చేవెళ్ల రోడ్డుకు రెండువైపులా ఉన్న భారీ మర్రి వృక్షాలు
మండే ఎండల్లో కూడా భాగ్యనగర ప్రాంతం చల్లగా ఉండేదట. ఏప్రిల్‌లో కూడా మంచు కురిసేదని ఇప్పటికీ చెబుతుంటారు. రోడ్లకిరువైపులా అశోకుడు చెట్లను పెంచిన తీరును కాకతీయులు కొనసాగించారు. హైదరాబాద్‌లో ఆ సంప్రదాయాన్ని రెండో నిజాం కూడా కొనసాగించారు. వారి హయాంలో నగరం చుట్టూ అన్ని ప్రధాన రహదారులపై వేల సంఖ్యలో మర్రి వృక్షాలు పెంచారు. నగరానికి దారితీసే అన్ని మార్గాల్లో పందిరి వేసినట్టుగా ఎదిగిన మర్రి వృక్షాలు చల్లటి వాతావరణాన్ని పంచేవి. రహదారుల విస్తరణతో రోడ్లపై ఉన్న వృక్షాలన్నీ కాలగర్భంలో కలిసిపోగా, మిగిలిన ఏకైక రోడ్డు కూడా ఆ జ్ఞాపకాన్ని కోల్పోబోతున్నది.
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయరహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలో ఉన్న మన్నెగూడ కూడలి వరకు దీన్ని 60 మీటర్ల వెడల్పుతో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో అభివృద్ధి చేయనున్నారు. రూ.929 కోట్లతో విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచింది. రెండుమూడు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ శుభవార్తనే. కానీ ఆ రోడ్డులో విస్తరించి ఉన్న ఊడల మర్రి వృక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవ లం 46 కి.మీ. దూరంలో 890 మర్రిచెట్లున్నాయి. ఇవన్నీ 80 నుంచి నుంచి వంద ఏళ్ల వయసున్న వృక్షాలు. వీటిని తొలగిస్తే, నగరంతో పెనవేసుకున్న నిజాం కాలం నాటి ఊడల మర్రులన్నీ అంతరించినట్టే.
రెండేళ్లుగా కసరత్తు..
ఈ రోడ్డును విస్తరించనున్నట్టు ప్రభుత్వం గత ఐదారేళ్లుగా చెబుతోంది. రెండేళ్ల కిందటే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. మన్నెగూడ నుంచి పరిగిమీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరించింది. మన్నెగూడ వరకు నాలుగు వరుసల విస్తరణ బాధ్యత మాత్రం ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉన్నందున, కేంద్రప్రభుత్వం రెండేళ్లకిందట ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. అప్పటినుంచి అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు.
ఈ వృక్షాలను తొలగించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. దీంతొ స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వటా ఫౌండేషన్ అనే సంస్థ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఫిర్యాదు చేయడంతో, తాత్కాలింగా ఆ వృక్షాల తొలగింపు నిలిచిపోయింది. వాటిని పరిరక్షిస్తామని కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు.
అనుమానాలెందుకు? ప్రత్యామ్నాయం ఏమైంది?
వృక్షాలను తొలగిస్తే పర్యావరణానికి భారీ చేటు తప్పదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం వేడెక్కకుండా కాపాడుతూ, ప్రాణవాయువునిచ్చే చెట్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నగరం చుట్టూ వందేళ్ల వయసుండే వృక్షాలు మాయమైన నేపథ్యంలో, ఈ కొద్ది వృక్షాలనైనా కాపాడుకోవాలి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో వాటిని మరో చోట నాటాల్సి ఉంది.
ఇప్పుడు చేవెళ్ల రోడ్డు విస్తరణలో ఈ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. కానీ గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ట్రాన్స్‌లొకేషన్‌ను ప్రక్రియను అధికారులు అమలు చేయలేదు. భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో చేవెళ్ల రోడ్డుపై ఉన్న భారీ వృక్షాల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రాజెక్టు వ్యయంలో చెట్ల తరలింపు ఖర్చు..
ఈ రోడ్డు విస్తరణకు కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లను కేటాయించింది. ఇందులో చెట్ల ట్రాన్స్‌లొకేషన్ ఖర్చులను కూడా చేర్చింది. సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములను గుర్తించి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేయాలనేది ఆలోచన. వృక్షాలను పరిశీలించి వాటిల్లో ట్రాన్స్‌లొకేట్ చేస్తే బతికేవాటిని గుర్తించి తరలిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.
‘కొన్నింటికే పరిమితం చేస్తారేమో’
పెద్ద సంఖ్యలో ఉన్న చెట్లను తరలించటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకు తగ్గ ఉపకరణాలు కూడా అందుబాటులో లేవు. సచివాలయ నిర్మాణ సమయంలోనూ చాలా చెట్లను కొట్టేశారు. ఇక గండిపేట రోడ్డు విస్తరణలో, తరలింపునకు యో గ్యమైన చెట్లను కూడా నరికేశారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల రోడ్డుపైనా కొన్ని వృక్షాలనే ట్రాన్స్‌లొకేషన్‌కు గుర్తించి మిగతావాటిని నరికేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
‘‘ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియలో ఉచితంగా సేవలందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సాంకేతిక, ఆర్థిక సహకారం అందించి, స్థలాలు చూపితే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం’’ అని వటా ఫౌండేషన్ నిర్వాహకులు ఉదయ్‌కృష్ణ ‘సాక్షి’తో చెప్పారు.
కాల్చి.. కూల్చి
ఈ రోడ్డుపై భారీ వృక్షాలున్నందువల్ల వాటిని తొలగించటం ఇష్టంలేక రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పడేకేసిందంటూ గతంలో ఓ అభిప్రాయం వ్యాపించింది. రోడ్డు విస్తరిస్తే భూములకు డిమాండ్ పెరుగుతుందని, కొందరు రియల్ వ్యాపారులు రైతులను ఎగదోసి మర్రి చెట్లను కూల్చే కుట్రకు తెరదీశారు. రాత్రికి రాత్రి వృక్షాల మొదళ్ల చుట్టూ మంటలు పెట్టి కాల్చివేయించారు. దీంతో చూస్తుండగానే వృక్షాలు నేలకొరిగాయి. ఇలా ఏడాదిన్నరలో ఏకంగా వంద మర్రి చెట్లను కూల్చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కాల్చివేతలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment