
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్‌లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు.
శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు.