చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు.
ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్‌లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం.
రెండు విడతల్లో..
పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
పీఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ లోన్‌తోపాటు మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. లబ్ధిదారులకు మొదట 5-7 రోజుల (40 గంటలు) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజుల (120 గంటలు) అధునాతన శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.
అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 అందిస్తారు. తర్వాత వారి వృత్తిలో భాగంగా నిర్వహించే డిజిటల్ లావాదేవీలకు ఒక్కోదానికి రూ. 1 చొప్పున నెలవారీ 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం చెల్లిస్తారు. లబ్ధిదారుల ఉత్పత్తులకు నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ప్రమోషన్, ఈ-కామర్స్ అనుసంధానం, ట్రేడ్ ఫెయిర్స్ ప్రకటనలు, ప్రచారం, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను జాతీయ మార్కెటింగ్ కమిటీ అందిస్తుంది.
అర్హతలు
స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో పని చేసే చేతివృత్తులపై ఆధారపడినవారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పేర్కొన్న 18 కుటుంబ ఆధారిత సాంప్రదాయ హస్తకళలు లేదా చేతివృత్తుల్లో ఏదో ఒకదానిలో నిమగ్నమైనవారు ఈ పథకానికి అర్హులు. అలాగే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment