్టు విలువైనదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తే సదరు గ్రామంతో పాటు దేశం కూడా సుసంపన్నంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలన్నీ స్వయంసమృద్ధి సాధిస్తే దేశం పురోగతిలో ముందుంటుందని లేఖలో పేర్కొన్నారు. -
స్వయం సమృద్ధి.. స్వావలంబన
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది. -
గ్రామ స్వరాజ్యం జాడేది?
భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం నేడు కనుమరుగవుతోంది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన అనంతరం, గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లిన నాడే అసలైన ప్రజాస్వామ్యమని గాంధీజీ ప్రకటించారు. స్థానిక పరిపాలన బలోపేతం చేయాలన్న గాంధీజీ స్పూర్తితో గత కాంగ్రెస్ ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేసింది. తద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ గుర్తింపు తీసుకొచ్చి, రక్షణ కల్పించారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో పాలన ఇందుకు భిన్నంగా, గత నెల రోజులుగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు, సర్పంచులు, మండల (ఎంపీటీసీ), జిల్లా (జడ్పీటీసీ) ప్రాదేశిక సభ్యులను స్థానిక ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక పరిపాలన నిర్వహించడం, ఆయా గ్రామాలలోని ప్రజలకు కనీస సౌకర్యాలు తాగు నీరు, పారిశుద్ధ్యం, రోడ్డు నిర్మాణం లాంటి బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ, ముఖ్యమంత్రి, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను ఒకొక్కరిని ఒక్కో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇక వీళ్ళ డ్యూటీ ఏమిటంటే, గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలో అబివృద్ధి సమస్యలను గుర్తించి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి బాధ్యతలు చేపట్టడమేనట. మరీ, స్థానిక ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు ఏం చేయాలే?. స్థానిక సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల పైన ప్రభుత్వ ఉద్యోగి అజమాయిషీ ఏంటి? ఇది ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క‘ అనే ప్రజాస్వామ్య మూల సూత్రాలను విస్మరించటం కాదా? గ్రామ ప్రణాళికల పేరుతో హడావుడిచేయడం ముఖ్యమంత్రికి ఇది మొదటిసారి కాదు. గతంలో ఇదే ఎజెండాను గ్రామ జ్యోతి పేరుతో అమలుచేశారు. ఎంపీటీసీలను విస్మరించి, వాళ్ళను ఈ కార్యక్రమంలో భాగస్వామ్య చేయకుండానే నిర్వహించారు. అప్పుడు కూడా, ఇదే తరహాలో గ్రామ ప్రణాళికలు రూపొందించినారు. కానీ, అవి చెత్తబుట్ట దాఖలైనాయి. ఇప్పుడు కూడా తమకు ఏదో మేలు జరుగుతుందన్న నమ్మకం సామాన్య ప్రజలలో కనబడుతలేదు. అందుకే ప్రజలు రాక గ్రామ సభలు నాలుగు గోడల మధ్య తూతుమంత్రంగా జరుగుతున్నాయి. అందులో రూపొందించే ప్రణాళికలు సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జరుగాల్సిన పనులలో జేసీబీలు వాడుతున్నారు. రోడ్ల మరమ్మతులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలకు, గ్రామ పంచాయతీలకు కార్యాలయ భవనాలు లేని దుస్థితి నెలకొంది. మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ కార్యాలయలలో రోజువారీగా నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించే సమయం ఏది?. అసలే, రెవెన్యూ సిబ్బంది భూరికార్డుల శుద్ధీకరణ పనిలో బిజీగా ఉన్నారు. రైతుల పాసుపుస్తకాలలో పొరపాట్లు ఒకరి భూమి మరొకరికి, ఎక్కువ భూమి ఉంటే తక్కువ, తక్కువగా భూమి ఉంటే ఎక్కువ రాసినవి సరిచేసే సమయంలో, ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రావటంతో వాళ్ళ అసలు పని పక్కకుపోయింది. వికారాబాద్ జిల్లాలో పంచాయితీ సెక్రటరీలు పని ఒత్తిడి తగ్గించాలని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఉద్యోగులకు మెమోలు జారీ చేసారు. నల్గొండ జిల్లా ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదంతా చూస్తుంటే, నాకు 2004 ఎన్నికలు గుర్తొస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలపై విసుగుచెంది ఉద్యోగులు కన్నెర్ర చేశారు. నోడల్ అధికారుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. జన్మభూమి తదితర కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటానికి నాడు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. ఇంచుమించు, ఇదే ఆవేదన తెలంగాణలో చూస్తున్నాము. కేసీఆర్ స్థానిక సంస్థలను బలహీన పరిచే స్పెషల్ ఆఫీసర్ల పాలనను ఉపసంహరించుకోవాలి. స్థానిక ఖనిజ సంపదపై అధికారం స్థానిక సంస్థలకే అప్పగించి, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నినాదాన్ని బలోపేతం చేయాలని ఆశిస్తున్నాము. మన జాతిపితకు అప్పుడే అసలైన నివాళి. కొనగాల మహేష్ వ్యాసకర్త జాతీయ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొబైల్: 9866776999 -
గ్రామస్వరాజ్ అభియాన్ ఖాతాలు తెరవాలి
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఖాతాలు తెరవాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకేపీ ఏపీఎంలతో సమీక్షించారు. గ్రామస్వరాజ్ అబియాన్ యోజనలో ఏడు రకాల పథకాలు ఉన్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా ధన్జన్యోజన, సురక్ష, జీవన జ్యోతి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రామాల్లో చేసిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి చేసిన సర్వే నివేదికను ఎల్డీఎంకు సాఫ్ట్ కాపీలను అందజేయాలని ఆదేశించారు. ఇంతుకు ముందు ఈ స్కీములో ఖాతాలు తెరిచిన వారిని రెన్యూవల్ చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసి వారం రోజుల్లో ఖాతాలు తెరిపించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ వెంకటి, ఎల్డీఎం చెంచు రామయ్య, ఎస్బీఐ మేనేజర్ కృష్ణమాచారి, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఏపీడీ రామకృష్ణ, జిల్లాలోని ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు. -
పేదలదే నవభారతం
న్యూఢిల్లీ: వెనకబడిన కుటుంబానికి చెందిన అంబేడ్కర్ ముందుకెళ్లకుండా చాలా మంది అవహేళన చేశారని ప్రధాని మోదీ తెలిపారు. వారందరి ప్రయత్నాలను అంబేడ్కర్ విఫలం చేసి రాజ్యాంగ నిర్మాతగా నిలిచారన్నారు. దేశం పేదలు, వెనకబడిన వర్గాలకే చెందుతుందని మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉన్నత, ధనవంతుల కుటుంబంలో పుట్టడంతో సంబంధం లేకుండా పేదల ఇంట పుట్టినా లక్ష్య సాకారం కోసం అంబేడ్కర్ అహర్నిశలు శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు. ఐక్యంగా గ్రామ్ స్వరాజ్ అభియాన్ ‘చాలా మంది అంబేడ్కర్‌ను అవహేళన చేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ముందుకెళ్లొద్దని ఆయన్ను వెనక్కు లాగేందుకు అనుక్షణం ప్రయత్నించారు. ఆయన అభ్యుదయ భావాలను అడ్డుకున్నారు. కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. అంబేడ్కర్ కలలుగన్న పేదలు, వెనకబడిన వర్గాల నవభారతం చిత్రం మన ముందుంది’ అని తెలిపారు. అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్‌ను ముందే చూసి.. ‘దశాబ్దాల క్రితం అంబేడ్కర్ భారత్‌లో పారిశ్రామికీకరణ గురించి మాట్లాడారు. కొత్త ఉద్యోగాల కల్పన అభివృద్ధి గురించి చెప్పారు. నేడు అంబేడ్కర్ కోరిన నవభారత స్వప్న దృశ్యాన్ని నిజం చేసేలా మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోర్టులు, జలమార్గాల అభివృద్ధినీ ఆయన గుర్తించారు’ అనిపేర్కొన్నారు. భారత్‌లో దేశ విభజన, రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే టీమ్ ఇండియా స్ఫూర్తికి అంబేడ్కర్ పునాదులు వేశారని మోదీ పేర్కొన్నారు. సమాఖ్యవిధానం గురించి మాట్లాడారని దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారన్నారు. సహకారాత్మక సమాఖ్య విధానమనే మంత్రాన్నే నేటి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాంమనోహర్ లోహియా, చరణ్ సింగ్, దేవీలాల్ తదితర నేతలు వ్యవసాయం, రైతులను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా చూశారని ప్రశంసించారు. ‘దుక్కిదున్నటం, మట్టిపై దృష్టిపెట్టడాన్ని మరిచిపోతే మనల్ని మనం మరిచిపోయినట్లే’ అని గాంధీజీ సూక్తిని గుర్తుచేశారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరచాలన్న శాస్త్రి ఆలోచనలను, రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు ఉద్యమాన్ని తీసుకురావాలన్న లోహియా సిద్ధాంతాలనూ జ్ఞప్తికి తెచ్చారు. రైతులు అధునాతన సాంకేతికతను ఒంటబట్టించుకోవాలన్న 1979నాటి చరణ్ సింగ్ ప్రసంగాన్నీ గుర్తుచేశారు. నివారణే అసలైన మార్గం అనారోగ్యం తలెత్తిన తర్వాత ఇబ్బందులు పడేకంటే.. నిరోధక చర్యలపైనే ప్రజలు దృష్టిపెట్టాలని ప్రజలందరికీ మోదీ సూచించారు. ‘వ్యాధి నిరోధించడానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. త్వరగా నయమయ్యేందుకు దోహదపడుతుంది.నివారణ ద్వారా వ్యక్తిగతంగా లాభం పొందటంతోపాటు కుటుంబం, సమాజానికీ మేలు చేసినవారమవుతాం’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాధి నివారణమార్గాల్లో యోగా ఒకటని ఆయన సూచించారు. 2025 కల్లా దేశంలో క్షయ వ్యాధి లేకుండా చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా పదికోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆరోగ్య భారతం స్వచ్ఛ భారతమంత ముఖ్యమైనదన్నారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రజలకు తక్కువధరకే ఔషధాలు అందించేందుకు దేశవ్యాప్తంగా 3వేల జనఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్యనూ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
గాంధీజీ కలలు నెరవేరుతున్నాయి
దావణగెరె : మహాత్మాగాంధీ కన్న కలలు నేడు నేరవేరనున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ శామనూరు శివశంకరప్ప అన్నారు. ఆయన గురువారం స్థానిక పాలికె ఆవరణంలో జిల్లా పాలకె, జిల్లా పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వచ్ఛ సమాజ, గ్రామ స్వరాజ్యం కోసం కన్న కలలు నెరవేరనున్నాయన్నారు. అయితే ఈ స్వచ్ఛతా కార్యక్రమం గాంధీ జయంతి రోజునే కాకుండా నిత్యం చేపట్టాలని సూచించారు. కార్యక్రమం లో విధాన పరిషత్ సభ్యుడు అబ్దుల్ జబ్బార్, మేయర్ రేణుకాబాయి, జిల్లా అధికారి అంజన్‌కుమార్, ఎస్పీ.బోరలింగయ్య పాల్గొన్నారు. సాక్షి, బళ్లారి : ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బళ్లారిలో వాడవాడలా నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంధ సంస్థల నేతలు, మఠాధిపతులు చీపుర్లు పట్టుకుని చెత్త ఊడ్చారు. హొస్పేట : జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలు సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని స్థానిక కాంగ్రెస్ నేత హెచ్.అబ్దుల్ వహాబ్ అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసా సిద్ధాం తాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సాలిసిద్దయ్యస్వామి, గుజ్జల నాగరాజ్, తారిహళ్లి వెంకటేశ్, అయ్యాళిమూర్తి, డీ.వెం కటరమణ, మున్నీ, ఫహింపాషా, అబీద్, హుసేన్, కన్నీ శ్రీకంఠ పాల్గొన్నారు. శ్రీరామనగర్ : కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం గాంధీ జంయతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టి.జయరామిరెడ్డి, సుభాష్‌చంద్రబోస్, భాస్కర్‌రెడ్డి, సీహెచ్.సత్యనారాయణ(బుజ్జి), కొప్పళ కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టికూటి శ్రీనివాసు, నల్లచంద్రారావు పాల్గొన్నారు. చెళ్లకెర రూరల్ : మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసమే కాకుండా సమస్త జీవరాసుల రక్షణ, సమానతను కాపాడారని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన గురువారం స్థానిక తాలూకా పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత భారత్ అభియాన్ సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, డ్రెయినేజీ వ్యవస్థ కోసం అధిక సంఖ్యలో నిధులు విడుదల చేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి టీ.పాండ్యప్ప, అధ్యక్షుడు భాగ్యమ్మ, బాబురెడ్డి, తహశీల్దార్ శ్రీధర్ ఎస్.పాటిల్ పాల్గొన్నారు. గంగావతి : గాంధీ సర్కిల్లోని మహాత్ముడికి బీజేపీ, కన్నడ సేన కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీనగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, మాజీ ఎంపీ సూగూరు శివరామగౌడ, మనోహర్‌స్వామి, సయ్యద్ అలీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవాలంటే పల్లెల్లో చేపట్టే ప్రతీ పనిలో ప్రజలను భాగస్వామ్యుల ను చేసినపుడే అధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ‘రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌ఏ)’ పథకా న్ని రూపొందించింది. పథకాన్ని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికి చెందిన కమిటీలో సభ్యులుగా మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి, బీఆర్జీ ఎఫ్ సలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి రామకృష్ణ, పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు, పదవీ విరమణ చేసన పీఆర్ అడిషనల్ కమిషనర్ శంకర్‌రెడ్డి, కన్సల్టెంట్ ఫ్రొఫెసర్ సూర్యనారాయణరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పా టు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం జెడ్పీ సీఈఓ ఆంజనేయులు అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం.. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే పనులు చేపట్టడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధించవచ్చన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలు అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆర్‌జీపీఎస్‌ఏ పథకంలో పరిశీలిస్తారని తెలిపారు. సర్పంచ్ గా గెలవడానికి ఎన్ని ఎత్తులు వేసినా అభివృద్ధి కార్యక్రమా ల్లో, ప్రజలకు న్యాయం చేయడంలో పక్షపాతం చూపించొద్ద ని ప్రజాప్రతినిధులకు సూచించారు. జెడ్పీ సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో చట్టాలను అమలు చేయడంలో ఇబ్బం దులు ఎదురవుతున్నాయన్నారు. గ్రామ సభలు పటిష్టంగా నిర్వహించి, ప్రజల అవసరాలను వారి ద్వారానే గుర్తిస్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. చేపట్టే ప్రతీ పనిలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని, అన్ని శాఖ లు చేసే పనులను ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఆర్‌జీపీఎస్‌ఏ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ఆర్‌జీపీఎస్‌ఏ పథకం ద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయన్నారు. ప్రభుత్వాలకు ఉన్న అధికారాలన్నీ గ్రామ పంచాయతీలకు వర్తింపజేయాలన్న నిబంధన ఆర్టికల్ 40లో ఉందని చెప్పారు. 1959లో చట్టం అమలులోకి వచ్చి 33 ఏళ్లు గడిచినా గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడాన్ని అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ గుర్తించి పం చాయతీలను మరింత బలోపేతం చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించారని తెలిపారు. అందులో భాగంగానే 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణ జరిగింద ని, ఈ సవరణ ద్వారా సుమారు 27 ప్రభుత్వ శాఖలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దేశ ప్రధానికి ఎన్ని అధికారాలున్నాయో గ్రామ స్థాయిలో సర్పంచ్‌కు అన్ని అధికారాలు, విధులు ఉన్నాయని తెలిపా రు. అధికారంలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాలపై స్థానిక ప్రభుత్వాల భవిష్యత్ అధారపడి ఉండడం దౌర్భాగ్యమన్నా రు. పెరిగిన జనాభా ప్రకారం డీలిమిటేషన్, రిజర్వేషన్ల పేరిట అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తన చేతులో ఉంచుకున్నందునే ఎన్నికలు సజావుగా జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఈ రెండు అధికారాలు కమిషన్‌కు అప్పగిస్తే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావడమే కాకుండా కాలపరిమితి తీరిన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలుంటాయని వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లా పరిషత్‌లలో పీఆర్ శాఖకు చెందిన వారు కాకుండా ఇతర శాఖలకు చెందిన వారు సీఈఓలుగా పనిచేస్తున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు పంచాయతీరాజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్‌జీపీఎస్‌ఏ కన్సల్టెంట్ప్రొఫెసర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ పథకంలోనైనా అభివృద్ధికి మాత్రమే నిధులు కేటాయించగా ఈ పథకంలో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు పర్యవేక్షణకు నియమించుకునే సిబ్బంది కోసం నిధులు కేటాయిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ అధికారులతోపాటు ఒక ఇంజినీర్, ఒక డెటా ఎంట్రీ ఆపరేటర్, ఒక అకౌంటెంట్‌ను నియమించుకునే వీలు ఉంటుందని చెప్పారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రామచంద్రయ్య(కురవి), మాజీ జెడ్పీటీసీ రవీందర్రావు(వర్ధన్నపేట), ఉప సర్పంచ్ కూసం రాజమౌళి(గంగదేవిపల్లి), మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, డీపీఓ ఈఎస్.నాయక్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.