Manneguda
-
మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మీద ఉన్న 930 మర్రి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేసే 330 చెట్లకు సంబంధించి నిర్మాణ సంస్థతో వెంటనే తాను మాట్లాడతానని మిగతావాటిì తరలింపు పనులను ఎన్హెచ్ఏఐ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘న్యాక్’లో ఎన్హెచ్ఏఐ అధికారులతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాకులు వెతక్కుండా ఇకనైనా పనులు మొదలుపెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆ రహదారి విస్తరణ పనులకు కొత్త టెండర్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశం మేరకు విజయవాడ హైవే విస్తరణ పనుల టెండర్లు రద్దు చేసి వచ్చేనెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టాలని కోమటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఉప్పల్–ఘట్కేసర్ వంతెన పనులకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా సూచించారు. ఆర్మూరు–మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా, ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రీజినల్ రింగురోడ్డు పూర్తయితే డిస్నీల్యాండ్ సంస్థలు ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడికి ముందుకొస్తాయని, పారిశ్రామిక క్లస్టర్లు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు ఏర్పడతాయని మంత్రి వారికి వివరించారు. జూలైలో రాష్ట్రానికి ఉన్నతాధికారుల బృందం జూలైలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి జాతీయ రహదారు ల విభాగం ఉన్నతాధికారుల బృందం వస్తున్నందున, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్–మల్కాపూర్ మధ్య మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న జాతీయ రహదారి మలుపుపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాక ప్రత్యేక కార్యదర్శి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఎన్హెచ్ఏఐ ఆర్ఓ రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్ఓ కుషా్వతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
ఆ మర్రి వృక్షాలను కాపాడేందుకు రంగంలోకి నిపుణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కి.మీ. నిడివిలో ఉన్న 890 మర్రి చెట్ల (ఈ సంఖ్య విషయంలో భిన్న లెక్కలున్నాయి) భవితవ్యం తేల్చేందుకు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ వచ్చే త్వరలో పర్యావరణ ప్రభావ అంచనా (ఎని్వరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) అధ్యయనం నిర్వహించబోతోంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణాది బెంచ్ ఈమేరకు ఇటీవల ఆదేశించటంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఇటీవల నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధికారులతో ఓ సమావేశం నిర్వహించి ఈమేరకు చర్యలు ప్రారంభించింది. పక్షం రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, ఆ మర్రి చెట్ల పరిరక్షణకు సూచనలు చేయనుంది. గరిష్ట సంఖ్యలో వృక్షాలను కాపాడుతూ, రోడ్డు నిర్మాణంతో వాటికి అతి తక్కువ నష్టం వాటిల్లేలా ప్రత్యామ్నాయ చర్యలను ఈ అధ్యయనంలో నిర్ధారిస్తారు. ఎందుకీ అధ్యయనం.. కొత్తగా ఓ రోడ్డు నిర్మించేటప్పుడు అక్కడ చెట్లు తొలగించాల్సి ఉంటే ముందస్తు సమాచారంతో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని.. ఆ చెట్ల తొలగింపుతో ఎదురయ్యే పరిణామాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. చెట్లను తొలగంచటం వల్ల ఎదురయ్యే దు్రష్పభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలేంటో అధికారులు వివరిస్తారు. వృక్షాలకే కాకుండా అక్కడి జంతుజాలానికి కూడా నష్టం కాకుండా తీసుకునే చర్యలను వివరిస్తారు. కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించటం తప్పనిసరి. కానీ, అప్పటికే ఉన్న రోడ్డును విస్తరించే సందర్భంలో వంద కి.మీ.లోపు నిడివి ఉంటే ఈ తరహా సమావేశాలు కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా విస్తరణ పనులను ఆ విభాగం ఇప్పటికే చేపట్టింది. కానీ, నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్డు మీద ఉన్న మన్నెగూడ వరకు విస్తరణ పనులను ఎన్హెచ్ఏఐ చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మీద దాదాపు వందేళ్ల క్రితం నాటికి మర్రి వృక్షాలున్నాయి. గతంలో హైదరాబాద్ చుట్టూ అన్ని రోడ్ల మీద మర్రి వృక్షాలుండేవి. వాటి వయసు 80 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఉండేవి. కానీ రోడ్ల విస్తరణతో ఆ వృక్షాలు మటుమాయమయ్యాయి. నాటి వృక్షాలు ఉన్న ఏకైక రోడ్డు చేవెళ్ల హైవే మాత్రమే. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఆ వృక్షాలు కూడా మాయమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.