కోసల రాజ్యంలో నరేంద్రుడనే రైతు ఉండేవాడు. తనకు వాటాగా సంక్రమించిన కొద్దిపాటి పొలంలో ఆరుగాలం కష్టపడి పొట్టపోసుకునేవాడు. ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఉన్నంతలోనే అందరికీ సహాయం చేసేవాడు. అతనికి పశుపక్ష్యాదులంటే ఎనలేని ప్రేమ. అతని ఇల్లు ఎన్నో జంతువుల నిలయం. ఒక జంతు ప్రదర్శన శాలలా కనబడేది. తను పస్తులున్నా సరే, వాటికి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. పేదవాడైనా సరే, ఊరిలో అతడు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఒక రోజు ఎప్పటిలాగే నరేంద్రుడు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. పొలంలోని చెట్టుకింద, ఒక రామ చిలుక గాయాలతో కనిపించింది. అరే, చిలుకకు ఏమై ఉంటుంది. ఎగరడం లేదు, అనుకుంటూ దానిని చేతిలోకి తీసుకున్నాడు. కొన ఊపిరితో ఉంది. రెక్కలకు తీవ్ర గాయాలు కనిపించాయి. వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. తెలిసిన వైద్యం చేశాడు. రామ చిలుక, మెల్లగా కోలుకోసాగింది. ప్రతిరోజూ రామ చిలుకకు ఇష్టమైన పండ్లు తినిపించేవాడు. దాంతో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. నరేంద్రుడు, ఆ చిలుకతో రోజు ఎన్నో కబుర్లు చెప్పేవాడు. చిలుక సైతం, తన పలుకులతో స్పందించేది చిలుక భాష నరేంద్రుడికి, నరేంద్రుడి భాష చిలుకకు అర్థమయ్యేంత అవగాహన పెరిగింది.చిలుక పూర్తిగా కోలుకుంది. ఒకరోజు నరేంద్రునితో ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను మా అమ్మ, నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను, నీ వద్దకు తీరిక దొరికినప్పుడల్లా వచ్చిపోతాను సెలవిప్పించండి’’ అంది రామ చిలుక. ’సరే’, అన్నాడు బాధగా నరేంద్రుడు. ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది రామ చిలుక.
నరేంద్రుడు చాలా మంచివాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది రామ చిలుక. దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాణి గారి అంతఃపురం చేరింది. రాణి గారి ముత్యాల హారాన్ని నోట కరుచుకొని, నరేంద్రుని ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.నరేంద్రుడు హారాన్ని చూశాడు. ఈ విలువైన హారం ఇక్కడికి ఎలా వచ్చింది, అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. పరిశీలించాడు.ఇది చాలా విలువైన ఆభరణంలా ఉంది. బహుశ రాజకుటుంబీకులకు చెందినది కావచ్చు అని అనుకొని దానిని భద్రంగా రాజ భవనానికి తీసుకెళ్ళాడు. రాజును దర్శించి, ‘‘ప్రభూ! నా ఇంటి ముందు ఈ ముత్యాల హారం పడి ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. మీకు అప్పగించాలని వచ్చాను’’ అని విన్నవించాడు. రాజు జాగ్రత్తగా పరిశీలించి, రాణి ధరించే ఆభరణంగా గుర్తించాడు.రాజు, నరేంద్రుని నిజాయతీని మెచ్చుకొని, అతడిని ఖజానా కాపలాదారుగా నియమించాడు. నరేంద్రుడు చాలా సంతోషించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు రామచిలుక అతని ఇంటికి వచ్చింది. నరేంద్రునితో, ‘‘ఒక బందిపోటు దొంగల ముఠా రాజు గారి ఖజానాపై కన్నేసింది. దానిపై దాడిచేసి ఖజానాను లూటీ చేయాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ముఠా అడవిలోని మర్రిచెట్టు కింద సమావేశమై ఎలా దాడి చేయాలనే దానిపై మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను నేను చెట్టు పై నుంచి విన్నాను’’ అని చెప్పింది.నరేంద్రుడు వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు సైనికులను అప్రమత్తం చేశాడు. దొంగల ముఠా దాడిని సులువుగా తిప్పికొట్టారు. ముఠాలోని దొంగలందరినీ బంధించి, రాజుగారి ముందు హాజరుపరచారు. నరేంద్రుని తెలివిని, తెగువను మెచ్చుకున్న రాజు అతనికి సైన్యంలో ఉన్నతోద్యోగం ఇచ్చాడు.
మరికొన్ని నెలలు గడిచాయి మళ్ళీ రామచిలుక ఇంటికి వచ్చి నరేంద్రుడిని కలిసింది. ‘‘రాజు గారిని కూలదోయడానికి దాయాదులు కుట్ర పన్నుతున్నారు. నేను దాయాదుల మాటలు విన్నాను. రాజును మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పు’’ అని చెప్పి వెళ్ళింది.నరేంద్రుడు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు ముందుగా ఈ విషయాన్ని నమ్మలేదు. అయినప్పటికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.నమ్మకమైన అంగరక్షకులను నియమించుకున్నాడు. అనుకున్నట్టు గానే దాయాదులు రాజ మందిరంపై దాడి చేశారు. అయితే అంగరక్షకులు దాడిని తిప్పికొట్టారు. రాజు సురక్షితంగా బయటపడ్డారు.రాజు వెంటనే నరేంద్రుడిని రమ్మని కబురు పంపాడు. ‘‘నీకు రుణపడి ఉంటాను. నీ ముందస్తు సమాచారం వల్లనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నీ వంటి విధేయులు నాకు ఎంతో అవసరం. నా రాజ్యానికి మరింత అవసరం. నిన్ను సైన్యాధ్యక్షునిగా నియమిస్తున్నాను’’ అంటూ ఉత్తర్వులు జారీ చేశాడు.ఏడాది గడిచాక ఒక రోజు చిలుక మళ్ళీ వచ్చింది. నరేంద్రునితో ముచ్చటిస్తూ ‘‘ఒక ముఖ్యమైన వార్తను మోసుకు వచ్చాను. రాజ్యానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు రాజ్యం ఈ రాజ్యాన్ని కబళించాలని వ్యూహ రచన చేస్తోంది. నీవు నీ సైన్యంతో అప్రమత్తంగా ఉండు’’ అంటూ వారి సైనిక కదలికలను ఎప్పటికప్పుడు నరేంద్రునికి చేరవేసింది. యుద్ధంలో నరేంద్రుని సైన్యం, పొరుగు రాజు సేనలను చిత్తు చేసింది. నరేంద్రుని పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి. నరేంద్రుని శక్తియుక్తులపై రాజుకు పూర్తిగా నమ్మకం ఎర్పడింది.కొన్నాళ్లకు రాజు వ్యాధిగ్రస్తుడై మంచం పట్టాడు. వైద్యులు నయంగాని వ్యాధి అని చేతులెత్తేశారు. దీంతో రాజు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో చర్చించి, వారి ఆమోదంతో నరేంద్రుడిని రాజుగా ప్రకటించాడు. నరేంద్రుని పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రామచిలుకలు పూల మాలతో సన్మానించాయి. చిలుక సహాయానికి, ఆ పక్షిని రాజ్య పక్షిగా ప్రకటించాడు. తన రాజ్యంలోజంతు హింసను నిషేధించి, జనరంజకంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలను పొందసాగాడు.
- పుల్లూరు జగదీశ్వరరావు
చిలుక సాయం
Published Sun, Jan 20 2019 2:15 AM | Last Updated on Sun, Jan 20 2019 2:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment