దేశవ్యాప్తంగా సర్పంచ్‌లు, పంచాయతీరాజ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.
అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment