సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది?
తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు.
చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో..
Comments
Please login to add a commentAdd a comment