తిమ్మమ్మ మర్రిమానుప్రపంచ ప్రఖ్యాతి
దేశ విదేశాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు
కనీస సౌకర్యాలు లేక సతమతం
తాగే నీరూ దొరకని వైనం
రవాణా సౌకర్యం లేక సగం మంది వెనక్కి
అభివృద్ధి చేసి ఆదరణ కల్పించాలని కోరుతున్న స్థానికులు
తిమ్మమ్మమర్రిమాను... 669 సంవత్సరాల చరిత్ర. 8.15 ఎకరాల్లో విస్తరించి... 1350కిపైగా ఊడలతో వ్యాపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో నిలిచింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నా.. కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం కావడంతో తిమ్మమ్మ మర్రిమాను ఖ్యాతికి చెదలు పడుతోంది
ఎన్‌పీకుంట: సత్యసాయి జిల్లాలోని నంబులపూలకుంట (ఎన్‌పీకుంట) మండలం గూటిబైలు గ్రామంలోని తిమ్మమ్మమర్రిమాను చరిత్ర అమోఘం. అభివృద్ధి మాత్రం దారుణం. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ అతిపెద్ద మర్రిమాను గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా సౌకర్యాలు కరువయ్యాయి.
మర్రిమాను చరిత్ర..
దిగువగూటిబైలు గ్రామానికి చెందిన తిమ్మమాంబ భర్త బాలవీరయ్యతో కలిసి 1355లో సతీసహగమనం చేసినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో చితికి నాలుగు వైపులా నాటిన ఎండు మర్రిగుంజల్లో ఈశాన్యం వైపు నాటిన గుంజ చిగురించి, నేడు మహావృక్షంగా మారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
8.15 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిమ్మమ్మమర్రిమాను కర్ణాటక రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ సత్యనారాయణ అయ్యర్ కృషి ఫలితంగా 1989లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది.
సౌకర్యాలు కరువు..
తిమ్మమ్మమర్రిమాను గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో ఆసక్తితో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడిదాకా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. కనీసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో వెంటనే వెళ్లిపోతున్నారు. మరోవైపు పర్యవేక్షణ కరువై ఊడలు కూడా చెదలు పడుతున్నాయి.
అటవీశాఖ ఆదీనంలోకి తీసుకున్నా..
1990వ సంవత్సరంలో తిమ్మమ్మమర్రిమాను అటవీ అభివృద్ధి శాఖ ఆ«దీనంలోకి తీసుకుంది. పార్కు, షెడ్డు ఏర్పాటు చేసి కొన్ని వన్యప్రాణులను తీసుకువచ్చి అందులో ఉంచింది. సమీపంలోని 27 ఎకరాలు కూడా సేకరించింది. కానీ ఆ తర్వాత నిర్వహణ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. పార్కులో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వన్యప్రాణుల షెడ్డులో జింకలు, కుందేళ్లు, నెమళ్లు మాత్రమే ఉన్నాయి.
భూమి కోత.. ఊడలకు చెదలు..
గతంలో దట్టమైన ఆకులతో మర్రిమాను కళకళలాడుతూ ఉండేది. పర్యాటకులు కూడా మర్రిమాను కింద సేదతీరేవారు. అటవీశాఖ ఆ«దీనంలోకి తీసుకున్నాక చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం శుభ్రత చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం మర్రిమాను లోపలిభాగంలో కొన్ని చోట్ల భూమి కోతకు గురైంది.
భూసారం తగ్గి ఆకులు రాలిపోవడంతో పాటు, చెట్టు సైతం నేల వాలింది. మరికొన్ని చోట్ల ఊడలకు చెదలు పట్టింది. వెంటనే ప్రభుత్వాలు తిమ్మమ్మమర్రిమాను సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.
అభివృద్ధి పనులు డిమాండ్ ఇలా..
» తిమ్మమాంబ అమ్మవారి దర్శనం అనంతరం పర్యాటకులు మర్రిమాను పరిసర ప్రాంతంలో సేద తీరడం కోసం పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
» పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని వణ్యప్రాణులను తీసుకురావడం, ఆటస్థలాన్ని అభివృద్ధి చేయాలి.
» పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం, నీటి, మరుగుదొడ్ల వసతి కల్పించాలి. రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి. మర్రిమాను పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల పూలమొక్కలు పెంచి అందంగా తీర్చిదిద్దాలి.
» మర్రిచెట్టు ఉన్న విస్తీర్ణంలో మీటరు ఎత్తున కొత్త మట్టిని తోలించి, వాలిన ఊడలను సంరక్షించాలి.
» తిమ్మమ్మమర్రిమానుకు పడమర వైపున ఓబుళదేవరగుట్టపై 10 ఏళ్ల క్రితం టీటీడీ వారు వెంకటేశ్వస్వామి ఆలయం నిర్మించారు. కానీ ఇంత వరకు విగ్రహప్రతిష్ట చేయలేదు. దీంతో ఆ ఆలయ ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. వెంటనే విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయంలో పూజలు ప్రారంభిస్తే ఈప్రాంతానికి భక్తుల రాక పెరుగుతుంది.
వసతులు కల్పించాలి
మేము ఏటా మర్రిమానును సందర్శిస్తాము. గతంలో బాగుండేది. ప్రస్తుతం సౌకర్యాలు లేవు. అమ్మవారిని దర్శించి వెళ్లాల్సి వస్తోంది. మధ్యాహ్న సమయంలో భోజన వసతి కూడా ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి పార్కు, ఆటస్థలం అభివృద్ధి చేయాలి. నీటి, భోజన వసతి కల్పిస్తే బాగుంటుంది. అలాగే మర్రి ఊడలు చెదలు పట్టకుండా కాపాడాలి. – సి.నాగార్జునరెడ్డి, యాత్రికుడు, అనంతపురం
సౌకర్యాలు కరువు
తిమ్మమ్మమర్రిమాను దర్శనానికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. అమ్మవారి దర్శనం తరువాత సేద తీరడానికి అవకాశమే లేదు. మరుగు దొడ్లు, విశ్రాంతి భవనాలు లేవు. ఆటస్థలంలో క్రీడాపరికరాలు ఏవీ లేవు. అలాగే మర్రిమాను కింద సేదదీరే ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచే చూసి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. – రవికుమార్, యాత్రికుడు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment