సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు గంటల్లోనే బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. యువతిని తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించినట్లు వెల్లడించారు..
నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామన్నారు. 10 సెక్షన్ల కింద కేసుల నమోదు చేస్తామన్నారు. కిడ్నాప్‌కు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేస్తున్నారు. బాధితురాలి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరా సహా నిందితులు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కిడ్నాప్‌కు ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
చదవండి: ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు: నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన
దాడికి ముందు ఏం జరిగిందంటే!
‘యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డీ అందర్నీ పార్టీ పేరుతో తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. టీస్టాల్‌లో పనిచేసే సిబ్బందితోపాటు మరికొంతమంది బిహారీలను కార్యాలయానికి రమ్మని చెప్పాడు. పార్టీ పేరుతో మద్యం ఏర్పాటు చేసి.. తరువాత మద్యం మత్తులో ఉన్న వారందరినీ కారులో తీసుకొని వైశాలి ఇంటికి వచ్చాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ముందుగా నవీన్ రెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడగా.. తరువాత వెనకాల ఉన్న అందరూ కూడా దాడి చేశారు. వైశాలి కిడ్నాప్ తరువాత అందరూ వివిధ మార్గాల్లో పారిపోయారు’ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
కాగా శుక్రవారం ఆదిభట్లలోని యువతి ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దుండగుల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.డీసీఎం, కార్లలో సినీ ఫక్కీలోఎంట్రీ ఇచ్చిన దాదాపు వందమంది యువకులు.. యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లోని వస్తువులు, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారు. అమ్మాయిని తీసుకెళ్లిన వ్యక్తిని మిస్టర్ టీ ఓనర్ నవీన్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. అంతేగాక వైశాలికి ఇటీవలే మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే, వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment