మర్రి వృక్షాల తరలింపు ప్రక్రియ ప్రారంభించండి
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
రీజినల్ రింగురోడ్డు పూర్తయితే పెట్టుబడులు వస్తాయన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మీద ఉన్న 930 మర్రి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేసే 330 చెట్లకు సంబంధించి నిర్మాణ సంస్థతో వెంటనే తాను మాట్లాడతానని మిగతావాటిì తరలింపు పనులను ఎన్‌హెచ్‌ఏఐ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘న్యాక్’లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాకులు వెతక్కుండా ఇకనైనా పనులు మొదలుపెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు.
ఆ రహదారి విస్తరణ పనులకు కొత్త టెండర్లు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశం మేరకు విజయవాడ హైవే విస్తరణ పనుల టెండర్లు రద్దు చేసి వచ్చేనెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టాలని కోమటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఉప్పల్–ఘట్కేసర్ వంతెన పనులకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా సూచించారు. ఆర్మూరు–మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా, ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రీజినల్ రింగురోడ్డు పూర్తయితే డిస్నీల్యాండ్ సంస్థలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడికి ముందుకొస్తాయని, పారిశ్రామిక క్లస్టర్లు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు ఏర్పడతాయని మంత్రి వారికి వివరించారు.
జూలైలో రాష్ట్రానికి ఉన్నతాధికారుల బృందం
జూలైలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి జాతీయ రహదారు ల విభాగం ఉన్నతాధికారుల బృందం వస్తున్నందున, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్–మల్కాపూర్ మధ్య మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న జాతీయ రహదారి మలుపుపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాక ప్రత్యేక కార్యదర్శి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఓ రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్‌ఓ కుషా్వతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment