ఆపరేషన్‌.. ట్రాన్స్‌ ప్లాంటేషన్‌.. | Banyan Tree Transplantation in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌.. ట్రాన్స్‌ ప్లాంటేషన్‌..

Published Mon, Oct 14 2024 1:08 PM | Last Updated on Mon, Oct 14 2024 1:08 PM

Banyan Tree Transplantation in Hyderabad

ఇప్పటి వరకూ 2,500కు పైగా వృక్షాల తరలింపు 

భవన నిర్మాణాలు, రోడ్ల విస్తరణలో అడ్డుగా చెట్లు 

నరికి వేసే బదులుగా వేరే చోటుకు తరలింపు 

మర్రి, వేప, రావి వంటి వందల ఏళ్ల నాటి వృక్షాలే ఎక్కువ 

స్కూల్స్, ఆఫీసులు, ఫామ్‌హౌస్‌లలో వీటి ఏర్పాటు 

చెట్ల సంరక్షణకు నడుంబిగించిన వాటా ఫౌండేషన్‌

‘శ్రీశైలం రహదారిలో ఓ స్థల యజమాని తన ప్లాట్‌లో అడ్డుగా ఉన్న రెండు మర్రి చెట్లను కొట్టేసి రోడ్డు పక్కన నిర్జీవంగా పడేశాడు. ఇది చూసిన వృక్ష ప్రేమికులు వందేళ్ల వయసు ఉన్న ఈ చెట్లను కాపాడుకోవాలని భావించారు. మరి, అంత పెద్ద చెట్లు తరలించాలంటే భారీ క్రెయిన్, పెద్ద లారీ, కారి్మకులు అవసరం. వీటి ఖర్చు కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న నాల్గో తరగతి అమ్మాయి స్పందించింది. చెట్లు తరలించేందుకు అయ్యే ఆర్థిక సహాయాన్ని అందించింది. అంతే ఈ చెట్లను అక్కడి నుంచి మణికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ చెట్టు స్కూల్‌ విద్యార్థులకు నీడనిస్తూ హాయిగా ఉంది.’ 

‘ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలో భారీ వర్షానికి చీమ చింతకాయ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టును ఎలాగైనా కాపాడాలని ప్రిన్సిపాల్‌ భావించారు. భారీ క్రెయిన్‌ సహాయంతో 300 మంది స్కూల్‌ విద్యార్థులు చూస్తుండగా ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. ఇక అక్కడి నుంచి ప్రతి ఏటా జులై 23న స్కూల్‌ విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టుకు రాఖీ కడుతూ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.’ ఇలా ఒకటీ రెండూ కాదు కొత్త సచివాలయం, కూకట్‌పల్లిలో ఫోరం మాల్‌ బ్రిడ్జి నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న వందలాది వృక్షాలను వాటా ఫౌండేషన్‌ దత్తత తీసుకుంది. వాటిని భారీ క్రెయిన్లు, లారీలతో వేరే చోటుకు తరలించింది. ఇప్పటి వరకూ 2,500కు పైగా వృక్షాలను వేరే చోటుకు తరలించింది. 

2010 నుంచి హైదరాబాద్‌లో వాటా ఫౌండేషన్‌ చెట్ల దత్తత, తరలింపు సేవలను అందిస్తుంది. 10 మంది వలంటీర్లు ఉన్న ఈ ఫౌండేషన్‌ ఇప్పటివరకూ కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, గచి్చ»ౌలి, తెల్లాపూర్‌ వంటి నగరం నలువైపులా సుమారు 2,500 వృక్షాలను దత్తత తీసుకుంది. ఒక చోటు నుంచి వేరే చోటుకు చెట్టును తరలించేందుకు అవసరమైన జేసీబీ, క్రెయిన్, భారీ లారీ, కార్మికులు ఇతరత్రా ఖర్చులను చెట్లను దత్తత తీసుకునే వాళ్లు భరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు చెట్టును మాత్రమే నిర్వహణ చేస్తాం.. ఖర్చు భరించలేం అంటే 
క్రౌండ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించి చెట్టును తరలిస్తారు. చెట్టు రూట్‌ ప్యాకింగ్, కొమ్మలు కత్తిరించడం, జేసీబీ, క్రెయిన్, పెద్ద 
లారీ వంటి వాహనాల ఏర్పాటు తదితరాల కోసం ఒక్క చెట్టును తరలించేందుకు 3 వారాల సమయం పడుతుంది.

సచివాలయంలోని చెట్లు ఫామ్‌హౌస్‌కు.. 
కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో అక్కడున్న వేప, సుబాబుల్, మర్రి, రావి, పెల్టోఫోరం, కొబ్బరు, కానుగ, గుల్మోహర్, రాయల్‌ ఫామ్, బాదం, చింత, నేరేడు వంటి చాలా చెట్లను కొట్టేశారు. వీటిలో వంద ఏళ్ల నాటి చెట్లను వేరే చోటుకు తరలించేందుకు వాటా ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. 18 మర్రి చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ ఖర్చు మొత్తం ఆ ఫామ్‌హౌస్‌ యజమానే భరించారు. కూకట్‌పల్లిలో ఫోరం మాల్‌ దగ్గర బ్రిడ్జి నిర్మాణం సమయంలో అక్కడున్న వంద చెట్లను కొట్టేశారు. వీటిలో 70 వృక్షాలను మణికొండ స్మశానం, క్రికెట్‌ మైదానం చుట్టూ నాటారు.

ఫామ్‌హౌస్, ఆఫీసుల్లో ఏర్పాటు.. 
రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల ఇళ్లతో పాటు శామీర్‌పేట, చేవెళ్ల, గండిపేట, మహేశ్వరం, ఘట్‌కేసర్‌ వంటి నగరం నలువైపులా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఇంటీరియర్‌ కోసం ఈ పెద్ద చెట్లను వినియోగి స్తున్నారు. ప్రముఖ దర్శకులు తమ ఫామ్‌హౌస్‌లో 3 మర్రి, 25 రావి చెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రైవేట్‌ కంపెనీలు వారి కార్యాలయం చుట్టూ, ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఈ చెట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.  

నీళ్లు పోస్తే సరిపోదు..
వృక్షాలను ఎండాకాలంలో తరలించ   కూడదు. రూట్‌ ప్యాకింగ్‌ చేసిన తర్వాత వేర్లు బలంగా, ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేస్తారు. చెట్టు కొమ్మలు కత్తిరించి, చెదలు పట్టకుండా పెస్టిసైడ్స్‌ పూస్తారు. భూమిలో నుంచి చెట్టను తీసిన తర్వాత గంట వ్యవధిలోపు తిరిగి నాటాలి. లేకపోతే మనుగడ సాగించలేవు. చెట్టును ట్రాన్స్‌లొకేట్‌ చేసిన తర్వాత రెండేళ్ల పాటు దాని బాగోగులు చూసుకోవాలి. కేవలం నీళ్లు పోయడంతోనే సరిపోదు. చాలా మంది చెట్టుకు ఆకులు రాగానే నీళ్లు పోయడం ఆపేస్తారు.

అనుమతిలో జాప్యమెందుకు? 
రాత్రికి రాత్రే దొంగతనంగా చెట్లు కొట్టేస్తే అడిగేవాళ్లు ఉండరు. కానీ చెట్లు సేవ్‌ చేస్తామని ముందుకొచ్చే వారికి అనుమతి ఇచ్చేందుకు 2–3 నెలల సమయం తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. దీంతో స్థల యజమాని ఆగలేక చెట్లను కొట్టేసి రోడ్ల మీద పడేస్తున్నారు. నగరంలో చెట్ల సంరక్షణ కమిటీ ఉన్నా తూతూ మంత్రంగా పనిచేస్తోంది. – ఉదయ్‌ కృష్ణ, కో–¸ûండర్, వాటా ఫౌండేషన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement