దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం
అలైన్‌మెంటు ఖరారు.. వచ్చే నెలలో డీపీఆర్ సమర్పణ
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూ.1,100 కోట్ల వరకు వ్యయం రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేస్తోంది.
ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. వచ్చేనెలలో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్‌మెంట్ కూడా ఖరారైంది.
ఎన్‌హెచ్ 365 బీకి కొత్త రూపు..
సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న 365బీ రోడ్డును కేంద్రం విస్తరిస్తోంది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించినా, చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తోంది.
సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా, జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి.
ఇక రాజీవ్ రహదారి నుంచి ఈ రోడ్డుకు కొత్తరూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ భాగం 365బీలో అంతర్భాగమే అయినా, ఇందులో సింహభాగం గ్రీన్‌ఫీల్డ్ హైవేగా పూర్తి కొత్త రోడ్డుగా ఏర్పడబోతోంది.
రాజీవ్ రహదారి మీదుగా కాకుండా..
ప్రస్తుతం 365బీ జాతీయ రహదారి చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిలో కలుస్తుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా విడదీసి కొత్తరోడ్డుగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వెనక ఉన్న సామాజిక అటవీ భాగం వెనుక నుంచి కోమటి చెరువు పక్క నుంచి సిద్దిపేటకు చేరుతుంది.
పట్టణ వెనుక భాగం నుంచి కోటిలింగేశ్వర దేవాలయ సమీపం మీదుగా ముందుకు సాగి రామంచ గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న 365బీ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి వరకు కొత్త అలైన్‌మెంటుతో రహదారిగా నిర్మిస్తారు. ఆ తర్వాత జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డుగా రూపొందనుంది. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నదిని దాటుతుంది. అక్కడ దీనికోసం వంతెన నిర్మిస్తారు.
ప్రస్తుతం నేరుగా సిరిసిల్లలోకి చేరే పాత హైవేను కాదని, సిరిసిల్ల బైపాస్ రోడ్డుతో పట్టణం దాటిన తర్వాత బైపాస్ కూడలి వద్ద ఇతర రోడ్లతో అనుసంధానమవుతుంది. 100 మీటర్లు – 150 మీటర్ల వెడల్పు.. ఇలా రెండు ప్రణాళికలను డీపీఆర్‌లో చేర్చనున్నారు. వీటిల్లో కేంద్రం దేనికి మొగ్గుచూపితే అంత వెడల్పుతో రోడ్డుకు భూమిని సేకరిస్తారు. డీపీఆర్ ఆమోదం తర్వాతే వివరాలు వెల్లడవుతాయి.
రాజీవ్ రహదారిని క్రాస్ చేసే చోట, సిరిసిల్ల వద్ద మానేరు మీద ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మిస్తారు. డీపీఆర్‌కు ఆమోదం తర్వాతనే వీటిల్లో వేటికి కేంద్రం ఆమోదం తెలిపిందో స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment