కొమ్మలకు ఊడలు వేస్తూ విస్తరించే భారీ మర్రి చెట్లు మనకు తెలుసు. నాలుగు ఎకరాల్లో విస్తరించిన పిల్లల మర్రిచెట్టు తెలుసు. కానీ వందకుపైగా ఎకరాల్లో, 47 వేలకుపైగా కాండాలతో విస్తరించి, వేల ఏళ్లుగా బతికేస్తున్న ఓ అతి పెద్ద చెట్టు ఉంది తెలుసా? సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. ఆ చెట్టు విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్
అది ఒక చెట్టు అడవి..
అమెరికా దక్షిణ ఉటా ప్రాంతంలో ఒకేచోట 47 వేలకుపైగా ఆస్పెన్ చెట్లు (పొడవుగా పెరిగే అశోకా చెట్ల వంటివి) పక్కపక్కనే ఉన్నాయి. వాటిపై ఇటీవల పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అవన్నీ ఒకే చెట్టు శాఖలని.. అన్నింటి వేర్లు పూర్తిగా అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. ఒక ప్రధాన చెట్టు వేర్లు భూమిలో విస్తరిస్తున్నకొద్దీ.. వాటి నుంచి కాండం ఉద్భవిస్తూ మరోచెట్టులా ఏర్పడినట్టు తేల్చారు. ఈ చెట్టును ‘పండో’ అని పిలుస్తున్నారు. లాటిన్ పదమైన దీనికి అర్థం ‘నేను విస్తరిస్తా’ అని అర్థం.
అతి పెద్ద జీవి ఇదే..
♦ మొత్తం 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న ఈ చెట్టు వయసు 9 వేల ఏళ్లకుపైగా ఉండవచ్చని, బరువు 6 వేల టన్నులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద బరువు, పరిమాణం పరంగా అతి పెద్ద జీవి ఇదేనని అంటున్నారు.
♦ ‘పండో’ చెట్టు వేలాది కాండాలకు ఉన్న ఆకులు కదిలిన శబ్దం.. వాటి వేళ్ల నెట్‌వర్క్ ద్వారా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా జెఫ్ రైస్ అనే సౌండ్ ఆర్టిస్ట్.. ఈ వేర్లపై దూరం దూరంగా పలుచోట్ల మైక్రోఫోన్లు, హైడ్రోఫోన్లు (నీటిలో, భూమిలోపల ధ్వనులను రికార్డు చేసేవి) అమర్చి శబ్దాలను రికార్డు చేశారు. ఎక్కడో ఒక ఆస్పెన్ కాండంపై మెల్లగా తడితే.. వందల అడుగుల దూరంలోని వేర్ల వద్ద ఆ ధ్వని వినిపిస్తున్నట్టు గుర్తించారు.
♦ ‘పండో’ చెట్టు, దాని చిత్రమైన వేర్ల వ్యవస్థపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. వేల ఏళ్ల కిందటి పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, మొక్కలు/చెట్ల మధ్య అనుసంధానం వంటి అంశాలను దీని నుంచి గుర్తించవచ్చని భావిస్తున్నారు.
వేల ఏళ్ల నుంచి ‘సింగిల్’గా..
చిలీ దక్షిణ ప్రాంతంలోని అడవిలో ఉన్న అతి పురాతనమైన సైప్రస్ చెట్టు ఇది. ‘పండో’లా వేర్వేరు చెట్ల తరహాలో కాకుండా.. ఒకే కాండంతో, ఒకేసారి పుట్టి పెరిగిన చెట్లలో ఇదే అత్యంత ఎక్కువ వయసున్నది అని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీనికి ‘గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ అని పేరు పెట్టారు.
♦సుమారు 5,400 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్న ఈ సైప్రస్ చెట్టు ఎత్తు 91 అడుగులు, కాండం వెడల్పు 13 అడుగులు కావడం విశేషం.
♦ ఇన్ని వేల ఏళ్లుగా మారుతూ వచ్చిన వాతావరణాన్ని, కార్చిచ్చులను, ఫంగస్‌లను తట్టుకుని బతికిన ఈ చెట్టు కొన్నేళ్లుగా దెబ్బతింటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు.
♦దీనికన్నా ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసలే’ అనే పైన్ చెట్టు 4,853 ఏళ్ల వయసుతో.. భూమ్మీద అత్యంత ఎక్కువ వయసున్న చెట్టుగా రికార్డుల్లో నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment