మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా... | G.R. Maharishi special story | Sakshi
Sakshi News home page

మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...

Published Sat, Jun 6 2015 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...

మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...

హ్యూమర్ ప్లస్
మా ఊళ్లో ఒకాయనుండేవాడు. పనేమీ చేసేవాడు కాదు. మూడు పూట్లా తిని ఆరు పూట్ల నిద్రపోయేవాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేవాడు. ఒక్కసారి నిద్రపోతూ కూడా మాట్లాడేవాడు. మర్రిచెట్టు కింద కూచుని వచ్చీపోయే వాళ్లకి తత్వబోధ చేసేవాడు. విన్నవాళ్లకి బుర్ర తిరిగిపోయేది. వినకపోతే కర్రతో బుర్రపై ఒకటిచ్చేవాడు. విన్నా వినకపోయినా జ్ఞాన బాధే.బాధలతోనే ఈ ప్రపంచం పుట్టిందని, బాధలతోనే అంతరిస్తుందని ఆయన సిద్ధాంతం.

ఈయనతో బాధలు పడిపడి ఆయన భార్యకు ఒకరోజు పిచ్చెక్కింది. ఆమె మలయాళంలో బూతులు తిడుతూ దొరికినవన్నీ దొరికినట్టు ఉతకసాగింది. మనుషులకే బస్సులు లేక సర్వీస్ ఆటోలకు వేలాడుతున్న కాలంలో ఒక దెయ్యం రెండు రాష్ట్రాలు దాటి మా ఊరికొచ్చి ఈమెను పట్టుకోవడంలో ఆంతర్యమేమిటో చెట్టుకింద పండితులకి ఎవరికీ అర్థం కాలేదు.
 
మనుషులు తమ బాధల్ని తీర్చుకోవటానికి ఇతరుల్ని బాధించినట్టు దెయ్యాలు కూడా బాధావిముక్తి కోసం ఇలాంటి క్రియాశీలక చర్యలకు దిగుతుంటాయని ఆమె భర్త వాదించాడు. ఈ మాట అన్న మరుక్షణం ఆ దెయ్యపు భార్య దుడ్డుకర్రని గిరగిర తిప్పి భర్త మోకాళ్లకు గురిచూసి కొట్టి మలయాళాన్ని ఎత్తుకుంది. ఇంతకూ ఆమె మాట్లాడుతున్నది మలయాళమో కాదో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో ఎవరికీ మలయాళం రాదు, వినలేదు. తెలుసుకోవాలనే కోరికుండాలే కానీ, దానికి దారులు అనేకముంటాయి.

తాడిపత్రి బస్టాండులో టీ అమ్ముకునే నాయరుని ప్రవేశపెట్టారు. వాడు రావడం రావడమే టీ కెటిల్‌తో వచ్చి అందరికీ టీ అందించి, డబ్బులు వసూలు చేశాడు. డబ్బు వల్ల జ్ఞానమూ, జ్ఞానం వల్ల అజ్ఞానం సంభవిస్తాయని దెయ్యపు భర్త కొత్త సిద్ధాంతాన్ని ఎత్తుకున్నాడు. భర్త గొంతు వినగానే మలయాళ దెయ్యం విజృంభించింది. అనేకమంది కకావికలై పారిపోగా, కొంతమంది ధైర్యవంతులు ఆమెని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ముందస్తు చర్యగా దెయ్యపు భర్త దుడ్డుకర్రకి అందకుండా చెట్టెక్కాడు.

ఆమె ఉగ్రరూపం చూసి నాయరు తాడిపత్రి వైపుకి తిరిగి పిక్కబలం కొద్దీ పారిపోసాగాడు. ఈ హడావుడిలో టీ కెటిల్ కూడా మరిచిపోయాడు. ఎలాగోలా వాడిని వెనక్కి లాక్కొచ్చారు. ఆమె మాట్లాడింది మలయాళమే కానీ, తనకేమీ అర్థం కాలేదని నాయర్ చెప్పాడు. నిరూపితం కానప్పుడు ఏ భాషకీ శాస్త్రీయత ఉండదని చెట్టుపైన ఉన్న భర్త వాదించడానికి ప్రయత్నించాడు కానీ, ఎవరూ పట్టించుకోలేదు.
 
ఇలా కాదని టవున్ నుంచి డాక్టర్‌ని తీసుకొచ్చారు. రోగితోనూ రోగంతోనూ నిమిత్తం లేకుండా ఆయన ప్రతివాడికి మూడు ఇంజెక్షన్లు వేస్తాడు. ఒకవేళ రోగాన్ని ఆయన పసిగడితే ఇంజక్షన్ల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి పొరపాటున రోగితో పాటు వెళ్లిన సహాయకునికి కూడా మూడు సూది పోట్లు పొడిచాడు. వాడు కళ్లు తిరిగి పడిపోతే వాడి కులపోళ్లు వచ్చి ధర్నా చేశారు. చేతి చమురు వదిలించుకున్న పరిజ్ఞానంతో అప్పటినుంచి మనిషి ముఖకవళికల ఆధారంగా సూదిమొనను సవరిస్తాడు.
 
దెయ్యపు స్త్రీ దగ్గరకెళ్లి నాడిని చూశాడు. గుండె శబ్దాన్ని విన్నాడు. ఎప్పటిలాగే సూది వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో డాక్టర్‌కి తెలియదు. కళ్లు తెరిచేసరికి తన ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా మా పెద్దమ్మ సీన్‌లోకొచ్చింది. ఆమె రిటైర్డ్ టీచర్. దెయ్యపు స్త్రీ దగ్గరికెళ్లి ఆప్యాయంగా అదుముకుంది. భర్తని చెట్టు దింపి చెంప పగలగొట్టింది.
 
‘‘నువ్వు వాగడమే కానీ, దాన్ని ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడనిచ్చావా? చివరికి తిట్టడానికి కూడా భాష మరిచిపోయింది. ఇప్పటికైనా నోర్మూసుకుని ఉంటే ఉంటావు, లేదంటే పోతావు’’ అని వెళ్లిపోయింది. కాలం ఎవడి అదుపాజ్ఞల్లో ఉండదు. మారుతూ ఉంటుంది. మా ఊళ్లో ఆడవాళ్లు ఇప్పుడు ఎంతలా మారారంటే మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా.
- జి.ఆర్.మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement