banyan tree
-
ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?
నిర్మల్: దేశచరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు పేరుంది. జనరల్ డయ్యర్ చేసిన ఈ నరమేథాన్ని దేశం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. కారణం మన చరిత్రపుటల్లో ఈ ఘటనకు..కారకులకు..అమరులకు చోటిచ్చారు కనుక. కానీ.. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే దాదాపు 60 ఏళ్లకిందట అంతకంటే దారుణమైన మారణహోమం మనరాష్ట్రంలోనే చోటుచేసుకుంది. ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది. ఏంటా ప్రశ్న... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే. ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ ! 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు. పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు. కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు. ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది 1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు. ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ముందుతరాలకు తెలిసేలా.. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడుపాఠ్యాంశంగా పెడితే... వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు. – డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఆపరేషన్.. ట్రాన్స్ ప్లాంటేషన్..
‘శ్రీశైలం రహదారిలో ఓ స్థల యజమాని తన ప్లాట్‌లో అడ్డుగా ఉన్న రెండు మర్రి చెట్లను కొట్టేసి రోడ్డు పక్కన నిర్జీవంగా పడేశాడు. ఇది చూసిన వృక్ష ప్రేమికులు వందేళ్ల వయసు ఉన్న ఈ చెట్లను కాపాడుకోవాలని భావించారు. మరి, అంత పెద్ద చెట్లు తరలించాలంటే భారీ క్రెయిన్, పెద్ద లారీ, కారి్మకులు అవసరం. వీటి ఖర్చు కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న నాల్గో తరగతి అమ్మాయి స్పందించింది. చెట్లు తరలించేందుకు అయ్యే ఆర్థిక సహాయాన్ని అందించింది. అంతే ఈ చెట్లను అక్కడి నుంచి మణికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ చెట్టు స్కూల్ విద్యార్థులకు నీడనిస్తూ హాయిగా ఉంది.’ ‘ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలో భారీ వర్షానికి చీమ చింతకాయ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టును ఎలాగైనా కాపాడాలని ప్రిన్సిపాల్ భావించారు. భారీ క్రెయిన్ సహాయంతో 300 మంది స్కూల్ విద్యార్థులు చూస్తుండగా ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. ఇక అక్కడి నుంచి ప్రతి ఏటా జులై 23న స్కూల్ విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టుకు రాఖీ కడుతూ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.’ ఇలా ఒకటీ రెండూ కాదు కొత్త సచివాలయం, కూకట్‌పల్లిలో ఫోరం మాల్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న వందలాది వృక్షాలను వాటా ఫౌండేషన్ దత్తత తీసుకుంది. వాటిని భారీ క్రెయిన్లు, లారీలతో వేరే చోటుకు తరలించింది. ఇప్పటి వరకూ 2,500కు పైగా వృక్షాలను వేరే చోటుకు తరలించింది. 2010 నుంచి హైదరాబాద్‌లో వాటా ఫౌండేషన్ చెట్ల దత్తత, తరలింపు సేవలను అందిస్తుంది. 10 మంది వలంటీర్లు ఉన్న ఈ ఫౌండేషన్ ఇప్పటివరకూ కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, గచి్చ»ౌలి, తెల్లాపూర్ వంటి నగరం నలువైపులా సుమారు 2,500 వృక్షాలను దత్తత తీసుకుంది. ఒక చోటు నుంచి వేరే చోటుకు చెట్టును తరలించేందుకు అవసరమైన జేసీబీ, క్రెయిన్, భారీ లారీ, కార్మికులు ఇతరత్రా ఖర్చులను చెట్లను దత్తత తీసుకునే వాళ్లు భరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు చెట్టును మాత్రమే నిర్వహణ చేస్తాం.. ఖర్చు భరించలేం అంటే క్రౌండ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చెట్టును తరలిస్తారు. చెట్టు రూట్ ప్యాకింగ్, కొమ్మలు కత్తిరించడం, జేసీబీ, క్రెయిన్, పెద్ద లారీ వంటి వాహనాల ఏర్పాటు తదితరాల కోసం ఒక్క చెట్టును తరలించేందుకు 3 వారాల సమయం పడుతుంది.సచివాలయంలోని చెట్లు ఫామ్‌హౌస్‌కు.. కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో అక్కడున్న వేప, సుబాబుల్, మర్రి, రావి, పెల్టోఫోరం, కొబ్బరు, కానుగ, గుల్మోహర్, రాయల్ ఫామ్, బాదం, చింత, నేరేడు వంటి చాలా చెట్లను కొట్టేశారు. వీటిలో వంద ఏళ్ల నాటి చెట్లను వేరే చోటుకు తరలించేందుకు వాటా ఫౌండేషన్ ముందుకొచ్చింది. 18 మర్రి చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ ఖర్చు మొత్తం ఆ ఫామ్‌హౌస్ యజమానే భరించారు. కూకట్‌పల్లిలో ఫోరం మాల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం సమయంలో అక్కడున్న వంద చెట్లను కొట్టేశారు. వీటిలో 70 వృక్షాలను మణికొండ స్మశానం, క్రికెట్ మైదానం చుట్టూ నాటారు.ఫామ్‌హౌస్, ఆఫీసుల్లో ఏర్పాటు.. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల ఇళ్లతో పాటు శామీర్‌పేట, చేవెళ్ల, గండిపేట, మహేశ్వరం, ఘట్కేసర్ వంటి నగరం నలువైపులా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఇంటీరియర్ కోసం ఈ పెద్ద చెట్లను వినియోగి స్తున్నారు. ప్రముఖ దర్శకులు తమ ఫామ్‌హౌస్‌లో 3 మర్రి, 25 రావి చెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రైవేట్ కంపెనీలు వారి కార్యాలయం చుట్టూ, ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఈ చెట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నీళ్లు పోస్తే సరిపోదు..వృక్షాలను ఎండాకాలంలో తరలించ కూడదు. రూట్ ప్యాకింగ్ చేసిన తర్వాత వేర్లు బలంగా, ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేస్తారు. చెట్టు కొమ్మలు కత్తిరించి, చెదలు పట్టకుండా పెస్టిసైడ్స్ పూస్తారు. భూమిలో నుంచి చెట్టను తీసిన తర్వాత గంట వ్యవధిలోపు తిరిగి నాటాలి. లేకపోతే మనుగడ సాగించలేవు. చెట్టును ట్రాన్స్‌లొకేట్ చేసిన తర్వాత రెండేళ్ల పాటు దాని బాగోగులు చూసుకోవాలి. కేవలం నీళ్లు పోయడంతోనే సరిపోదు. చాలా మంది చెట్టుకు ఆకులు రాగానే నీళ్లు పోయడం ఆపేస్తారు.అనుమతిలో జాప్యమెందుకు? రాత్రికి రాత్రే దొంగతనంగా చెట్లు కొట్టేస్తే అడిగేవాళ్లు ఉండరు. కానీ చెట్లు సేవ్ చేస్తామని ముందుకొచ్చే వారికి అనుమతి ఇచ్చేందుకు 2–3 నెలల సమయం తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. దీంతో స్థల యజమాని ఆగలేక చెట్లను కొట్టేసి రోడ్ల మీద పడేస్తున్నారు. నగరంలో చెట్ల సంరక్షణ కమిటీ ఉన్నా తూతూ మంత్రంగా పనిచేస్తోంది. – ఉదయ్ కృష్ణ, కో–¸ûండర్, వాటా ఫౌండేషన్ -
ఆ మర్రి వృక్షాలను కాపాడేందుకు రంగంలోకి నిపుణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కి.మీ. నిడివిలో ఉన్న 890 మర్రి చెట్ల (ఈ సంఖ్య విషయంలో భిన్న లెక్కలున్నాయి) భవితవ్యం తేల్చేందుకు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ వచ్చే త్వరలో పర్యావరణ ప్రభావ అంచనా (ఎని్వరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అధ్యయనం నిర్వహించబోతోంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణాది బెంచ్ ఈమేరకు ఇటీవల ఆదేశించటంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇటీవల నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధికారులతో ఓ సమావేశం నిర్వహించి ఈమేరకు చర్యలు ప్రారంభించింది. పక్షం రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, ఆ మర్రి చెట్ల పరిరక్షణకు సూచనలు చేయనుంది. గరిష్ట సంఖ్యలో వృక్షాలను కాపాడుతూ, రోడ్డు నిర్మాణంతో వాటికి అతి తక్కువ నష్టం వాటిల్లేలా ప్రత్యామ్నాయ చర్యలను ఈ అధ్యయనంలో నిర్ధారిస్తారు. ఎందుకీ అధ్యయనం.. కొత్తగా ఓ రోడ్డు నిర్మించేటప్పుడు అక్కడ చెట్లు తొలగించాల్సి ఉంటే ముందస్తు సమాచారంతో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని.. ఆ చెట్ల తొలగింపుతో ఎదురయ్యే పరిణామాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. చెట్లను తొలగంచటం వల్ల ఎదురయ్యే దు్రష్పభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలేంటో అధికారులు వివరిస్తారు. వృక్షాలకే కాకుండా అక్కడి జంతుజాలానికి కూడా నష్టం కాకుండా తీసుకునే చర్యలను వివరిస్తారు. కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించటం తప్పనిసరి. కానీ, అప్పటికే ఉన్న రోడ్డును విస్తరించే సందర్భంలో వంద కి.మీ.లోపు నిడివి ఉంటే ఈ తరహా సమావేశాలు కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా విస్తరణ పనులను ఆ విభాగం ఇప్పటికే చేపట్టింది. కానీ, నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్డు మీద ఉన్న మన్నెగూడ వరకు విస్తరణ పనులను ఎన్హెచ్ఏఐ చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మీద దాదాపు వందేళ్ల క్రితం నాటికి మర్రి వృక్షాలున్నాయి. గతంలో హైదరాబాద్ చుట్టూ అన్ని రోడ్ల మీద మర్రి వృక్షాలుండేవి. వాటి వయసు 80 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఉండేవి. కానీ రోడ్ల విస్తరణతో ఆ వృక్షాలు మటుమాయమయ్యాయి. నాటి వృక్షాలు ఉన్న ఏకైక రోడ్డు చేవెళ్ల హైవే మాత్రమే. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఆ వృక్షాలు కూడా మాయమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.ఏడాదిన్నర నుంచి వాదోపవాదాలు జరగ్గా, ఇటీవల ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ రోడ్డు విస్తరణలో కూడా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ అధ్యయనం అనివార్యం కావటంతో కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏం జరుగుతుంది.. గతంలో నగరంలో గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ఇలాంటి భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యావరణం పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డుమీద వేయికి చేరువలో మర్రి వృక్షాలున్నందున, వాటిని తొలగిస్తే పర్యావరణంతోపాటు పక్షిజాతిపై పెనుప్రభావం ఉంటుందన్న అంచనా ఉంది. కచ్చితంగా ఆ వృక్షాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వృక్షాలు ఎక్కువగా ఉన్న చోట పాత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కొత్త అలైన్మెంట్ చేయటం, మిగిలిన వాటిల్లో వీలైనంత సంఖ్యలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి చిగురింపచేయటం, కొన్నింటిని కొట్టేయక తప్పని స్థితి నెలకొంటే వాటికి నాలుగైదు రెట్ల సంఖ్యలో కొత్తగా మర్రి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలను ఆ అధ్యయనం ద్వారా సూచిస్తారు. పనుల్లో మరింత జాప్యం.. ఈ రోడ్డు విస్తరణకు 2019లో కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లు మంజూరు చేసింది. 60 మీటర్ల మేర విస్తరించి ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తారు. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాలున్న చోట విస్తరణ సాధ్యం కానందున, ఆ రెండు చోట్ల ప్రత్యామ్నాయంగా బైపాస్‌లు నిర్మించనున్న విషయం తెలిసిందే. అన్ని సర్వేలు, టెండర్ల ప్రక్రియ పూర్తయి రోడ్డు నిర్మాణానికి సిద్ధమైన తరుణంలో ఈ కేసు అడ్డుపడింది. దీంతో అప్పటి నుంచి పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కొత్త అధ్యయనం నేపథ్యంలో మరింత జాప్యం జరగనుంది. కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోడ్డు మీద ఉండాల్సిన ట్రాఫిక్ కంటే 48 శాతం వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఏడాదికి 250 వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, దాదాపు 45 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. వీలైనంత తొందరగా ఆ రహదారిని విస్తరించాల్సి ఉండగా, రకరకాల సమస్యలతో జాప్యం జరుగుతోంది. దాన్ని అలాగే ఉంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మించాలంటే ఖర్చు భారీగా పెరుగుతోందని యంత్రాంగం ఆందోళన చెందుతోంది. దీంతోపాటు అంత నిడివిలో కొత్త రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కూడా కష్టంగా మారుతుందని పేర్కొంటోంది. -
‘పండో’.. వంద ఎకరాల చెట్టు..
కొమ్మలకు ఊడలు వేస్తూ విస్తరించే భారీ మర్రి చెట్లు మనకు తెలుసు. నాలుగు ఎకరాల్లో విస్తరించిన పిల్లల మర్రిచెట్టు తెలుసు. కానీ వందకుపైగా ఎకరాల్లో, 47 వేలకుపైగా కాండాలతో విస్తరించి, వేల ఏళ్లుగా బతికేస్తున్న ఓ అతి పెద్ద చెట్టు ఉంది తెలుసా? సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. ఆ చెట్టు విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అది ఒక చెట్టు అడవి.. అమెరికా దక్షిణ ఉటా ప్రాంతంలో ఒకేచోట 47 వేలకుపైగా ఆస్పెన్ చెట్లు (పొడవుగా పెరిగే అశోకా చెట్ల వంటివి) పక్కపక్కనే ఉన్నాయి. వాటిపై ఇటీవల పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అవన్నీ ఒకే చెట్టు శాఖలని.. అన్నింటి వేర్లు పూర్తిగా అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. ఒక ప్రధాన చెట్టు వేర్లు భూమిలో విస్తరిస్తున్నకొద్దీ.. వాటి నుంచి కాండం ఉద్భవిస్తూ మరోచెట్టులా ఏర్పడినట్టు తేల్చారు. ఈ చెట్టును ‘పండో’ అని పిలుస్తున్నారు. లాటిన్ పదమైన దీనికి అర్థం ‘నేను విస్తరిస్తా’ అని అర్థం. అతి పెద్ద జీవి ఇదే.. ♦ మొత్తం 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న ఈ చెట్టు వయసు 9 వేల ఏళ్లకుపైగా ఉండవచ్చని, బరువు 6 వేల టన్నులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద బరువు, పరిమాణం పరంగా అతి పెద్ద జీవి ఇదేనని అంటున్నారు. ♦ ‘పండో’ చెట్టు వేలాది కాండాలకు ఉన్న ఆకులు కదిలిన శబ్దం.. వాటి వేళ్ల నెట్వర్క్ ద్వారా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా జెఫ్ రైస్ అనే సౌండ్ ఆర్టిస్ట్.. ఈ వేర్లపై దూరం దూరంగా పలుచోట్ల మైక్రోఫోన్లు, హైడ్రోఫోన్లు (నీటిలో, భూమిలోపల ధ్వనులను రికార్డు చేసేవి) అమర్చి శబ్దాలను రికార్డు చేశారు. ఎక్కడో ఒక ఆస్పెన్ కాండంపై మెల్లగా తడితే.. వందల అడుగుల దూరంలోని వేర్ల వద్ద ఆ ధ్వని వినిపిస్తున్నట్టు గుర్తించారు. ♦ ‘పండో’ చెట్టు, దాని చిత్రమైన వేర్ల వ్యవస్థపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. వేల ఏళ్ల కిందటి పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, మొక్కలు/చెట్ల మధ్య అనుసంధానం వంటి అంశాలను దీని నుంచి గుర్తించవచ్చని భావిస్తున్నారు. వేల ఏళ్ల నుంచి ‘సింగిల్’గా.. చిలీ దక్షిణ ప్రాంతంలోని అడవిలో ఉన్న అతి పురాతనమైన సైప్రస్ చెట్టు ఇది. ‘పండో’లా వేర్వేరు చెట్ల తరహాలో కాకుండా.. ఒకే కాండంతో, ఒకేసారి పుట్టి పెరిగిన చెట్లలో ఇదే అత్యంత ఎక్కువ వయసున్నది అని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీనికి ‘గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ అని పేరు పెట్టారు. ♦సుమారు 5,400 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్న ఈ సైప్రస్ చెట్టు ఎత్తు 91 అడుగులు, కాండం వెడల్పు 13 అడుగులు కావడం విశేషం. ♦ ఇన్ని వేల ఏళ్లుగా మారుతూ వచ్చిన వాతావరణాన్ని, కార్చిచ్చులను, ఫంగస్‌లను తట్టుకుని బతికిన ఈ చెట్టు కొన్నేళ్లుగా దెబ్బతింటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు. ♦దీనికన్నా ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసలే’ అనే పైన్ చెట్టు 4,853 ఏళ్ల వయసుతో.. భూమ్మీద అత్యంత ఎక్కువ వయసున్న చెట్టుగా రికార్డుల్లో నమోదైంది. -
ఒక మర్రితో మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో 760 మర్రి చెట్లకు గండం
అదో జాతీయ రహదారి.. రోడ్డుకు ఇరువైపులా 760 మర్రి వృక్షాలున్నాయి.. ఇప్పుడు రోడ్డు విస్తరణతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి.. వాటిని ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.. అయితే ఆ కసరత్తు తర్వాత వాటి సంఖ్య కనీసం మూడు వేలు కాబోతోంది. ఎలా అంటే.. అదో ఆసక్తికర ప్రయోగం. సఫలమైతే అద్భుతం. ఇందుకు వేదిక అవుతున్న రోడ్డు హైదరాబాద్ శివారులోని ‘అప్పా’జంక్షన్ నుంచి చేవెళ్ల మీదుగా కొనసాగుతున్న బీజాపూర్ హైవే. సాక్షి, హైదరాబాద్: పట్నం.. 3,4 దశాబ్దాల క్రితం వరకు హైదరాబాద్‌ను తెలంగాణ పల్లెలు పిలుచు కునేపేరు. ఈ నగరానికి దారితీసే ప్రధాన రహదారులన్నీ మర్రి చెట్లతో పందిరి వేసినట్టు కనిపించేవి. రాజీవ్ రహదారి, నిజామాబాద్ రోడ్డు, ఓల్డ్ బొంబాయి హైవే, బెంగళూరు రోడ్డు, విజయవాడ హైవే, సాగర్ రోడ్డు, చేవెళ్ల రహదారి.. ఇలా అన్ని రోడ్లూ ఇరువైపులా ఊడలు దిగిన మర్రి వృక్షాలతో అద్భుతంగా కనిపించేవి. దారి వెంట వెళ్లేవారికి చల్లని నీడనిచ్చేవి. కానీ అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ ఆ మర్రి చెట్ల అంతానికి కారణమైంది. ఒక్క చేవెళ్ల రోడ్డు తప్ప అన్ని ప్రధాన రహదారుల్లో ఆ మహా వృక్షాలు మాయమయ్యాయి. ఇప్పుడు ఆ చేవెళ్ల రోడ్డును కూడా విస్తరించేందుకు సిద్ధమవుతుండటంతో.. ఎన్హెచ్ఐఏ పరిధిలోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు 41 కి.మీ. పరిధిలో ఉన్న 760 మర్రి చెట్లు ప్రమా దంలో పడ్డాయి. అయితే ఆ చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేయకుండా, ట్రాన్స్‌లొకేట్ (పెకిలించి వేరే చోట నాటడం) చేయడం ద్వారా రక్షించాలని వృక్ష ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంస్థ ముందుకొచి్చ, వాటిని ట్రాన్స్‌లొకేట్ చేయటమే కాకుండా.. ఆ 760 చెట్లను దాదాపు ఐదు వేల వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. మర్రికి స్వతహాగా ఉండే లక్షణాన్ని ఇందుకోసం ఉపయోగించుకోనుంది. ఊడ చెప్పిన జాడ.. పిల్లల మర్రి.. మహబూబ్‌నగర్ పట్టణ శివారులో దాదాపు మూడెకరాల్లో విస్తరించిన మర్రి వనం. 500–750 ఏళ్ల వయసు దాని సొంతమని నిపుణులు అంటున్నారు. ఓ చెట్టు ఊడలు భూమిలో నాటుకుని మరో చెట్టుగా ఎదిగి.. అలా ఎకరాల్లో విస్తరించింది. కోల్‌కతాలోని ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్లో కూడా ఇంతే. దాదాపు 250 ఏళ్ల వయసున్న మర్రి.. పిల్లలుగా విస్తరించి ఓ చిన్నపాటి అడవిని తలపిస్తోంది. ఇది మర్రికి ఉన్న సహజసిద్ధ ప్రత్యేక లక్షణం. ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని ఒక చెట్టు నుంచి మరికొన్ని చెట్లను సృష్టించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘వటా ఫౌండేషన్’సిద్ధమవుతోంది. కొమ్మలే మరో చెట్టుగా.. మర్రిచెట్టు కొమ్మలు చాలా దూరం వరకు ఎదుగుతాయి. వాటికి ఊతంగా నేలకు దిగే ఊడలు మరో మొదలుగా మారతాయి. అలా విస్తరిస్తూ పోతాయి. ఇప్పుడు చేవెళ్ల రోడ్డుపై ఉన్న వృక్షాల్లో అలాంటి కొమ్మలను గుర్తించి వాటిని తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చోట పాతుతారు. ఆ కొమ్మ నుంచి వేర్లు ఎదిగేవరకు పోషణ చేపట్టి దాన్ని మరో చెట్టులా మారుస్తారు. అలా ఒక్కో చెట్టుకు ఉన్న అలాంటి కొమ్మల ఆధారంగా ఐదు నుంచి పదిపదిహేను వరకు విడదీస్తారు. ఇప్పటికే నేలను తాకి ఎదుగుతున్న ఊడలుంటే.. వాటిని కూడా తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చెట్టుగా పాతుతారు. ఆ ఆలోచన అప్పటిది.. రెండేళ్ల కింద గోవాలో వందేళ్ల వయసున్న మర్రి వృక్షం కూలిపోతే.. దాన్ని రక్షించాలంటూ స్థానికులు ఈ ఫౌండేషన్‌ను సంప్రదించారు. అక్కడికి వెళ్లిన దాని నిర్వాహకుడు ఉదయ్‌కృష్ణ.. దానికి వేళ్లూనుకున్న ఊడల కొమ్మలు గుర్తించి స్థానికుల సాయంతో జాగ్రత్తగా వేరు చేసి విడివిడిగా నాటితే అవి కొత్త చెట్లుగా ఎదగటం ప్రారంభించాయి. కొందరు స్థానికులు డ్రమ్ముల్లో మట్టి నింపి చిన్నచిన్న కొమ్మలను నాటి ఎదిగేలా చేశారు. అప్పటి నుంచే ఇలా ఒక చెట్టు నుంచి మరిన్ని చెట్లు సృష్టించొచ్చన్న ఆలోచన ఆ సంస్థలో ప్రారంభమైంది. గతేడాది సిరిసిల్లలో కూడా ఓ మర్రి వృక్షం పడిపోతే, దాన్ని ట్రాన్స్‌లొకేట్ చేసే క్రమంలో మూడు చోట్ల వేరువేరు కొమ్మలు నాటారు. అందులో రెండు వేళ్లూనుకున్నాయని ఉదయ్‌కృష్ణ తెలిపారు. ఈ క్రమంలోనే చేవెళ్ల రోడ్డులో ఉన్న చెట్లను వేల సంఖ్యలోకి మార్చే ప్రయోగానికి ఆయన సిద్ధమయ్యారు. చేవెళ్ల మర్రి రాష్ట్రం అంతటా.. ‘‘అప్పట్లో రోడ్లకిరువైపులా మర్రి చెట్లు ఉండే పద్ధతి కనుమరుగైంది. కానీ చేవెళ్ల రోడ్డుకు ఇంకా ఆ శోభ ఉంది. దాన్ని విస్తరించనుండటంతో అవి కూడా మాయం కానున్నాయి. కానీ అలా కానీయకూడదు. వాటిని కాపాడాలి. కొందరు ఔత్సాహికులు వాటి ట్రాన్స్‌లొకేషన్‌కు వీలుగా స్థలాన్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తల్లి చెట్టు నుంచి పిల్ల చెట్లను వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో నాటి ఆ వృక్ష సంపదను కాపాడాలన్నది ఆలోచన. చేవెళ్ల రోడ్డుపై వందల సంఖ్యలో ఉన్న మర్రిని వేల సంఖ్యలోకి మార్చి.. ఆ చెట్ల వరసకు గుర్తుగా రాష్ట్రమంతటా వాటిని నాటి పెంచాలన్నది ఆలోచన. భావితరాలకు ఇది గొప్ప కానుక అవుతుంది’’ – ఉదయ్‌కృష్ణ, వటా ఫౌండేషన్ నిర్వాహకులు చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్ -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
మర్రిచెట్టుకు మళ్లీ ప్రాణం
కోనరావుపేట(వేములవాడ): ఎండిన చెట్టుకు ప్రకృతి ప్రకాశ్ జీవం పోస్తే.. చిగురించిన మర్రిచెట్టును తరలించి పునరుజ్జీవం నింపారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల మర్రిచెట్టు వేళ్లతో సహా పడిపోయింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ చెట్టుకు మూడు నెలలు నీళ్లు పోయడంతో చిగురించింది. మర్రిచెట్టును తరలించేందుకు రూ.50 వేలకు పైగా అవసరం కావడంతో ప్రకాశ్ దాతల సహకారం కోరారు. విషయం తెలుసుకున్న సంతోష్‌కుమార్ చెట్టును తరలించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రెండు భారీ క్రేన్లను పంపించడంతో చిగురించిన మర్రిచెట్టును సుద్దాల నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ మర్రిచెట్టును సిరిసిల్ల కలెక్టరేట్లో నాటే పనులు కొనసాగుతున్నాయి. -
ఆ వృక్షానికి 24 గంటలు ఎందుకు కాపలా కాస్తున్నారో తెలుసా!!
న్యూఢిల్లీ: చిత్రంలో కనిపిస్తున్నది ఢిల్లీ ఆలిపూర్ సమీపంలోని ఖాంపూర్ గ్రామం వద్ద ఉన్న 120 ఏళ్ల మర్రి చెట్టు. దీన్ని ఈ ప్రాంత వాసులు పవిత్రంగా భావిస్తారు. ఇటీవలే కొందరు దుండగులు దీని కొమ్మలు నరికివేశారు. దీంతో ఇకపై ఈ వృక్షరాజానికి 24 గంటల పాటు వంతులవారీగా కాపలాకాయాలని ఖాంపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియా ఈ దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరతామన్నారు. ఘటనపై తమకు వివరాలందలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
1905లో నాటారు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా
వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రం వద్ద గల శతాబ్థాల చరిత్ర గల మర్రివృక్షం ఇప్పటికి చెక్కుచెదర కుండా ఉంది. ఈ వృక్షానికి ఇక చరిత్ర ఉంది. 1904 సంవత్సరంలో జెయంజే సంస్థకు చెందిన నలుగురు కన్యాస్త్రీలు వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వైద్యం చేస్తు వాటితో పాటు సామాజిక సేవలు చేసేవారు. అప్పటిలో వారు వైద్యశాలకు వచ్చే రోగులకు నీడ కోసం 1905 సంవత్సరంలో మే 1వ తేదీన వైద్యశాల ముందు మర్రి చెట్టు మొక్కలు రెండు నాటారు. అనంతరం వారు 1911 మే 11వ తేదీన వరకు వైద్యశాల్లో సేవలు అందించారు. అనంతరం సంస్థ కార్యకలాపాలు చీరాల మార్చడం జరిగింది. అప్పడు వారు నాటిన మర్రి మొక్కలే నేడు మహవృక్షాలుగా నేటికీ ఉన్నాయి. శతాబ్థాల చరిత్ర గల ఈ మర్రి వృక్షాలను కాపాడుకోవడం తోపాటు అవి చిరస్మరణీ యంగా నిలువాలని సంస్థ వాటికి రక్షణ కోడలు నిర్మించి రోగులు సేద తీరడానికి వృక్షాల చుట్టూ అరుగులు ఏర్పాటు చేశారు. 2019 సంవత్సరంలో సంస్థ ప్రతినిధులు బెంగుళూరు నుండి వేటపాలెం వచ్చి రూ.10 లక్షల ఖర్చుతో పార్కును ఏర్పాటు చేసి సుందరంగా అలకంరించారు. ఈ వృక్షాలు దశాబ్థాల చరిత్రను తెలియజేస్తున్నాయి. -
పిల్లలమర్రికి పునర్జన్మ!
సాక్షి, మహబూబ్‌నగర్: పిల్లలమర్రికి పునర్జన్మ! పిల్లలమర్రికి ప్రాణమొచ్చింది. ఏడాది క్రితం వరకు ఎండిన ఆకులు.. విరిగిపడ్డ ఊడలతో కళావిహీనంగా కనిపించిన 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ చెట్టు మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయిన పిల్లలమర్రి నేడు 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ చూడముచ్చటగా దర్శనమిస్తోంది. మరో ఏడాదిలోగా పూర్తి పూర్వస్థితికి తిరిగి రానుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల ఈ మర్రి చెట్టు.. శాఖోపశాఖలుగా 4 ఎకరాల్లో విస్తరించింది. కానీ నిర్వహణ లోపించడంతో పూర్తిగా ఎండిపోయిన రెండు ఊడలు, ఒక చెట్టు భాగం 2017 డిసెంబర్ 16న రాత్రి భారీ శబ్దంతో విరిగిపడ్డాయి. దీంతో అదే నెల 20న పిల్లలమర్రి ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసేశారు. మిగతా చెట్టు పరిరక్షణలో భాగంగా ఊడలు కిందికి పడకుండా వాటికి సహాయంగా రూ.3.80 లక్షలతో 36 పిల్లర్లు నిరి్మంచారు. చచ్చిపోతున్నన చెట్టును బతికించేందుకు సెలైన్ బాటిళ్లతో ప్రాణం పోసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక బాటిల్ నీళ్లలో 20 మి.లీ.ల క్లోరోపైరిపస్ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్ నీళ్లలో 5 మి.లీ. క్లోరోపైరిపస్ మందు ను కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్‌ఫాస్ఫేట్‌ను చల్లుతున్నారు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి చెట్లు.. ఊడలకు అందిం చారు. చెట్టు చుట్టుపక్కల 300 ట్రాక్టర్ల ఎర్రమట్టి పోయించారు. దీని పునరుజ్జీవం కోసం ఇప్పటి వరకు అధికారులు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. పిల్లలమర్రి ఆవరణలో పర్యాటకులు వెళ్లకుండా గేటు ఎదుట ఒకవైపు చెట్టును చూసుకుంటూ మరోవైపు దిగేలా ఏడాది క్రితం రూ.4 లక్షలతో కెనోపివాక్ బ్రిడ్జిను ఏర్పాటుచేశారు. దీంతో పిల్లలమర్రి పూర్వస్థితికి వస్తోంది. -
ప్రాణం తీసిన పెరుగుచెట్టు
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దశాబ్దాల కాలం చరిత్ర గల మర్రి చెట్టు (పెరుగుచెట్టు) గురువారం ఉదయం ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టు ఒక్కసారిగా నేలకి ఒరగడంతో అటుగా వెళ్లుతున్న ఓ మహిళ దాని కింద పడి దుర్మరణం పాలైంది. చెట్టు పడిపోయిందని తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తంచేశారు. ఎటువంటి గాలి, వాన లేకుండా చెట్టు నేలకొరగడంపై ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని పెరుగుచెట్టు సెంటర్ వద్ద ఓ మర్రిచెట్టు ఉంది. దశాబ్దాల కాలం నుంచి ఈ చెట్టు వద్ద పాలు, పెరుగు విక్రయిస్తున్నారు. దాంతో ఈ ప్రాంతానికి పెరుగుచెట్టు సెంటరుగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. ఈ చెట్టుకు స్థానికులు తరచూ పూజలు కూడా చేస్తుంటారు. గతంలో భారీ గాలివానలు వచ్చిన సందర్భాల్లో కూడా ఈ చెట్టు కొమ్మలు కూడా ఒరిగిన సందర్భాలు లేవని, గురువారం మాత్రం ఒక్కసారిగా నేలకూలిందని స్థాని కులు అంటున్నారు. చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న నగరపాలకసంస్థ కమిషనర్ ఎ.మోహనరావుతో పాటు ఏఈ రామారావు, పోలీసులు, ఫైర్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చెట్టును తొలగించి, మహిళ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ దుర్మరణం పెరుగుచెట్టు ఒక్కసారిగా నేలకు ఒరగడంతో అటుగా వెళుతున్న స్థానిక 9వ డివిజన్‌కు చెందిన మాణిక్యాల వెంకటరమణ(48)అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. చెట్టు మీద పడటంతో బయటకు వచ్చే మార్గం లేక ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. వెంకటరమణ తన కుటుంబసభ్యులతో కలిసి కాలువల వెంబడి పనికిరాని వస్తువులను సేకరించి విక్రయించుకుని జీవిస్తుంటారు. గురువారం ఉదయం కూడా తన కుమారులతో కలిసి చెట్టు కింద ప్రాంతంలో పనికిరాని వస్తువులను సేకరిస్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి తప్పిం చుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాపత్రికి తరలించారు. మృతురాలి భర్త సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వన్‌టౌన్ ఎస్సై నరహరశెట్టి రామకిషోర్‌బాబు తెలిపారు. పథకం ప్రకారమే జరిగిందా ? సుమారు 100 ఏళ్ల చరిత్ర గల మర్రిచెట్టు (పెరుగుచెట్టు) ఒక్కసారిగా నేలకు ఒరగడంపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చె ట్టుకు ఆనుకుని ఉన్న స్థలంలో భారీ వాణిజ్య భవనం నిర్మాణంలో ఉంది. చెట్టు కారణంగా సదరు భవనం కనిపించకుండా పోయిందనే ఉద్దేశంతో చెట్టు వేరులను కొద్దిరోజులుగా ధ్వంసం చేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలానే చెట్టు మొదల్లో కెమికల్ పోయడంతో దాని ప్రభావంతో ఒక్కసారిగా చెట్టు కూలినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పెరుగుచెట్టు కారణంగా తన భవనం ము సుకుపోయిందని చెట్టును తొలగించాలంటూ సద రు భవన నిర్మాణదారుడు అటవీశాఖ కార్యాలయంలో వినతి సమర్పించగా.. అధికారులు చె ట్టును తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఎలాగైనా చెట్టును తొలగించేందుకు భవన నిర్మాణదారుడు ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచా రణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
చిలుక సాయం
కోసల రాజ్యంలో నరేంద్రుడనే రైతు ఉండేవాడు. తనకు వాటాగా సంక్రమించిన కొద్దిపాటి పొలంలో ఆరుగాలం కష్టపడి పొట్టపోసుకునేవాడు. ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఉన్నంతలోనే అందరికీ సహాయం చేసేవాడు. అతనికి పశుపక్ష్యాదులంటే ఎనలేని ప్రేమ. అతని ఇల్లు ఎన్నో జంతువుల నిలయం. ఒక జంతు ప్రదర్శన శాలలా కనబడేది. తను పస్తులున్నా సరే, వాటికి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. పేదవాడైనా సరే, ఊరిలో అతడు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఒక రోజు ఎప్పటిలాగే నరేంద్రుడు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. పొలంలోని చెట్టుకింద, ఒక రామ చిలుక గాయాలతో కనిపించింది. అరే, చిలుకకు ఏమై ఉంటుంది. ఎగరడం లేదు, అనుకుంటూ దానిని చేతిలోకి తీసుకున్నాడు. కొన ఊపిరితో ఉంది. రెక్కలకు తీవ్ర గాయాలు కనిపించాయి. వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. తెలిసిన వైద్యం చేశాడు. రామ చిలుక, మెల్లగా కోలుకోసాగింది. ప్రతిరోజూ రామ చిలుకకు ఇష్టమైన పండ్లు తినిపించేవాడు. దాంతో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. నరేంద్రుడు, ఆ చిలుకతో రోజు ఎన్నో కబుర్లు చెప్పేవాడు. చిలుక సైతం, తన పలుకులతో స్పందించేది చిలుక భాష నరేంద్రుడికి, నరేంద్రుడి భాష చిలుకకు అర్థమయ్యేంత అవగాహన పెరిగింది.చిలుక పూర్తిగా కోలుకుంది. ఒకరోజు నరేంద్రునితో ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను మా అమ్మ, నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను, నీ వద్దకు తీరిక దొరికినప్పుడల్లా వచ్చిపోతాను సెలవిప్పించండి’’ అంది రామ చిలుక. ’సరే’, అన్నాడు బాధగా నరేంద్రుడు. ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది రామ చిలుక. నరేంద్రుడు చాలా మంచివాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది రామ చిలుక. దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాణి గారి అంతఃపురం చేరింది. రాణి గారి ముత్యాల హారాన్ని నోట కరుచుకొని, నరేంద్రుని ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.నరేంద్రుడు హారాన్ని చూశాడు. ఈ విలువైన హారం ఇక్కడికి ఎలా వచ్చింది, అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. పరిశీలించాడు.ఇది చాలా విలువైన ఆభరణంలా ఉంది. బహుశ రాజకుటుంబీకులకు చెందినది కావచ్చు అని అనుకొని దానిని భద్రంగా రాజ భవనానికి తీసుకెళ్ళాడు. రాజును దర్శించి, ‘‘ప్రభూ! నా ఇంటి ముందు ఈ ముత్యాల హారం పడి ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. మీకు అప్పగించాలని వచ్చాను’’ అని విన్నవించాడు. రాజు జాగ్రత్తగా పరిశీలించి, రాణి ధరించే ఆభరణంగా గుర్తించాడు.రాజు, నరేంద్రుని నిజాయతీని మెచ్చుకొని, అతడిని ఖజానా కాపలాదారుగా నియమించాడు. నరేంద్రుడు చాలా సంతోషించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు రామచిలుక అతని ఇంటికి వచ్చింది. నరేంద్రునితో, ‘‘ఒక బందిపోటు దొంగల ముఠా రాజు గారి ఖజానాపై కన్నేసింది. దానిపై దాడిచేసి ఖజానాను లూటీ చేయాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ముఠా అడవిలోని మర్రిచెట్టు కింద సమావేశమై ఎలా దాడి చేయాలనే దానిపై మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను నేను చెట్టు పై నుంచి విన్నాను’’ అని చెప్పింది.నరేంద్రుడు వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు సైనికులను అప్రమత్తం చేశాడు. దొంగల ముఠా దాడిని సులువుగా తిప్పికొట్టారు. ముఠాలోని దొంగలందరినీ బంధించి, రాజుగారి ముందు హాజరుపరచారు. నరేంద్రుని తెలివిని, తెగువను మెచ్చుకున్న రాజు అతనికి సైన్యంలో ఉన్నతోద్యోగం ఇచ్చాడు. మరికొన్ని నెలలు గడిచాయి మళ్ళీ రామచిలుక ఇంటికి వచ్చి నరేంద్రుడిని కలిసింది. ‘‘రాజు గారిని కూలదోయడానికి దాయాదులు కుట్ర పన్నుతున్నారు. నేను దాయాదుల మాటలు విన్నాను. రాజును మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పు’’ అని చెప్పి వెళ్ళింది.నరేంద్రుడు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు ముందుగా ఈ విషయాన్ని నమ్మలేదు. అయినప్పటికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.నమ్మకమైన అంగరక్షకులను నియమించుకున్నాడు. అనుకున్నట్టు గానే దాయాదులు రాజ మందిరంపై దాడి చేశారు. అయితే అంగరక్షకులు దాడిని తిప్పికొట్టారు. రాజు సురక్షితంగా బయటపడ్డారు.రాజు వెంటనే నరేంద్రుడిని రమ్మని కబురు పంపాడు. ‘‘నీకు రుణపడి ఉంటాను. నీ ముందస్తు సమాచారం వల్లనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నీ వంటి విధేయులు నాకు ఎంతో అవసరం. నా రాజ్యానికి మరింత అవసరం. నిన్ను సైన్యాధ్యక్షునిగా నియమిస్తున్నాను’’ అంటూ ఉత్తర్వులు జారీ చేశాడు.ఏడాది గడిచాక ఒక రోజు చిలుక మళ్ళీ వచ్చింది. నరేంద్రునితో ముచ్చటిస్తూ ‘‘ఒక ముఖ్యమైన వార్తను మోసుకు వచ్చాను. రాజ్యానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు రాజ్యం ఈ రాజ్యాన్ని కబళించాలని వ్యూహ రచన చేస్తోంది. నీవు నీ సైన్యంతో అప్రమత్తంగా ఉండు’’ అంటూ వారి సైనిక కదలికలను ఎప్పటికప్పుడు నరేంద్రునికి చేరవేసింది. యుద్ధంలో నరేంద్రుని సైన్యం, పొరుగు రాజు సేనలను చిత్తు చేసింది. నరేంద్రుని పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి. నరేంద్రుని శక్తియుక్తులపై రాజుకు పూర్తిగా నమ్మకం ఎర్పడింది.కొన్నాళ్లకు రాజు వ్యాధిగ్రస్తుడై మంచం పట్టాడు. వైద్యులు నయంగాని వ్యాధి అని చేతులెత్తేశారు. దీంతో రాజు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో చర్చించి, వారి ఆమోదంతో నరేంద్రుడిని రాజుగా ప్రకటించాడు. నరేంద్రుని పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రామచిలుకలు పూల మాలతో సన్మానించాయి. చిలుక సహాయానికి, ఆ పక్షిని రాజ్య పక్షిగా ప్రకటించాడు. తన రాజ్యంలోజంతు హింసను నిషేధించి, జనరంజకంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలను పొందసాగాడు. - పుల్లూరు జగదీశ్వరరావు -
అదిగదిగో..అదే పిల్లల మర్రి
మహబూబ్‌నగర్ : వందల ఏళ్ల క్రితం మొలకెత్తిన మొలక శాఖోపశాఖలుగా విస్తరించి మొదలు ఎక్కడ ఉం దో గుర్తు పట్టలేనంత మహా వృక్షంగా ఎదిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న మహా మర్రి వృక్షం(పిల్లలమర్రి) పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే, ఓ భారీ కొమ్మ గత ఏడాది డిసెంబర్ 16న విరిగిపడింది. దీంతో భారీ వృక్షం సంరక్షణకు ప్రత్యేక ట్రీట్మెంట్ ద్వారా చికిత్స ప్రారంభించిన అధికారులు.. మిగతా ఏ కొమ్మ కూడా విగరకుండా పిల్లర్లు నిర్మించారు. అయితే, సందర్శకులను లోనకు రానివ్వడం వల్ల చెట్టు కాండం, పిల్ల కొమ్మలపై రాతలు రాస్తూ, గుర్తులు పెడుతుండడంతోనే ఉనికికి ముప్పు వాటిల్లుతోం దని భావించి ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరినీ అనుమతించలేదు. కాగా, ట్రీట్మెంట్ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముండడంతో సందర్శకులకు నిరాశకు గురి చేయకుండా పిల్లలమర్రిని సందర్శించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రా రంభించారు. ఇందులో భాగంగా ప్రధాన ద్వారం వద్ద బయటి భాగంలో ’కెనోపివాక్’ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. తద్వారా ఈ బ్రిడ్జి పైనుంచి నడుస్తూ పిల్లలమర్రిని చూసే అవకాశం కలగనుంది. ప్రత్యేక ట్రీట్మెంట్ పిల్లలమర్రి చెట్టుకు సంబంధించిన ఓ ప్రధాన భారీ కొమ్మ గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన విరిగిపడడంతో పాటు మరికొన్ని కొమ్మలు విరిగే దశకు చేరుకున్నాయి. దీంతో అధికారులు స్పందించి ట్రీట్మెంట్ను ప్రారంభించారు. విరిగిన కొమ్మ వద్ద గోడ కట్టి ఎర్ర మట్టితో కప్పారు. చెట్టుకు పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలమర్రిలో పర్యాటకులకు అనుమతించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అప్పట్లో ఆదేశించారు. దీంతో డిసెంబర్ 20న పిల్లలమర్రి సందర్శనను నిలిపివేసి అటవీశాఖ ఆధ్వర్యాన ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అలాగే, కొమ్మలు విరుగుతున్న చోట సహాయంగా పిల్లర్లు నిర్మించారు. గతంలో సెలైన్లతో క్లోరోపైరిపస్ మందును చెట్టుకు అందించగా ప్రస్తుతం ప్రత్యేకంగా రూట్ ట్రైనర్ పైపుల్లో వర్మీ కంపోస్ట్, ఎర్ర మట్టి నింపి ఊడలకు సపోర్ట్‌గా ఏర్పాటు చేశారు. దాదాపు 45 పైపులు, 36 సిమెంట్ దిమ్మెలతో చెట్టు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చికిత్స ఫలితంగా ఇప్పుడిప్పుడే కొత్తగా ఊడలు వస్తున్నాయి. కెనోపివాక్ పైనుంచే అనుమతి గతంలో పిల్లలమర్రిలో పర్యాటకులు చెట్టు కొ మ్మలను చేతివేళ్లతో తాకడం, ఊడలపై కూర్చొవ డం వల్ల చెట్టు ఉనికికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఎదురైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చెట్టుకు పూర్వవైభవం వచ్చేవరకు ప్రత్యేకంగా కెనోపివాక్ బ్రిడ్జి ద్వారా పిల్లలమర్రిని పర్యాటకులు చూసే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలమర్రి గేటు బయట కెనోపివాక్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఎత్తైన రాడ్లపై ఒకసారి ఇద్దరు నడిచేలా బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తికానుండగా పర్యాటకులను అనుమతిస్తారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి పిల్లలమర్రి చెట్టుకు పూర్వవైభవం తీసుకురావడానికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెట్టుకు అందుతున్న ట్రీట్మెంట్ పనులను పరిశీలిస్తూ అధికారులకు తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. కా గా, త్వరలోనే పిల్లలమర్రి సందర్శనకు అనుమతి ఇవ్వనుండడంపై జిల్లా వాసులే కాకుండా పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
త్రిమూర్తి స్వరూపం – వట భూరుహం
దేవతావృక్షాలలో వట వృక్షం ఒకటి. వటవృక్షం అంటే మర్రిచెట్టు. మన జాతీయ వృక్షం. మర్రిచెట్టువేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. వటవృక్షం అంటే మర్రిచెట్టు. భారతీయుల జాతి వక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. సౌభాగ్యం కోసం, సంతానం కోసం మర్రిచెట్టును పూజించడం, ప్రదక్షిణలు చేయడం పరిపాటి. జ్యేష్ఠమాసంలో వటసావిత్రీ వ్రతం చేయడం ఆచారం. ఆయుర్వేదంలో మర్రిచెట్టుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. మర్రి నీడ కింద సేద తీరితే మనసుకు, శరీరానికి సాంత్వన కలుగుతుంది. గ్రహదోషాలను పోగొట్టడంలో కూడా మర్రి ప్రధాన పాత్రను పోషిస్తుంది. -
‘పిల్లలమర్రి’కి ఎంత కష్టం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద మర్రి చెట్టు ‘పిల్లలమర్రి’కి సెలైన్స్ ఎక్కిస్తున్నారు. చెట్లను తొలిచే పురుగుబారిన పడిన పిల్లలమర్రి భారీ కొమ్మలను కోల్పోయింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి పిల్లలమర్రి సందర్శనను నిలిపివేశారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పిల్లల మర్రిలోని ఒక భాగం పురుగు బారిన పడి కిందకు పడిపోయింది కూడా. ప్రమాదకరంగా పరిణమిస్తున్న పురుగును అంతం చేసేందుకు చెట్టు మొదలుకు ఎక్కించిన రసాయనం ప్రభావం చూపలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా పిల్లలమర్రికి సైలైన్ల ద్వారా కీటక సంహార మందును ఎక్కిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో గల పిల్లలమర్రి వయసు దాదాపు 700 ఏళ్లు. మర్రిచెట్టు ప్రతి రెండు మీటర్లకు ఒక సెలైన్‌ను అధికారులు ఎక్కిస్తున్నారు. దీంతో వందల కొద్దీ సెలైన్ బాటిళ్లు చెట్టుకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. కాగా, సైలెన్ల ద్వారా ఇస్తున్న చికిత్స ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. -
200 ఇయర్స్ ఇండస్'ట్రీ'
వజ్రపుకొత్తూరు: ఊడల మర్రి. ఈ పేరు వింటే విఠలాచార్య సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఉద్దానం రామకృష్ణాపురంలో ఓ వృక్షం రెండు వందల ఏళ్లుగా స్థా నికులకు నీడనిస్తోంది. ఈ మర్రి నీడన రామచండేశ్వరి అమ్మవారు కొలువై ఉండడంతో ఇక్కడ ప్రతి ఐదేళ్లకోమారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ చెట్టు కడ, మొదలు గుర్తు పట్టడం ఇప్పటి వరకు ఎవరి తరం కాలేదు. మర్రి ఊడలు శాఖోపశాఖ లుగా వ్యాపించడంతో కడేదో మొదలేదో తెలీదు. ప్రస్తుతం ఉన్న గ్రామం అప్పట్లో సముద్ర తీరా నికి 250 మీటర్లు తూర్పుగా ఉండేది. ఇసుక దిబ్బలు ఎత్తుగా వచ్చి పడడంతో 115 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా తీరానికి దూరంగా పల్లెను నిర్మించుకుని సమీపంలో ఉన్న రామచండేశ్వరి అమ్మవారుకు పూజలు చేసేవారు. అప్పటికే మర్రి చె ట్టుకు 100 ఏళ్లని తన తాతలు ముత్తాతలు చెప్పే వారని గ్రామ మాజీ సర్పంచ్ చింత జనార్దనరావు చెప్పారు. అప్పట్లో మర్రి చెట్లుకు మహిమలు ఉండేవని, ఎవరైనా పూజ కోసం మర్రి కొమ్మలు కోస్తే పాలుకు బదులు ఎర్రని ద్రవం కారేదని చెప్పారు. దీంతో అప్పటి నుంచి కొమ్మలు ఎవరూ కోయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నామని తెలిపారు. కార్తీక మాసంలో సందడి కార్తీక మాసంలో ఇక్కడ వన భోజనాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. దీంతో ఇక్కడ పరిసర గ్రామాల విద్యార్థులు, ఇతర గ్రామ పర్యాటకులు వచ్చి విడిదిచేస్తారు. అందులో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎక్కువగా ఉంటారని సర్పంచ్ చింత రజినీ నారాయణమూర్తి చెప్పారు. -
హోరుగాలికి కుప్పకూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మన్మర్రి గ్రామంలోని 400 ఏళ్లనాటి మర్రిచెట్టు శుక్రవారం సాయంత్రం పెనుగాలుల ఉధృతికి కుప్పకూలింది. గ్రామానికి అప్పట్లో ఈ మర్రి చెట్టు కారణంగానే మన్మర్రి అని పేరు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. గ్రామం నడిమధ్యలో ఎత్తుగా ఉండి ఊడలమర్రిని తలపించేది. పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించే ఈ చెట్టు ఒక్కసారిగా వీచిన పెనుగాలికి వేర్లతో సహా పడిపోయింది. దీంతో మర్రిచెట్టు కింద పార్క్ చేసిన రెండు బైకులు దెబ్బతిన్నాయి. -
చెట్టుకు విషమిచ్చి చంపారు!
చెన్నై: తమిళనాడులోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఇప్పుడు ఓ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వారి పోరాటం ఓ మర్రి చెట్టు గురించి. వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది. ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మామూలుగానైతే చెట్టు వయసైపోయిందని భావించేవారు గానీ.. దానితో అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించలేదు. దాన్ని కావాలనే విషమిచ్చి ఎండిపోయేలా చేశారని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు. ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ పార్క్‌కు ఎదురుగా ఉండటంతో.. అది అడ్డుగా ఉందని భావించి వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం -
గంటల గుడి
గంటలు... గంటలు... ఎటు చూస్తే అటు గంటలు... ఆలయాల్లో భక్తులు మోగించడానికి, హారతులిచ్చేటప్పుడు పూజారులు మోగించడానికి అవసరానికి తగిన గంటలు ఉండటం ఎక్కడైనా మామూలే. ఆ ఆలయంలో మాత్రం అడుగుపెట్టగానే గంటలే కనిపిస్తాయి. పరిసరాలను పరికిస్తే, నలువైపులా గంటల గుత్తులే దర్శనమిస్తాయి. పిడికిట్లో ఇమిడిపోయే పరిమాణంలోనివి కొన్ని... నలుగురి నెత్తికి నీడనిచ్చేంత భారీసైజులోనివి ఇంకొన్ని... యాభై గ్రాముల నుంచి యాభై కిలోల బరువు గల రకరకాల గంటలు చూపరులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి. ఇక్కడ కనిపించే ఒక్కొక్క గంటదీ ఒక్కొక్క కథ. ప్రతి గంటా ఒక తీరిన కోరికకు ప్రతిరూపం. ఎందుకంటే, కోరిన కోర్కెలు ఈడేరిన తర్వాత భక్తులు వేలాడదీసిన గంటలే ఇవన్నీ. దీని గురించి ఇక్కడి స్థానికులెవరినైనా ప్రశ్నిస్తే ‘మీరూ ఒక కోరిక కోరుకుని వెళ్లండి. మీ కోరిక నెరవేరిన వెంటనే ఎంత బరువైన గంటను కడతామని మొక్కుకుంటారో, అది తీసుకొచ్చి ఇక్కడి మర్రిచెట్టుకు వేలాడగట్టండి’ అని చెబుతారు. పరమేశ్వరుడు కొలువుదీరిన ఈ గంటల గుడి అసోం రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్కడ ఉంటాడీ గంటల దేవుడు? అసోం రాజధాని గువాహటికి 480 కిలోమీటర్ల దూరంలో, దిబ్రూగఢ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తీన్సుకియా పట్టణం. ఇక్కడి తిలింగ ఆలయమే గంటల గుడిగా పేరుపొందింది. ఆలయమంటే గోపురం, గోడలు వగైరాలేవీ ఉండవు. పురాతనమైన మర్రిచెట్టు కింద లింగాకారంలో స్వయంభువుగా వెలసిన శిలనే ఇక్కడ పూజిస్తారు. భక్తులు తలదాచుకోవడానికి వీలుగా చెట్టును ఆనుకునే ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ వెలసిన పరమశివుడు గంటల దేవుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. చుట్టూ తేయాకు తోటలు, నారింజ, నిమ్మ వంటి పండ్లతోటలతో నలువైపులా ఆకుపచ్చని పరిసరాల మధ్య వెలసిన తీన్‌సుకియాలో జనసమ్మర్దం పెద్దగా ఉండదు. గంటల దేవుడి సన్నిధానం వద్ద కూడా ఎలాంటి కోలాహలం కనిపించదు. మైకులు, లౌడ్‌స్పీకర్ల రొదలేని ఇక్కడి వాతావరణం గొప్ప ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి వాణిజ్య సముదాయాలూ, దుకాణాలు ఉండవు. అంతేకాదు, భక్తులను నిలువుదోపిడీ చేసే ఎలాంటి ప్రక్రియా ఇక్కడ కనిపించదు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తూనే ఉంటారు. కోరికలు ఈడేరిన వారు ఇక్కడి మర్రిచెట్టుకు గంటను వేలాడదీసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ఇదీ చరిత్ర పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటారు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొంగుబంగారమైన స్థలమహిమ మర్రిచెట్టు కింద లింగాకారంలో వెలసిన శిల నేల మీద కాకుండా చెట్టు వేళ్ల మీదే ఉన్నట్లు తేయాకు కార్మికులు గుర్తించారు. ఇదేదో మహిమ గలది కావచ్చని భావించారు. తమకు ఏ చిన్న కష్టం వచ్చినా, చెట్టు దగ్గరకు వచ్చి, ఆ రాతితో చెప్పుకొనేవారు. అలా చెప్పుకున్న తర్వాత కష్టాలన్నీ దూదిపింజల్లా తేలిపోవడాన్ని గమనించారు. లింగాకృతిలో ఉండటంతో దీనిని శివలింగంగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఏడాది పాటు గమనించాక, ఈ రాయికి, ఈ ప్రదేశానికి ఏదో మహిమ ఉందని నిర్ధారణకు వచ్చారు. విషయం ఆనోటా ఈనోటా పాకడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు జనాల రాక మొదలైంది. తన కష్టాలు తీరడంతో ఒక భక్తుడు ఈ చెట్టుకు ఇత్తడి గంటను వేలాడదీశాడు. అతడిని చూసి మరికొందరు కూడా తమ కోరికలు తీరగానే ఇలాగే గంటలు వేలాడదీయడం మొదలుపెట్టారు. ఇంకొందరు శివలింగం వద్ద త్రిశూలాలు నాటారు. మరికొందరు పావురాలను తెచ్చి వదలడం మొదలుపెట్టారు. జనాల రాక పెరుగుతూ ఉండటంతో స్థానికులే విరాళాలు పోగుచేసి, ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. సద్దు చేయని గంటలు ‘తిలింగా’ అంటే అస్సామీ భాషలో ‘గంట’ అని అర్థం. అందుకే స్థానికులు ఈ ఆలయాన్ని ‘తిలింగా మందిర్’ అంటారు. లక్షలాదిగా గంటలు వేలాడుతూ కనిపిస్తున్నా, ఇక్కడ ఎలాంటి రణగొణలూ వినిపించవు. ఇక్కడ గాలి తాకిడికి చెట్ల ఆకులు గలగలలాడే చప్పుడు తప్ప మరెలాంటి శబ్దమూ చెవిని సోకదు. విశాలంగా పరచుకున్న మర్రిచెట్లు కొమ్మలకు వేలాడే ఇత్తడి గంటలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటున్నట్లుగా కాకుండా, ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నట్లు కనిపించడం విశేషం. వెలుగులోకి... పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటా రు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇలా చేరుకోవచ్చు... ♦ సమీప విమానాశ్రయం దిబ్రూగఢ్‌లో ఉంది. దిబ్రూగఢ్ నుంచి తీన్సుకియాకు రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబైల నుంచి దిబ్రూగఢ్ వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి. ♦ జిల్లా కేంద్రమైన తీన్‌సుకియాలో రైల్వే స్టేషన్ ఉంది. బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్, రాజ్ధాని ట్రెయిన్లలో ఇక్కడకు చేరుకోవచ్చు. ♦ తీన్సుకియాకు అసోంలోని అన్ని వైపుల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ♦ అరుదైన వృక్ష జంతుజాతులు సమృద్ధిగా కలిగి ఉన్న తీన్సుకియా జిల్లాకు జీవవైవిధ్య కేంద్రంగా దిబ్రు సైఖోవా నేషనల్ పార్క్ మరో ప్రత్యేక ఆకర్షణ. గంగాప్రాంత డాల్ఫిన్, తెల్లరెక్కల బాతు, స్లో లోరిస్ ఏనుగులు.. వంటి ఎన్నో అంతరించిపోతున్న జంతువులకు ఈ ప్రాంతం నిలయం. మారుత నందన్ కానన్ పార్క్ తిన్సుకియాలోని ప్రసిద్ధ వినోద ఉద్యానవనం. -
మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...
హ్యూమర్ ప్లస్ మా ఊళ్లో ఒకాయనుండేవాడు. పనేమీ చేసేవాడు కాదు. మూడు పూట్లా తిని ఆరు పూట్ల నిద్రపోయేవాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేవాడు. ఒక్కసారి నిద్రపోతూ కూడా మాట్లాడేవాడు. మర్రిచెట్టు కింద కూచుని వచ్చీపోయే వాళ్లకి తత్వబోధ చేసేవాడు. విన్నవాళ్లకి బుర్ర తిరిగిపోయేది. వినకపోతే కర్రతో బుర్రపై ఒకటిచ్చేవాడు. విన్నా వినకపోయినా జ్ఞాన బాధే.బాధలతోనే ఈ ప్రపంచం పుట్టిందని, బాధలతోనే అంతరిస్తుందని ఆయన సిద్ధాంతం. ఈయనతో బాధలు పడిపడి ఆయన భార్యకు ఒకరోజు పిచ్చెక్కింది. ఆమె మలయాళంలో బూతులు తిడుతూ దొరికినవన్నీ దొరికినట్టు ఉతకసాగింది. మనుషులకే బస్సులు లేక సర్వీస్ ఆటోలకు వేలాడుతున్న కాలంలో ఒక దెయ్యం రెండు రాష్ట్రాలు దాటి మా ఊరికొచ్చి ఈమెను పట్టుకోవడంలో ఆంతర్యమేమిటో చెట్టుకింద పండితులకి ఎవరికీ అర్థం కాలేదు. మనుషులు తమ బాధల్ని తీర్చుకోవటానికి ఇతరుల్ని బాధించినట్టు దెయ్యాలు కూడా బాధావిముక్తి కోసం ఇలాంటి క్రియాశీలక చర్యలకు దిగుతుంటాయని ఆమె భర్త వాదించాడు. ఈ మాట అన్న మరుక్షణం ఆ దెయ్యపు భార్య దుడ్డుకర్రని గిరగిర తిప్పి భర్త మోకాళ్లకు గురిచూసి కొట్టి మలయాళాన్ని ఎత్తుకుంది. ఇంతకూ ఆమె మాట్లాడుతున్నది మలయాళమో కాదో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో ఎవరికీ మలయాళం రాదు, వినలేదు. తెలుసుకోవాలనే కోరికుండాలే కానీ, దానికి దారులు అనేకముంటాయి. తాడిపత్రి బస్టాండులో టీ అమ్ముకునే నాయరుని ప్రవేశపెట్టారు. వాడు రావడం రావడమే టీ కెటిల్‌తో వచ్చి అందరికీ టీ అందించి, డబ్బులు వసూలు చేశాడు. డబ్బు వల్ల జ్ఞానమూ, జ్ఞానం వల్ల అజ్ఞానం సంభవిస్తాయని దెయ్యపు భర్త కొత్త సిద్ధాంతాన్ని ఎత్తుకున్నాడు. భర్త గొంతు వినగానే మలయాళ దెయ్యం విజృంభించింది. అనేకమంది కకావికలై పారిపోగా, కొంతమంది ధైర్యవంతులు ఆమెని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ముందస్తు చర్యగా దెయ్యపు భర్త దుడ్డుకర్రకి అందకుండా చెట్టెక్కాడు. ఆమె ఉగ్రరూపం చూసి నాయరు తాడిపత్రి వైపుకి తిరిగి పిక్కబలం కొద్దీ పారిపోసాగాడు. ఈ హడావుడిలో టీ కెటిల్ కూడా మరిచిపోయాడు. ఎలాగోలా వాడిని వెనక్కి లాక్కొచ్చారు. ఆమె మాట్లాడింది మలయాళమే కానీ, తనకేమీ అర్థం కాలేదని నాయర్ చెప్పాడు. నిరూపితం కానప్పుడు ఏ భాషకీ శాస్త్రీయత ఉండదని చెట్టుపైన ఉన్న భర్త వాదించడానికి ప్రయత్నించాడు కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇలా కాదని టవున్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చారు. రోగితోనూ రోగంతోనూ నిమిత్తం లేకుండా ఆయన ప్రతివాడికి మూడు ఇంజెక్షన్లు వేస్తాడు. ఒకవేళ రోగాన్ని ఆయన పసిగడితే ఇంజక్షన్ల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి పొరపాటున రోగితో పాటు వెళ్లిన సహాయకునికి కూడా మూడు సూది పోట్లు పొడిచాడు. వాడు కళ్లు తిరిగి పడిపోతే వాడి కులపోళ్లు వచ్చి ధర్నా చేశారు. చేతి చమురు వదిలించుకున్న పరిజ్ఞానంతో అప్పటినుంచి మనిషి ముఖకవళికల ఆధారంగా సూదిమొనను సవరిస్తాడు. దెయ్యపు స్త్రీ దగ్గరకెళ్లి నాడిని చూశాడు. గుండె శబ్దాన్ని విన్నాడు. ఎప్పటిలాగే సూది వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో డాక్టర్‌కి తెలియదు. కళ్లు తెరిచేసరికి తన ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా మా పెద్దమ్మ సీన్లోకొచ్చింది. ఆమె రిటైర్డ్ టీచర్. దెయ్యపు స్త్రీ దగ్గరికెళ్లి ఆప్యాయంగా అదుముకుంది. భర్తని చెట్టు దింపి చెంప పగలగొట్టింది. ‘‘నువ్వు వాగడమే కానీ, దాన్ని ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడనిచ్చావా? చివరికి తిట్టడానికి కూడా భాష మరిచిపోయింది. ఇప్పటికైనా నోర్మూసుకుని ఉంటే ఉంటావు, లేదంటే పోతావు’’ అని వెళ్లిపోయింది. కాలం ఎవడి అదుపాజ్ఞల్లో ఉండదు. మారుతూ ఉంటుంది. మా ఊళ్లో ఆడవాళ్లు ఇప్పుడు ఎంతలా మారారంటే మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా. - జి.ఆర్.మహర్షి