Panchayati Raj Day
-
స్వయం సమృద్ధి.. స్వావలంబన
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది. -
రాష్ట్రానికి ‘పంచాయతీరాజ్’ అవార్డులు
జాతీయ స్థాయిలో ఏడు పీఎస్పీ పురస్కారాలు సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి పలు అవార్డులు లభించాయి. ఆదివారం జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు ఈ పురస్కారాలను అందుకున్నారు. జాతీయ స్థాయిలో వరంగల్ జిల్లా పరిషత్‌కు, సిద్దిపేట, తలకొండపల్లి మండల పరిషత్‌లకు, సిరిసిల్ల మండలం బాలమల్లుపల్లి, చందుర్తి మండలం రామన్నపేట, సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లిలకు పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారాలు లభించాయి. కరీంనగర్ జిల్లా చందుర్తి గ్రామ పంచాయతీకి రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ అవార్డు కింద రూ.10 లక్షల నగదు బహుమతి లభించింది. జెంషెడ్‌పూర్‌లో జరిగిన పంచాయతీరాజ్ దివస్‌లో రాష్ట్రం నుంచి పీఆర్అండ్ఆర్డీ డెరైక్టర్ అనితారామ్ చంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, అసిస్టెంట్ కమిషనర్ సుబ్రమణ్యం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌ల చైర్మన్లు, 24 మంది మండలపరిషత్‌ల అధ్యక్షులు, 34 మంది గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.