ఏడాదిన్నర నుంచి వాదోపవాదాలు జరగ్గా, ఇటీవల ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ రోడ్డు విస్తరణలో కూడా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ అధ్యయనం అనివార్యం కావటంతో కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏం జరుగుతుంది.. గతంలో నగరంలో గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ఇలాంటి భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యావరణం పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డుమీద వేయికి చేరువలో మర్రి వృక్షాలున్నందున, వాటిని తొలగిస్తే పర్యావరణంతోపాటు పక్షిజాతిపై పెనుప్రభావం ఉంటుందన్న అంచనా ఉంది. కచ్చితంగా ఆ వృక్షాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వృక్షాలు ఎక్కువగా ఉన్న చోట పాత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కొత్త అలైన్మెంట్ చేయటం, మిగిలిన వాటిల్లో వీలైనంత సంఖ్యలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి చిగురింపచేయటం, కొన్నింటిని కొట్టేయక తప్పని స్థితి నెలకొంటే వాటికి నాలుగైదు రెట్ల సంఖ్యలో కొత్తగా మర్రి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలను ఆ అధ్యయనం ద్వారా సూచిస్తారు. పనుల్లో మరింత జాప్యం.. ఈ రోడ్డు విస్తరణకు 2019లో కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లు మంజూరు చేసింది. 60 మీటర్ల మేర విస్తరించి ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తారు. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాలున్న చోట విస్తరణ సాధ్యం కానందున, ఆ రెండు చోట్ల ప్రత్యామ్నాయంగా బైపాస్‌లు నిర్మించనున్న విషయం తెలిసిందే. అన్ని సర్వేలు, టెండర్ల ప్రక్రియ పూర్తయి రోడ్డు నిర్మాణానికి సిద్ధమైన తరుణంలో ఈ కేసు అడ్డుపడింది. దీంతో అప్పటి నుంచి పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కొత్త అధ్యయనం నేపథ్యంలో మరింత జాప్యం జరగనుంది. కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోడ్డు మీద ఉండాల్సిన ట్రాఫిక్ కంటే 48 శాతం వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఏడాదికి 250 వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, దాదాపు 45 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. వీలైనంత తొందరగా ఆ రహదారిని విస్తరించాల్సి ఉండగా, రకరకాల సమస్యలతో జాప్యం జరుగుతోంది. దాన్ని అలాగే ఉంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మించాలంటే ఖర్చు భారీగా పెరుగుతోందని యంత్రాంగం ఆందోళన చెందుతోంది. దీంతోపాటు అంత నిడివిలో కొత్త రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కూడా కష్టంగా మారుతుందని పేర్కొంటోంది. -
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
వైశాలిపై దాడి చేసినట్లు విచారణలో నవీన్ రెడ్డి వెల్లడి
-
వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నవీన్ రెడ్డి కీలక కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు తెలంగాణంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణలో భాగంగా ఆదివారం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసులో హస్తినాపురం నుంచి మన్నెగూడ వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. వైశాలి ఇంటి ముందు టీషాపు కోసం షెడ్డు రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ముఠాను నవీన్ అక్కడికి పిలిచాడు. అనంతరం, వైశాలిని కిడ్నాప్ చేసి కారు ఆమెపై దాడి చేసినట్టు నవీన్ రెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా నవీన్ రెడ్డిని పోలీసులు కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా 36 మంది నిందితులు జైలులోనే ఉన్నారు. -
యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి! -
మన్నెగూడ కిడ్నాప్: నవీన్ రెడ్డి వీడియోపై వైశాలి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్‌సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్‌తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్‌రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి. ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో -
వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది? తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు. చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
యువతి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డి రిమాండ్‌కు తరలింపు
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మొబైల్ లోకేషన్ ఆధారంగా గోవాలోని బీచ్‌లో అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తరలించారు. సరూర్ నగర్ ఓస్‌ఓటీ కార్యాలయంలో నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ జరిగిన డిసెంబర్9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్ రెడ్డి గోవా పారిపోయాడు. నవీన్‌రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్‌రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్‌రెడ్డిన రిమాండ్‌కు తరలించాం. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న రూమన్, పవన్‌ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా నవీన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్‌తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
రంగారెడ్డి యువతి కిడ్నాప్ కేసు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్ 9న కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు
రంగారెడ్డి : తనను కిడ్నాప్ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది. కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్ హామీ ఇచి్చనట్లు తెలిసింది. నవీన్‌రెడ్డి కారు లభ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్ 07 హెచ్ఎక్స్ 2111) వదిలేశారు. పార్కింగ్ చేసి, లాక్ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 2019లో వరంగల్ ఇంతియార్‌గంజ్ పీఎస్ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ చేసినవే: వైశాలి
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి వైశాలి స్టేట్మెంట్ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. ఏడాదిగా నవీన్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె. పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి అంటోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో రోజూ హంగామా చేసేవాడట నవీన్. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. అయితే.. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. సంబంధిత వార్త: వైశాలిని ఇప్పటికీ కూడా అంగీకరిస్తా! -
వైశాలి ఎందుకిలా చేసిందో!.. నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలి-నవీన్‌రెడ్డికి చెందిన వాళ్లు.. ఎవరి వెర్షన్లో వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం నవీన్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది. రెండేళ్లుగా వైశాలి-నవీన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది.. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది. ‘‘నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్‌ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నారాయణమ్మ. ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్ అండ్ డౌన్ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నవీన్‌రెడ్డి చెప్పాడు. అయితే.. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారంలాంటిదేం నడవలేదని వైశాలి కుటుంబం చెబుతోంది. నవీన్‌రెడ్డి ప్రేమ పేరుతో వైశాలిని వేధించాడని చెబుతోంది. ఈ తరుణంలో అన్ని విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదీ చదవండి: మన్నెగూడ కిడ్నాప్ ఘటన.. వైశాలి కుటుంబానికి భద్రత కల్పించండి -
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కిడ్నాప్ ఘటన షాక్‌కు గురిచేసింది: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. యువతి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు తమిళిసై. Shocked to see the incidence.Concerned about the safety of the women kidnapped Assure her family that the culprits will booked as per law.Request @TelanganaDGP for necessary action to safeguard the family & girl https://t.co/VziafBZQud — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 9, 2022 యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అపహరణకు గురైన వైద్య విద్యార్థిని వైశాలి కుటుంబ సభ్యులను మన్నెగూడకు వెళ్లి పరామర్శించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
రంగారెడ్డి: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్ చేసింది. తను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని తండ్రికి చెప్పింది. తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది. మరోవైపు యువతి కిడ్నాప్ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. యువతి కిడ్నాప్‌కు గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్ చేసిన నవీన్‌రెడ్డి టీస్టాల్‌ను తగలబెట్టారు. తమ కూతురు కిడ్నాప్‌కు సీఐ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి గ్యాంగ్ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు కాల్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్ రాహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. -
Hyderabad: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఓటర్లను నగర శివార్లలోని మన్నెగూడకు తరలించేందుకు ఏర్పాటు చేయడంతో.. శివారు వాసులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పలు రూట్లలో రాకపోకలు సాగించేందుకు బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. శివారు డిపోల నుంచి ప్రతి మండలానికి నిత్యం 20– 30 బస్సులను తరలిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఖరీదైనదిగా మునుగోడు ఉపఎన్నిక మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శివార్లలోని మన్నెగూడలోని కన్వెన్షన్ సెంటర్లకు తరలించి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం ఊపందుకుంది. కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. బస్సులు లేక శివారు వాసుల అవస్థలు గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలుండగా.. శివారు ప్రాంతాల్లో ఉన్న బండ్లగూడ, హయత్‌నగర్–1, 2, ఇబ్రహీంపట్నం, మిధాని, ఫరూఖ్‌నగర్ తదితర డిపోలకు చెందిన 150 బస్సులు నిత్యం మునుగోడు ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఆతీ్మయ సమ్మేళనం పేరిట మన్నెగూడకు తరలించేందుకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు చెల్లించి ఈ బస్సులను తరలిస్తున్నట్లు ఆయా పారీ్టల నేతలు చెబుతున్నారు. నగరంలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులను మునుగోడుకు తరలించడంతో నగరంలోని 1050 ఆర్టీసీ రూట్లుండగా.. వీటిలో 250 రూట్లలో నిత్యం 1500 ట్రిప్పులకు కోత పడుతోంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వేలాది మంది సెవన్‌సీటర్ ఆటోలు,క్యాబ్‌లు ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. శివారు ఆర్టీసీ డిపోల నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని 190 గ్రామాలకు రాకపోకలు సాగించే బస్సులే అధికంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఈ బస్సులు మునుగోడు బాట పట్టడంతో ఆయా గ్రామాల వాసులు ఉదయం, రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. కాగా బస్సుల తరలింపు వ్యవహారంపై ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఆర్ఎంను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాలేదు. -
మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. లీటరు పెట్రోల్ రూ.70 డీజిల్ రూ.65కే ఇవ్వాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహీ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని కేంద్రం చెబుతోందని అన్నారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ పేదలకు చేయకూడదా అని ప్రశ్నించారు. ‘దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. నేడు మూడున్నర కోట్ల టున్నల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి’ అని కేంద్రంపై మండిపడ్డారు. చదవండి: కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్ -
అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు కంట కన్నీరు తూడ్చే పరిస్థితి దేశంలో లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయం పెంచుతామని చెప్పిన మోదీ కేవలం అంబానీ, అదానీల ఆదాయం మాత్రమే పెంచారని దుయ్యబట్టారు. ధాన్యం సేకరణను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లాని కేంద్రం చూస్తోందని... అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లేనని అన్నారు. ఆకుపచ్చ కండువా కప్పుకొని రైతుల ఓట్లు దండుకునే వాళ్లే ఉన్నారు తప్ప రైతులకు మేలు చేసే వారు లేరని విమర్శించారు. ప్రపంచ ఆహార సూచికలో 116 దేశాలని సర్వే చేస్తే గతంలో 101 ఉండే భారత్ ఇప్ప్పుడు 6 స్థానాలు దిగజారి 107కు పడిపోయిందని ప్రస్తావించారు.. హైదరాబాద్‌లోని మన్నేగూడలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది అందరికి తెలుసని, కరెంట్ కోసం అడుక్కున్న రోజులు ఆనాడు ఉండేనని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని స్పష్టం చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో 15 నిమిషాలు కరెంట్ పోతే ఆగమాగం పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా చూపెట్టాలని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. చదవండి: మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే! నల్లగొండ జిల్లాలో ఒక్క రాజగోపాల్ రెడ్డి ఆదాయం మాత్రం పెంచాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, ఒక్కరే ధనవంతుడు అయితే నల్గొండ బాగుపడదని మంత్రి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని విమర్శించారు. నూకలు తినమని చెప్పిన బీజేపీ నాయకులు తోకలు కట్ చేయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనమంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించేలా మాట్లాడారని ప్రస్తావించారు. కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చిందని, రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిందన్నారు. ప్రజలు తమ ఓటుతో రైతు వ్యతిరేకులైన బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ‘పక్క రాష్ట్రం కర్ణాటక రైతులు కూడా ఇక్కడ కరెంట్ నీళ్లు వాడుకుంటున్నారని వాటిని అడ్డుకుందామని విద్యుత్ అధికారులు అంటే వద్దు రైతు ఎక్కడైనా రైతేనని చెప్పిన వ్యక్తి కేసీఆర్. రైతు బంధు ఇచ్చి రైతు పెట్టుబడి ఇస్తోంది కేసీఆర్. రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ అంటున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మోటర్ల దగ్గర మీటర్లు పెట్టనివ్వం. మీటర్లు పెట్టాలన్న మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలి. ప్రిపేయిడ్ మీటర్లు పెడితే రోజుకో రేటు కట్టాల్సి వస్తుంది. ఇదే జరిగితే రైతులు వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తారు. పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్న మోదీని బొంద పెడుదమా వద్దా? ధాన్యం కొనమని కేంద్రం చెప్తోంది. కేంద్రం రైతులను తొక్కి చంపాలని చూస్తోంది. రైతు బాగుండాలని చూస్తోంది మా ప్రభుత్వం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్‌హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్‌ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
మన్నెగూడలో ఫైరింగ్ రేంజ్!
♦ ప్రత్యామ్నాయ స్థలంపై రక్షణ శాఖ సానుకూలత? ♦ ప్యాట్నీ–శామీర్‌పేట, ప్యారడైజ్–సుచిత్ర కూడలి ♦ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మోక్షం ♦ కంటోన్మెంట్ భూములు సేకరించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్ రహదారులను నగరంతో ట్రాఫిక్ చిక్కులు లేకుండా అనుసంధానించే రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూల సంకేతాలిచ్చింది. నగరంలోని స్థలం ఇచ్చి దాని బదులు వికారాబాద్ సమీపంలోని మన్నెగూడ వద్ద వంద ఎకరాలకుపైగా భూమిని తీసుకునేందుకు రక్షణ శాఖ సమ్మతించినట్టు తెలిసింది. ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోనుంది. అందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత కోసం కంటోన్మెంట్ అధికారులను పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అనుకూలంగానే ఉంటుందని ఢిల్లీలోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా కంటోన్మెంట్ మీదుగా రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా... నిజామాబాద్ జాతీయ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా నగరంలోకి వచ్చే వాహనాలు శివారు వరకు వేగంగానే వచ్చినా, అక్కడి నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుని నగరం చేరేందుకు దాదాపు గంటకుపైగా సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్ చిక్కుల నుంచి మోక్షం కలిపిస్తూ, వాహనాలు వేగంగా నగరంలోకి వచ్చేలా భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరగాలంటే కచ్చితంగా కంటోన్మెంట్ భూముల మీదుగానే నిర్మించాలి. ప్యాట్నీ కూడలి నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారిని అనుసంధానిస్తూ ఓ కారిడార్, ప్యారడైజ్ కూడలి నుంచి నిజామాబాద్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి దాదాపు 96 ఎకరాల కంటోన్మెంట్ భూమిని సేకరించాలి. సీఎం స్థాయిలో రక్షణశాఖ మంత్రితో గతంలో చర్చించిన మీదట రక్షణ శాఖ దీనికి సానుకూలత వ్యక్తం చేసింది. ‘ఏఓసీ’కి ప్రత్యామ్నాయ మార్గం కూడా... మరోవైపు సికింద్రాబాద్ నుంచి అటు రామకృష్ణాపురం వంతెన మీదుగా ఈసీఐఎల్ రోడ్డు.. ఇటు సఫిల్‌గూడ రోడ్డుకు చేరుకునేలా కంటోన్మెంట్‌లోని ఏఓసీ మార్గాన్ని వినియోగిస్తున్నారు. క్రమంగా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తమకు ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ కంటోన్మెంట్ యంత్రాంగం ఆ రోడ్డును మూసేయాలని నిర్ణయించి పలుమార్లు దాన్ని తాత్కాలికంగా అమలు చేసింది. ఆ రోడ్డు మూసేస్తే ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురు కానున్నందున ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని రక్షణశాఖ కొట్టిపారేసింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించుకునేందుకు కొంత గడువు ఇస్తామని ప్రకటించటంతో ప్రభుత్వం ఆ అన్వేషణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కూడా మార్గం సుగమమవుతోందని రోడ్లు భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్ సరిహద్దుల మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను వెడల్పు చేసి వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కంటోన్మెంట్‌కు సంబంధించిన 40 ఎకరాలను సేకరించనుంది. దీనికి కూడా ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. -
యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మన్నెగూడలో బస్సుకోసం వేచి చూస్తున్న ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీలాపూర్కు చెందిన దానయ్య తన ఆటోలో ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చుతానని నమ్మబలికి, అనంతరం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు ...పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మాల శ్రీనివాస్, ఎర్రవెల్లి భీమయ్య, దానయ్య, ఎర్రవెల్లి మల్లయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం చేవెళ్లలోని కోర్టులో హాజరుపరిచారు.