woman kidnap
-
మన్నెగూడ కిడ్నాప్: నవీన్ రెడ్డి వీడియోపై వైశాలి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్‌సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్‌తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్‌రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి. ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో -
వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది? తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు. చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
యువతి కిడ్నాప్ కేసు.. ‘హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు, కొరికారు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్‌కు గురైన యువతి వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్ రెడ్డితో తనకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్ తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు. నాకు నవీన్ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్‌ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు. నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్తోనా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్‌గా ఉంటుందని నవీన్ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని నవీన్‌రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు. మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు. అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేశారు. చదవండి: టెక్కీ భర్త నిర్వాకం.. స్నేహితులతో పడుకోవాలని భార్యను బలవంతం -
Adibatla: యువతి కిడ్నాప్ వ్యవహారం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు గంటల్లోనే బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. యువతిని తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించినట్లు వెల్లడించారు.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామన్నారు. 10 సెక్షన్ల కింద కేసుల నమోదు చేస్తామన్నారు. కిడ్నాప్‌కు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేస్తున్నారు. బాధితురాలి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరా సహా నిందితులు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కిడ్నాప్‌కు ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చదవండి: ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు: నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన దాడికి ముందు ఏం జరిగిందంటే! ‘యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డీ అందర్నీ పార్టీ పేరుతో తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. టీస్టాల్లో పనిచేసే సిబ్బందితోపాటు మరికొంతమంది బిహారీలను కార్యాలయానికి రమ్మని చెప్పాడు. పార్టీ పేరుతో మద్యం ఏర్పాటు చేసి.. తరువాత మద్యం మత్తులో ఉన్న వారందరినీ కారులో తీసుకొని వైశాలి ఇంటికి వచ్చాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ముందుగా నవీన్ రెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడగా.. తరువాత వెనకాల ఉన్న అందరూ కూడా దాడి చేశారు. వైశాలి కిడ్నాప్ తరువాత అందరూ వివిధ మార్గాల్లో పారిపోయారు’ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా శుక్రవారం ఆదిభట్లలోని యువతి ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దుండగుల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.డీసీఎం, కార్లలో సినీ ఫక్కీలోఎంట్రీ ఇచ్చిన దాదాపు వందమంది యువకులు.. యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లోని వస్తువులు, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారు. అమ్మాయిని తీసుకెళ్లిన వ్యక్తిని మిస్టర్ టీ ఓనర్ నవీన్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. అంతేగాక వైశాలికి ఇటీవలే మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే, వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
రంగారెడ్డిలో యువతి కిడ్నాప్ కలకలం.. సినిమా స్టైల్లో 100 మందితో వచ్చి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో ఓ యువతి కిడ్నాప్గు గురైంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు. యువతని కిడ్నాప్ చేసింది టీ టైం ఓనర్ నవీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 100 మంది యువకులు తన కూతురు వైశాలిని కిడ్నాప్ చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. నవీన్ రెడ్డి, వైశాలి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. శుక్రవారం రోజు వివాహ సంబంధం కోసం మరో పెళ్లివారు వైశాలి ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టి నవీన్ రెడ్డీ అమ్మయి ఇంటి దగ్గరికి వందకుపైగా గుండాలతో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేశాడు. దీనిపై కేసు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
Viral Video: మహిళను కిడ్నాప్ చేసిన 15 మంది యువకులు.. ఇంటి గేటు పగలగొట్టి
సాక్షి, చెన్నై: ఓ మహిళ ఇంట్లోకి 15 మంది యువకులు చొరబడి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైలాడుతురైలోని మహిళ నివాసం ముందు ఉన్న గేటును పగులగొట్టి 15 మంది యువకులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. అయితే అదే రోజు రాత్రి పోలీసులు మహిళను కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు . కాగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరైన 34 ఏళ్ల విఘ్నేశ్వరన్ మహిళతో పరిచయం పెంచుకొని స్నేహం పేరుతో ఆమె వెంటపడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విఘ్నేశ్వరన్ వేధింపులతో విసుగెత్తిన సదరు మహిళ మైలాడుతురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి బెదిరించారు. ఇంకోసారి ఇలా చేయకూడదని స్టేట్మెంట్ తీసుకొని విడుదల చేశారు. అయితే తనపై కేసు పెట్టిన మహిళపై విఘ్నేశ్వరన్ పగ పెంచుకున్నాడు. జూలై 12న కొంతమందితో కలిసి మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా... ఆమె తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.అయితే మహిళపై మరింత కోపం పెంచుకున్న విఘ్నేశ్వరన్ మరో 14 మంది అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి మహిళ ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి ఆమెను తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాపర్ల కారును అడ్డగించి మహిళను రక్షించారు. విఘ్నేశ్వరన్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: యుద్ధ సైరన్ల మధ్య ప్రియురాలికి ప్రపోజ్: వీడియో వైరల్ -
యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..
సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. భీమవరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే యువకుడు లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని ఆమెను నమ్మించాడు. భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో యువతిని నిర్భంధించాడు. యువతి కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో తీసి వాటిని యువతి తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భీమవరంలో నిందితుడు ఫణీంద్రను అరెస్టు చేశారు. -
మహిళ కిడ్నాప్‌నకు యత్నం?
హైదరాబాద్, చంచల్‌గూడ: లండన్‌కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహిళను క్యాబ్ డ్రైవర్ దారి మళ్లించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన మహిళ పోలీస్ కంట్రోల్ రూంకు, తన భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నారాయణగూడకు చెందిన సోనియా అనే మహిళ లండన్ వెళ్లేందుకు గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఊబర్ క్యాబ్ (వెరిటో ఏపీ 29 టీవీ 5733)ను బుక్ చేసింది. నారాయణగూడ నుంచి బయలు దేరిన క్యాబ్ గుర్తు తెలియని దారిలో వెళ్తుండడంతో ఆమె గుర్తించి డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగింది. కారు ఆపకపోవడంతో ఆమె తన భర్తతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. ఈ లోగా కారు వేగంగా కుర్మగూడ డివిజన్ సాయిలాల్తోట వైపు చేరుకుంది. అక్కడ రోడ్డుపై టెంట్ అడ్డంగా ఉండటంతో కారు ఆపి డ్రైవర్ పారిపోయాడని, సోనియా కారు దిగి విలపించిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానం వెళ్లే సమయం కావడంతో సోనియాను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా రూట్ మారడంతోనే మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చిందని, అందువల్లే తాను మాదన్నపేట పోలీస్ స్టేషన్‌కు బయలుదేరానని డ్రైవర్ తెలిపినట్లు తెలిసింది. డ్రైవర్‌కు, మహిళకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నామని సీఐ నగేష్, ఎస్ఐ మాధవ్‌రెడ్డి తెలిపారు. సోనియా తిరిగి ఇండియాకు వచ్చాక పూర్తిస్థాయిలో విచారిస్తామని చెప్పారు. -
కిడ్నాపర్లు అరెస్ట్ ... రూ. 1.50 కోట్లు స్వాధీనం
కిడ్నాప్‌కు గురైన మహిళను హెబ్బగుడి పోలీసులు క్షేమంగా రక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. హెబ్బగుడి సమీపంలో అనుసూయమ్మ నివాసముంటోంది. ఆమె కుటుంబ సభ్యులు భూలావాదేవీలు, రియల్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు దుండగులు అనుసూయమ్మను కిడ్నాప్ చేశారు. రూ.1.50 కోట్లను ఇవ్వాలంటూ వారు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. దీంతో వారు ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ డబ్బును బెంగళూరు నగర శివార్లలో ఉన్న దుండగులకు ఇచ్చారు. దీంతో వారు అనుసూయమ్మ వదిలేసి.. డబ్బుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు పూర్తి వివరాలు వెల్లడించడానికి హెబ్బగుడి పోలీసులు నిరాకరిస్తున్నారు.