అదో జాతీయ రహదారి.. రోడ్డుకు ఇరువైపులా 760 మర్రి వృక్షాలున్నాయి.. ఇప్పుడు రోడ్డు విస్తరణతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి.. వాటిని ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.. అయితే ఆ కసరత్తు తర్వాత వాటి సంఖ్య కనీసం మూడు వేలు కాబోతోంది. ఎలా అంటే.. అదో ఆసక్తికర ప్రయోగం. సఫలమైతే అద్భుతం. ఇందుకు వేదిక అవుతున్న రోడ్డు హైదరాబాద్ శివారులోని ‘అప్పా’జంక్షన్ నుంచి చేవెళ్ల మీదుగా కొనసాగుతున్న బీజాపూర్ హైవే.
సాక్షి, హైదరాబాద్: పట్నం.. 3,4 దశాబ్దాల క్రితం వరకు హైదరాబాద్‌ను తెలంగాణ పల్లెలు పిలుచు కునేపేరు. ఈ నగరానికి దారితీసే ప్రధాన రహదారులన్నీ మర్రి చెట్లతో పందిరి వేసినట్టు కనిపించేవి. రాజీవ్ రహదారి, నిజామాబాద్ రోడ్డు, ఓల్డ్ బొంబాయి హైవే, బెంగళూరు రోడ్డు, విజయవాడ హైవే, సాగర్ రోడ్డు, చేవెళ్ల రహదారి.. ఇలా అన్ని రోడ్లూ ఇరువైపులా ఊడలు దిగిన మర్రి వృక్షాలతో అద్భుతంగా కనిపించేవి. దారి వెంట వెళ్లేవారికి చల్లని నీడనిచ్చేవి.
కానీ అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ ఆ మర్రి చెట్ల అంతానికి కారణమైంది. ఒక్క చేవెళ్ల రోడ్డు తప్ప అన్ని ప్రధాన రహదారుల్లో ఆ మహా వృక్షాలు మాయమయ్యాయి. ఇప్పుడు ఆ చేవెళ్ల రోడ్డును కూడా విస్తరించేందుకు సిద్ధమవుతుండటంతో.. ఎన్‌హెచ్‌ఐఏ పరిధిలోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు 41 కి.మీ. పరిధిలో ఉన్న 760 మర్రి చెట్లు ప్రమా దంలో పడ్డాయి. అయితే ఆ చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేయకుండా, ట్రాన్స్‌లొకేట్ (పెకిలించి వేరే చోట నాటడం) చేయడం ద్వారా రక్షించాలని వృక్ష ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంస్థ ముందుకొచి్చ, వాటిని ట్రాన్స్‌లొకేట్ చేయటమే కాకుండా.. ఆ 760 చెట్లను దాదాపు ఐదు వేల వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. మర్రికి స్వతహాగా ఉండే లక్షణాన్ని ఇందుకోసం ఉపయోగించుకోనుంది.
ఊడ చెప్పిన జాడ..
పిల్లల మర్రి.. మహబూబ్‌నగర్ పట్టణ శివారులో దాదాపు మూడెకరాల్లో విస్తరించిన మర్రి వనం. 500–750 ఏళ్ల వయసు దాని సొంతమని నిపుణులు అంటున్నారు. ఓ చెట్టు ఊడలు భూమిలో నాటుకుని మరో చెట్టుగా ఎదిగి.. అలా ఎకరాల్లో విస్తరించింది. కోల్‌కతాలోని ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్‌లో కూడా ఇంతే. దాదాపు 250 ఏళ్ల వయసున్న మర్రి.. పిల్లలుగా విస్తరించి ఓ చిన్నపాటి అడవిని తలపిస్తోంది. ఇది మర్రికి ఉన్న సహజసిద్ధ ప్రత్యేక లక్షణం. ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని ఒక చెట్టు నుంచి మరికొన్ని చెట్లను సృష్టించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘వటా ఫౌండేషన్’సిద్ధమవుతోంది.
కొమ్మలే మరో చెట్టుగా..
మర్రిచెట్టు కొమ్మలు చాలా దూరం వరకు ఎదుగుతాయి. వాటికి ఊతంగా నేలకు దిగే ఊడలు మరో మొదలుగా మారతాయి. అలా విస్తరిస్తూ పోతాయి. ఇప్పుడు చేవెళ్ల రోడ్డుపై ఉన్న వృక్షాల్లో అలాంటి కొమ్మలను గుర్తించి వాటిని తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చోట పాతుతారు. ఆ కొమ్మ నుంచి వేర్లు ఎదిగేవరకు పోషణ చేపట్టి దాన్ని మరో చెట్టులా మారుస్తారు. అలా ఒక్కో చెట్టుకు ఉన్న అలాంటి కొమ్మల ఆధారంగా ఐదు నుంచి పదిపదిహేను వరకు విడదీస్తారు. ఇప్పటికే నేలను తాకి ఎదుగుతున్న ఊడలుంటే.. వాటిని కూడా తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చెట్టుగా పాతుతారు.
ఆ ఆలోచన అప్పటిది..
రెండేళ్ల కింద గోవాలో వందేళ్ల వయసున్న మర్రి వృక్షం కూలిపోతే.. దాన్ని రక్షించాలంటూ స్థానికులు ఈ ఫౌండేషన్‌ను సంప్రదించారు. అక్కడికి వెళ్లిన దాని నిర్వాహకుడు ఉదయ్‌కృష్ణ.. దానికి వేళ్లూనుకున్న ఊడల కొమ్మలు గుర్తించి స్థానికుల సాయంతో జాగ్రత్తగా వేరు చేసి విడివిడిగా నాటితే అవి కొత్త చెట్లుగా ఎదగటం ప్రారంభించాయి. కొందరు స్థానికులు డ్రమ్ముల్లో మట్టి నింపి చిన్నచిన్న కొమ్మలను నాటి ఎదిగేలా చేశారు. అప్పటి నుంచే ఇలా ఒక చెట్టు నుంచి మరిన్ని చెట్లు సృష్టించొచ్చన్న ఆలోచన ఆ సంస్థలో ప్రారంభమైంది. గతేడాది సిరిసిల్లలో కూడా ఓ మర్రి వృక్షం పడిపోతే, దాన్ని ట్రాన్స్‌లొకేట్ చేసే క్రమంలో మూడు చోట్ల వేరువేరు కొమ్మలు నాటారు. అందులో రెండు వేళ్లూనుకున్నాయని ఉదయ్‌కృష్ణ తెలిపారు. ఈ క్రమంలోనే చేవెళ్ల రోడ్డులో ఉన్న చెట్లను వేల సంఖ్యలోకి మార్చే ప్రయోగానికి ఆయన సిద్ధమయ్యారు.
చేవెళ్ల మర్రి రాష్ట్రం అంతటా..
‘‘అప్పట్లో రోడ్లకిరువైపులా మర్రి చెట్లు ఉండే పద్ధతి కనుమరుగైంది. కానీ చేవెళ్ల రోడ్డుకు ఇంకా ఆ శోభ ఉంది. దాన్ని విస్తరించనుండటంతో అవి కూడా మాయం కానున్నాయి. కానీ అలా కానీయకూడదు. వాటిని కాపాడాలి. కొందరు ఔత్సాహికులు వాటి ట్రాన్స్‌లొకేషన్‌కు వీలుగా స్థలాన్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తల్లి చెట్టు నుంచి పిల్ల చెట్లను వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో నాటి ఆ వృక్ష సంపదను కాపాడాలన్నది ఆలోచన. చేవెళ్ల రోడ్డుపై వందల సంఖ్యలో ఉన్న మర్రిని వేల సంఖ్యలోకి మార్చి.. ఆ చెట్ల వరసకు గుర్తుగా రాష్ట్రమంతటా వాటిని నాటి పెంచాలన్నది ఆలోచన. భావితరాలకు ఇది గొప్ప కానుక అవుతుంది’’
– ఉదయ్‌కృష్ణ, వటా ఫౌండేషన్ నిర్వాహకులు
చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment