National Highways Authority of India
-
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
హైవేలపై డ్రైవర్లకు భవనాలు: మోదీ
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు. శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు. -
10 వేల కిలోమీటర్ల డిజిటల్ హైవేలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్హెచ్ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది. -
ఎన్హెచ్ఏఐ మరో రూ.3,800 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఎన్హెచ్ఏఐ ఇన్విట్) ద్వారా మరో రూ.3,800 కోట్ల నిధులను సమీకరించాలని అనుకుంటున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎన్హెచ్ఏఐ ఇన్విట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 25 ఏళ్ల కాలానికి ఎన్సీడీల జారీ ద్వారా మరో రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదన కూడా ఉన్నట్టు చెప్పారు. ఇన్విట్ బాండ్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో లిస్ట్ చేస్తామన్నారు. దీంతో ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని, ట్రేడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇన్విట్లు ఇప్పటి వరకు రూ.8,000 కోట్లను విదేశీ, దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు జారీ చేయడం ద్వారా సమీకరించినట్టు మంత్రి వెల్లడించారు. ఇన్విట్లు ఆదాయాన్నిచ్చే మౌలిక ప్రాజెక్టులపై నిధులు సమీకరించుకునేందుకు కంపెనీలకు ఒక మార్గం. తద్వారా ఆయా నిధులను అవి ఇతర ప్రాజెక్టులకు వినియోగించుకోగలవు. -
మర్రి.. వర్రీ..
మండే ఎండల్లో కూడా భాగ్యనగర ప్రాంతం చల్లగా ఉండేదట. ఏప్రిల్‌లో కూడా మంచు కురిసేదని ఇప్పటికీ చెబుతుంటారు. రోడ్లకిరువైపులా అశోకుడు చెట్లను పెంచిన తీరును కాకతీయులు కొనసాగించారు. హైదరాబాద్‌లో ఆ సంప్రదాయాన్ని రెండో నిజాం కూడా కొనసాగించారు. వారి హయాంలో నగరం చుట్టూ అన్ని ప్రధాన రహదారులపై వేల సంఖ్యలో మర్రి వృక్షాలు పెంచారు. నగరానికి దారితీసే అన్ని మార్గాల్లో పందిరి వేసినట్టుగా ఎదిగిన మర్రి వృక్షాలు చల్లటి వాతావరణాన్ని పంచేవి. రహదారుల విస్తరణతో రోడ్లపై ఉన్న వృక్షాలన్నీ కాలగర్భంలో కలిసిపోగా, మిగిలిన ఏకైక రోడ్డు కూడా ఆ జ్ఞాపకాన్ని కోల్పోబోతున్నది. సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయరహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలో ఉన్న మన్నెగూడ కూడలి వరకు దీన్ని 60 మీటర్ల వెడల్పుతో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో అభివృద్ధి చేయనున్నారు. రూ.929 కోట్లతో విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచింది. రెండుమూడు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ శుభవార్తనే. కానీ ఆ రోడ్డులో విస్తరించి ఉన్న ఊడల మర్రి వృక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవ లం 46 కి.మీ. దూరంలో 890 మర్రిచెట్లున్నాయి. ఇవన్నీ 80 నుంచి నుంచి వంద ఏళ్ల వయసున్న వృక్షాలు. వీటిని తొలగిస్తే, నగరంతో పెనవేసుకున్న నిజాం కాలం నాటి ఊడల మర్రులన్నీ అంతరించినట్టే. రెండేళ్లుగా కసరత్తు.. ఈ రోడ్డును విస్తరించనున్నట్టు ప్రభుత్వం గత ఐదారేళ్లుగా చెబుతోంది. రెండేళ్ల కిందటే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. మన్నెగూడ నుంచి పరిగిమీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరించింది. మన్నెగూడ వరకు నాలుగు వరుసల విస్తరణ బాధ్యత మాత్రం ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్నందున, కేంద్రప్రభుత్వం రెండేళ్లకిందట ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. అప్పటినుంచి అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ వృక్షాలను తొలగించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. దీంతొ స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వటా ఫౌండేషన్ అనే సంస్థ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఫిర్యాదు చేయడంతో, తాత్కాలింగా ఆ వృక్షాల తొలగింపు నిలిచిపోయింది. వాటిని పరిరక్షిస్తామని కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనుమానాలెందుకు? ప్రత్యామ్నాయం ఏమైంది? వృక్షాలను తొలగిస్తే పర్యావరణానికి భారీ చేటు తప్పదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం వేడెక్కకుండా కాపాడుతూ, ప్రాణవాయువునిచ్చే చెట్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నగరం చుట్టూ వందేళ్ల వయసుండే వృక్షాలు మాయమైన నేపథ్యంలో, ఈ కొద్ది వృక్షాలనైనా కాపాడుకోవాలి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో వాటిని మరో చోట నాటాల్సి ఉంది. ఇప్పుడు చేవెళ్ల రోడ్డు విస్తరణలో ఈ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. కానీ గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ట్రాన్స్‌లొకేషన్‌ను ప్రక్రియను అధికారులు అమలు చేయలేదు. భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో చేవెళ్ల రోడ్డుపై ఉన్న భారీ వృక్షాల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు వ్యయంలో చెట్ల తరలింపు ఖర్చు.. ఈ రోడ్డు విస్తరణకు కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లను కేటాయించింది. ఇందులో చెట్ల ట్రాన్స్‌లొకేషన్ ఖర్చులను కూడా చేర్చింది. సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములను గుర్తించి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేయాలనేది ఆలోచన. వృక్షాలను పరిశీలించి వాటిల్లో ట్రాన్స్‌లొకేట్ చేస్తే బతికేవాటిని గుర్తించి తరలిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ‘కొన్నింటికే పరిమితం చేస్తారేమో’ పెద్ద సంఖ్యలో ఉన్న చెట్లను తరలించటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకు తగ్గ ఉపకరణాలు కూడా అందుబాటులో లేవు. సచివాలయ నిర్మాణ సమయంలోనూ చాలా చెట్లను కొట్టేశారు. ఇక గండిపేట రోడ్డు విస్తరణలో, తరలింపునకు యో గ్యమైన చెట్లను కూడా నరికేశారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల రోడ్డుపైనా కొన్ని వృక్షాలనే ట్రాన్స్‌లొకేషన్‌కు గుర్తించి మిగతావాటిని నరికేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ‘‘ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియలో ఉచితంగా సేవలందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సాంకేతిక, ఆర్థిక సహకారం అందించి, స్థలాలు చూపితే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం’’ అని వటా ఫౌండేషన్ నిర్వాహకులు ఉదయ్‌కృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. కాల్చి.. కూల్చి ఈ రోడ్డుపై భారీ వృక్షాలున్నందువల్ల వాటిని తొలగించటం ఇష్టంలేక రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పడేకేసిందంటూ గతంలో ఓ అభిప్రాయం వ్యాపించింది. రోడ్డు విస్తరిస్తే భూములకు డిమాండ్ పెరుగుతుందని, కొందరు రియల్ వ్యాపారులు రైతులను ఎగదోసి మర్రి చెట్లను కూల్చే కుట్రకు తెరదీశారు. రాత్రికి రాత్రి వృక్షాల మొదళ్ల చుట్టూ మంటలు పెట్టి కాల్చివేయించారు. దీంతో చూస్తుండగానే వృక్షాలు నేలకొరిగాయి. ఇలా ఏడాదిన్నరలో ఏకంగా వంద మర్రి చెట్లను కూల్చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కాల్చివేతలు కొనసాగుతున్నాయి. -
ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్.. రాష్ట్రం మెడలో చేరనున్న కొత్త ఆభరణం.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే అపురూపం.. చిన్న పట్టణాలను కలుపుతూ పోయే ఓ అద్భుతం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన రీజినల్ రింగ్ రోడ్డు ఊహలు అతి త్వరలో నిజం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల ఆవల 338 కి.మీ. మేర ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు 50–70 కి.మీ. దూరంలో ఉన్న దాదాపు 20కి పైగా చిన్న పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారుల అనుసంధానంతో ఈ రింగు ఏర్పడనుంది. జాతీయ రహదారుల ప్రాజెక్టుగా కేంద్రమే సొంత వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండనందున నాట్ వయోబుల్ ప్రాజెక్టుగా కేంద్రం దీన్ని ఇటీవలి వరకు అటకెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడం, కేంద్రం సూచించిన మార్పులు చేపట్టేం దుకు సమ్మతించటంతో కేంద్రం దీనికి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఇక త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కొత్త రోడ్డు ఏర్పడితే రాష్ట్రం పురోగతిలో కొత్త కోణాలను చవిచూడనుంది. ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో సీఎంతో ఈ విషయంపై భేటీ అవుతానని చెప్పారు. ఓఆర్ఆర్తో మారిన రూపురేఖలు.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముందుచూపు ఇప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మారేందుకు దోహదం చేసింది. ఇంతపెద్ద రోడ్డు అవసరమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. దేశంలోనే 158 కి.మీ. తొలి 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా ఔటర్ రింగు రోడ్డును ఆయన అందుబాటులోకి తెచ్చారు (ఆయన మరణానంతరం మొత్తం రోడ్డు పూర్తి). అది హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెండటంతో కీలకంగా మారింది. ఆ రోడ్డును ఆసరా చేసుకునే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వస్తున్నాయి. ఆ రోడ్డు ఆలంబనగా పారిశ్రామిక క్లస్టర్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. భారీగా ఉపాధితో పాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో ఎంతో ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రం మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా ఈ రోడ్డు మీదుగా సులభంగా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల నగర ట్రాఫిక్‌పై పెను భారం తప్పింది. భవిష్యత్తులో ఈ నగరం మరింతగా పురోగమించేందుకు ఇది దోహదం చేసేందుకు సిద్ధంగా ఉంది. తొలుత అవునని, ఆ తర్వాత కాదని.. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అది జాతీయ రహదారుల అనుసంధానంతో జరగాల్సి ఉన్నందున ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరింది. ఇందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చాక మరికొన్ని ప్రాజెక్టులతో కలసి దీనిపై స్వయంగా ప్రధాని మోదీ సమీక్షించారు. ఇంత భారీ వ్యయంతో చేపట్టే రహదారి వల్ల తిరిగి ఆదాయం పెద్దగా ఉండదని తేల్చారు. టోల్ రూపంలో వచ్చే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని లెక్కలేసి చివరకు ఈ ప్రతిపాదనను దాదాపు తిరస్కరించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరటంతో తిరిగి పరిశీలించి, ఈ రోడ్డు వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగేలా చూడాలని రాష్ట్రానికి సూచించింది. దీంతోపాటు భూసేకరణ ఖర్చులో సగం భరించాలని అడిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించటంతో దాని పునఃపరిశీలనకు అంగీకరించింది. తొలుత ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాణిజ్యపరంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఎక్స్‌ప్రెస్ వేగా దీన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఔటర్ రింగు రోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్ వేగా ఉండటంతోనే మంచి ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఆరు వరుసలు నిర్మించాలని ప్రణాళిక మార్చారు. ఉపయోగాలు బోలెడు.. హైదరాబాద్‌కు 50–70 కి.మీ. దూరంలోనే ఉన్నప్పటికీ ఎన్నో ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. స్థానికంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలు తప్ప ఉపాధి కరువైంది. ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటైన ప్రాంతాల్లో ఈ సమస్య తీరింది. అదే తరహాలో ఎక్స్‌ప్రెస్ వేగా రూపుదిద్దుకునే ఈ భారీ రింగు రోడ్డుతో ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నాయి. సరైన రోడ్ నెట్వర్క్ ఉంటే ఆ ప్రాంతాలకు కొత్త పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తుంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లు రూపొందుతాయి. హోటళ్లు, ఎంటర్టైన్మెంట్, రీక్రియేషన్ జోన్లు ఏర్పాటవుతాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధికి అవకాశం కలుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ట్రాఫిక్ సమస్యలకూ కొంత విరుగుడు కలుగుతుంది. ఈ రోడ్డును ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానిస్తూ 25 స్పైనల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. దాదాపు 300 గ్రామాలను అనుసంధానిస్తుంది. ఆర్ఆర్ఆర్ విశేషాలు.. రీజినల్ రింగురోడ్డు నిడివి: 338 కిలోమీటర్లు అనుసంధానమయ్యే పట్టణాలు: సంగారెడ్డి– నర్సాపూర్– తూప్రాన్– గజ్వేల్– జగదేవ్‌పూర్– భువనగిరి– చౌటుప్పల్ –ఆమన్‌గల్– యాచారం– కందుకూరు– షాద్‌నగర్– చేవెళ్ల– కంది. మొదటి దశ: 152 కి.మీ. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉంటుంది. రెండో దశ: 186 కి.మీ. ఇందులో ఆమన్‌గల్ నుంచి కంది వరకు ఉంటుంది. ఈశాన్య భాగం: తూప్రాన్ నుంచి మల్కాపూర్ వరకు ఆగ్నేయ భాగం: మల్కాపూర్ నుంచి షాద్‌నగర్ వరకు నైరుతి భాగం: షాద్‌నగర్ నుంచి కౌలంపేట వరకు వాయువ్య భాగం: కౌలంపేట నుంచి తూప్రాన్ వరకు ఏయే జాతీయ రహదారులతో రింగ్ ఏర్పడుతుంది: ఎన్‌హెచ్ 65– ఎన్‌హెచ్ 44– ఎన్‌హెచ్163– ఎన్‌హెచ్ 765 నిర్మాణ అంచనా: తొలుత రూ.7 వేల కోట్లు. ప్రస్తుతం రూ.12,800 కోట్లకు చేరింది. ఇందులో భూసేకణ వాటా రూ.3 వేల కోట్లు భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం వాటా రూ.1,500 కోట్లు ఎంత భూమి అవసరం: దాదాపు 11 వేల ఎకరాలు -
ఆసియాలోనే పొడవైన టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఆసియాలోని అతి పొడవైన జోజిలా టన్నెల్ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను మేఘా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారి ఏర్పాటవుతోంది. కార్గిల్ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపేలా జోజిలా టన్నెల్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఈ సొరంగం పొడవు 14.15 కి.మీ.లు కాగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇది ఆసియా రెండు దిశలలో పొడవైన సొరంగం. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన ఎంఈఐఎల్ ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే లద్దాఖ్, శ్రీనగర్ మధ్య ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రయాణం దాదాపు 3.30 గంటలు పడుతుంది ఈ రహదారి నిర్మాణంతో 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ లో మంచు కారణంగా స్తంభించింది. జోజిలా సొరంగం నిర్మాణంతో శ్రీనగర్, లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతుంది. (చదవండి: ‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’) దాదాపు 33 కిలోమీటర్ల జోజిలా రహదారిని 2 విభాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి విభాగంలో 18.63 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. రెండో విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ టన్నెల్, రహదారిని నిర్మిస్తోంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎమెర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. ముఖ్యంగా శీతాకాలంలో ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే వ్యయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. The watershed moment in the road history of the UTs of Jammu & Kashmir & Ladakh is finally here. Today virtually initiated the 'ceremonial blast' of #ZojilaTunnel in the presence of MoS @Gen_VKSingh Ji,... pic.twitter.com/iYMKdOzlNM — Nitin Gadkari (@nitin_gadkari) October 15, 2020 -
ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపులు వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి ఫాస్టాగ్‌ను పొందవచ్చని వివరించింది. మైఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని దగ్గర్లోని సెంటర్‌ను తెలుసుకోవచ్చు. ఇక ఫాస్టాగ్ వాలెట్లో సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ వంటి మిగిలిన అంశాల్లో మార్పులు లేవని స్పష్టంచేసింది. -
‘ఆర్వీ’కి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే
ఎన్హెచ్ఏఐతో కలసి పెగ్ మార్కింగ్‌కు కసరత్తు సాక్షి, అమరావతి: అనంతపురం–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్ బాధ్యతల్ని ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించింది. రాజధానికి సీడ్ యాక్సెస్ రోడ్డు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీతో పాటు అనంత– అమరావతి రోడ్డు డీపీఆర్ బాధ్యతల్ని గతంలో ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించిన ప్రభుత్వం తాజాగా అలైన్మెంట్ బాధ్యతల్ని కూడా అదే సంస్థకు అప్పగించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయించాల్సిన అలైన్మెంట్, భూసేకరణ తదితర బాధ్యతల్ని ఏకంగా కన్సల్టెన్సీకి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అలైన్మెంట్, భూ సేకరణ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాల్సి ఉంది. ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున మొత్తం పనులు ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అయితే ఆర్వీ అసోసియేట్స్ ఎన్హెచ్ఏఐతో కలిసి సర్వే నిర్వహిస్తుందని ఆర్అండ్బీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.