న్యూఢిల్లీ: వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకంపై ఆయన శనివారం మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్‌లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు.
గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యమని చెప్పారు. సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్ సాయం, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 13 నుంచి పార్లమెంటు మలి దశ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు.
మోదీ తల్లి స్మృతులపై మైక్రోసైట్
మోదీ మాతృమూర్తి హీరాబెన్ స్మృతుల సమాహారంగా ‘మా’ పేరిట మైక్రోసైట్ ఆయన అధికార వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఆమెకు నివాళిగా దీన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ‘‘బిడ్డలకు హీరాబెన్ నేర్పిన విలువలు తదితరాల విశేషాలు సైట్‌లో ఉంటాయి. హీరాబా జీవితం, ఫొటోలు, వీడియోలు, ఆమె వందో పుట్టినరోజు సందర్భంగా మోదీ రాసిన బ్లాగ్, ఆమె మృతిపై పలు దేశాధినేతల స్పందన, నివాళులు కూడా ఉంటాయి’’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment