గంటల గుడి | bells temple special story on summer tour | Sakshi
Sakshi News home page

గంటల గుడి

Published Wed, Mar 30 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

గంటల గుడి

గంటల గుడి

గంటలు... గంటలు... ఎటు చూస్తే అటు గంటలు... ఆలయాల్లో భక్తులు మోగించడానికి, హారతులిచ్చేటప్పుడు పూజారులు మోగించడానికి అవసరానికి తగిన గంటలు ఉండటం ఎక్కడైనా మామూలే. ఆ ఆలయంలో మాత్రం అడుగుపెట్టగానే గంటలే కనిపిస్తాయి. పరిసరాలను పరికిస్తే, నలువైపులా గంటల గుత్తులే దర్శనమిస్తాయి. పిడికిట్లో ఇమిడిపోయే పరిమాణంలోనివి కొన్ని... నలుగురి నెత్తికి నీడనిచ్చేంత భారీసైజులోనివి ఇంకొన్ని... యాభై గ్రాముల నుంచి యాభై కిలోల బరువు గల రకరకాల గంటలు చూపరులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి.

ఇక్కడ కనిపించే ఒక్కొక్క గంటదీ ఒక్కొక్క కథ. ప్రతి గంటా ఒక తీరిన కోరికకు ప్రతిరూపం. ఎందుకంటే, కోరిన కోర్కెలు ఈడేరిన తర్వాత భక్తులు వేలాడదీసిన గంటలే ఇవన్నీ. దీని గురించి ఇక్కడి స్థానికులెవరినైనా ప్రశ్నిస్తే ‘మీరూ ఒక కోరిక కోరుకుని వెళ్లండి. మీ కోరిక నెరవేరిన వెంటనే ఎంత బరువైన గంటను కడతామని మొక్కుకుంటారో, అది తీసుకొచ్చి ఇక్కడి మర్రిచెట్టుకు వేలాడగట్టండి’ అని చెబుతారు. పరమేశ్వరుడు కొలువుదీరిన ఈ గంటల గుడి అసోం రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఎక్కడ ఉంటాడీ గంటల దేవుడు?

అసోం రాజధాని గువాహటికి 480 కిలోమీటర్ల దూరంలో, దిబ్రూగఢ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తీన్‌సుకియా పట్టణం. ఇక్కడి తిలింగ ఆలయమే గంటల గుడిగా పేరుపొందింది. ఆలయమంటే గోపురం, గోడలు వగైరాలేవీ ఉండవు. పురాతనమైన మర్రిచెట్టు కింద లింగాకారంలో స్వయంభువుగా వెలసిన శిలనే ఇక్కడ పూజిస్తారు. భక్తులు తలదాచుకోవడానికి వీలుగా చెట్టును ఆనుకునే ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ వెలసిన పరమశివుడు గంటల దేవుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. చుట్టూ తేయాకు తోటలు, నారింజ, నిమ్మ వంటి పండ్లతోటలతో నలువైపులా ఆకుపచ్చని పరిసరాల మధ్య వెలసిన తీన్‌సుకియాలో జనసమ్మర్దం పెద్దగా ఉండదు. గంటల దేవుడి సన్నిధానం వద్ద కూడా ఎలాంటి కోలాహలం కనిపించదు. మైకులు, లౌడ్‌స్పీకర్ల రొదలేని ఇక్కడి వాతావరణం గొప్ప ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి వాణిజ్య సముదాయాలూ, దుకాణాలు ఉండవు. అంతేకాదు, భక్తులను నిలువుదోపిడీ చేసే ఎలాంటి ప్రక్రియా ఇక్కడ కనిపించదు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తూనే ఉంటారు. కోరికలు ఈడేరిన వారు ఇక్కడి మర్రిచెట్టుకు గంటను వేలాడదీసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు.

 ఇదీ చరిత్ర
పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్‌కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటారు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది.

 కొంగుబంగారమైన స్థలమహిమ
మర్రిచెట్టు కింద లింగాకారంలో వెలసిన శిల నేల మీద కాకుండా చెట్టు వేళ్ల మీదే ఉన్నట్లు తేయాకు కార్మికులు గుర్తించారు. ఇదేదో మహిమ గలది కావచ్చని భావించారు. తమకు ఏ చిన్న కష్టం వచ్చినా, చెట్టు దగ్గరకు వచ్చి, ఆ రాతితో చెప్పుకొనేవారు. అలా చెప్పుకున్న తర్వాత కష్టాలన్నీ దూదిపింజల్లా తేలిపోవడాన్ని గమనించారు. లింగాకృతిలో ఉండటంతో దీనిని శివలింగంగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఏడాది పాటు గమనించాక, ఈ రాయికి, ఈ ప్రదేశానికి ఏదో మహిమ ఉందని నిర్ధారణకు వచ్చారు. విషయం ఆనోటా ఈనోటా పాకడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు జనాల రాక మొదలైంది. తన కష్టాలు తీరడంతో ఒక భక్తుడు ఈ చెట్టుకు ఇత్తడి గంటను వేలాడదీశాడు. అతడిని చూసి మరికొందరు కూడా తమ కోరికలు తీరగానే ఇలాగే గంటలు వేలాడదీయడం మొదలుపెట్టారు. ఇంకొందరు శివలింగం వద్ద త్రిశూలాలు నాటారు. మరికొందరు పావురాలను తెచ్చి వదలడం మొదలుపెట్టారు. జనాల రాక పెరుగుతూ ఉండటంతో స్థానికులే విరాళాలు పోగుచేసి, ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు.

 సద్దు చేయని గంటలు
‘తిలింగా’ అంటే అస్సామీ భాషలో ‘గంట’ అని అర్థం. అందుకే స్థానికులు ఈ ఆలయాన్ని ‘తిలింగా మందిర్’ అంటారు. లక్షలాదిగా గంటలు వేలాడుతూ కనిపిస్తున్నా, ఇక్కడ ఎలాంటి రణగొణలూ వినిపించవు. ఇక్కడ గాలి తాకిడికి చెట్ల ఆకులు గలగలలాడే చప్పుడు తప్ప మరెలాంటి శబ్దమూ చెవిని సోకదు. విశాలంగా పరచుకున్న మర్రిచెట్లు కొమ్మలకు వేలాడే ఇత్తడి గంటలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటున్నట్లుగా కాకుండా, ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నట్లు కనిపించడం విశేషం.

వెలుగులోకి...
పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్‌కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటా రు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఇలా చేరుకోవచ్చు...
సమీప విమానాశ్రయం దిబ్రూగఢ్‌లో ఉంది. దిబ్రూగఢ్ నుంచి తీన్‌సుకియాకు రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబైల నుంచి దిబ్రూగఢ్ వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి.

♦  జిల్లా కేంద్రమైన తీన్‌సుకియాలో రైల్వే స్టేషన్ ఉంది. బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్, రాజ్‌ధాని ట్రెయిన్లలో ఇక్కడకు చేరుకోవచ్చు.

తీన్‌సుకియాకు అసోంలోని అన్ని వైపుల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

అరుదైన వృక్ష జంతుజాతులు సమృద్ధిగా కలిగి ఉన్న తీన్‌సుకియా జిల్లాకు జీవవైవిధ్య కేంద్రంగా దిబ్రు సైఖోవా నేషనల్ పార్క్ మరో ప్రత్యేక ఆకర్షణ. గంగాప్రాంత డాల్ఫిన్, తెల్లరెక్కల బాతు, స్లో లోరిస్ ఏనుగులు.. వంటి ఎన్నో అంతరించిపోతున్న జంతువులకు ఈ ప్రాంతం నిలయం. మారుత నందన్ కానన్ పార్క్ తిన్‌సుకియాలోని ప్రసిద్ధ వినోద ఉద్యానవనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement