సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కి.మీ. నిడివిలో ఉన్న 890 మర్రి చెట్ల (ఈ సంఖ్య విషయంలో భిన్న లెక్కలున్నాయి) భవితవ్యం తేల్చేందుకు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ వచ్చే త్వరలో పర్యావరణ ప్రభావ అంచనా (ఎని్వరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) అధ్యయనం నిర్వహించబోతోంది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణాది బెంచ్ ఈమేరకు ఇటీవల ఆదేశించటంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇటీవల నేషనల్‌హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధికారులతో ఓ సమావేశం నిర్వహించి ఈమేరకు చర్యలు ప్రారంభించింది. పక్షం రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, ఆ మర్రి చెట్ల పరిరక్షణకు సూచనలు చేయనుంది. గరిష్ట సంఖ్యలో వృక్షాలను కాపాడుతూ, రోడ్డు నిర్మాణంతో వాటికి అతి తక్కువ నష్టం వాటిల్లేలా ప్రత్యామ్నాయ చర్యలను ఈ అధ్యయనంలో నిర్ధారిస్తారు.
ఎందుకీ అధ్యయనం..
కొత్తగా ఓ రోడ్డు నిర్మించేటప్పుడు అక్కడ చెట్లు తొలగించాల్సి ఉంటే ముందస్తు సమాచారంతో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని.. ఆ చెట్ల తొలగింపుతో ఎదురయ్యే పరిణామాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. చెట్లను తొలగంచటం వల్ల ఎదురయ్యే దు్రష్పభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలేంటో అధికారులు వివరిస్తారు. వృక్షాలకే కాకుండా అక్కడి జంతుజాలానికి కూడా నష్టం కాకుండా తీసుకునే చర్యలను వివరిస్తారు.
కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించటం తప్పనిసరి. కానీ, అప్పటికే ఉన్న రోడ్డును విస్తరించే సందర్భంలో వంద కి.మీ.లోపు నిడివి ఉంటే ఈ తరహా సమావేశాలు కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా విస్తరణ పనులను ఆ విభాగం ఇప్పటికే చేపట్టింది. కానీ, నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్డు మీద ఉన్న మన్నెగూడ వరకు విస్తరణ పనులను ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మీద దాదాపు వందేళ్ల క్రితం నాటికి మర్రి వృక్షాలున్నాయి.
గతంలో హైదరాబాద్ చుట్టూ అన్ని రోడ్ల మీద మర్రి వృక్షాలుండేవి. వాటి వయసు 80 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఉండేవి. కానీ రోడ్ల విస్తరణతో ఆ వృక్షాలు మటుమాయమయ్యాయి. నాటి వృక్షాలు ఉన్న ఏకైక రోడ్డు చేవెళ్ల హైవే మాత్రమే. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఆ వృక్షాలు కూడా మాయమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.ఏడాదిన్నర నుంచి వాదోపవాదాలు జరగ్గా, ఇటీవల ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ రోడ్డు విస్తరణలో కూడా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ అధ్యయనం అనివార్యం కావటంతో కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఏం జరుగుతుంది..
గతంలో నగరంలో గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ఇలాంటి భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యావరణం పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డుమీద వేయికి చేరువలో మర్రి వృక్షాలున్నందున, వాటిని తొలగిస్తే పర్యావరణంతోపాటు పక్షిజాతిపై పెనుప్రభావం ఉంటుందన్న అంచనా ఉంది. కచ్చితంగా ఆ వృక్షాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వృక్షాలు ఎక్కువగా ఉన్న చోట పాత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కొత్త అలైన్‌మెంట్ చేయటం, మిగిలిన వాటిల్లో వీలైనంత సంఖ్యలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి చిగురింపచేయటం, కొన్నింటిని కొట్టేయక తప్పని స్థితి నెలకొంటే వాటికి నాలుగైదు రెట్ల సంఖ్యలో కొత్తగా మర్రి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలను ఆ అధ్యయనం ద్వారా సూచిస్తారు.
పనుల్లో మరింత జాప్యం..
ఈ రోడ్డు విస్తరణకు 2019లో కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లు మంజూరు చేసింది. 60 మీటర్ల మేర విస్తరించి ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తారు. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాలున్న చోట విస్తరణ సాధ్యం కానందున, ఆ రెండు చోట్ల ప్రత్యామ్నాయంగా బైపాస్‌లు నిర్మించనున్న విషయం తెలిసిందే. అన్ని సర్వేలు, టెండర్ల ప్రక్రియ పూర్తయి రోడ్డు నిర్మాణానికి సిద్ధమైన తరుణంలో ఈ కేసు అడ్డుపడింది. దీంతో అప్పటి నుంచి పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కొత్త అధ్యయనం నేపథ్యంలో మరింత జాప్యం జరగనుంది. కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆరోడ్డు మీద ఉండాల్సిన ట్రాఫిక్ కంటే 48 శాతం వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఏడాదికి 250 వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, దాదాపు 45 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. వీలైనంత తొందరగా ఆ రహదారిని విస్తరించాల్సి ఉండగా, రకరకాల సమస్యలతో జాప్యం జరుగుతోంది. దాన్ని అలాగే ఉంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మించాలంటే ఖర్చు భారీగా పెరుగుతోందని యంత్రాంగం ఆందోళన చెందుతోంది. దీంతోపాటు అంత నిడివిలో కొత్త రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కూడా కష్టంగా మారుతుందని పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment