సోఫాలో సాఫీగా... | Humor Plus | Sakshi
Sakshi News home page

సోఫాలో సాఫీగా...

Published Sun, May 1 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

సోఫాలో సాఫీగా...

సోఫాలో సాఫీగా...

హ్యూమర్‌ప్లస్
నేల, బెంచీ, కుర్చీలు కాకుండా సోఫా క్లాసులు కూడా ఉంటాయని హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య ఒక సినిమాకి వెళ్లాను. బటన్ నొక్కితే సోఫా విచ్చుకుంది. కాళ్లు చాపుకుని పడుకున్నా. పక్కసీటాయన లేపితే లేచా. ‘‘నిద్రపోండి, కానీ గురకపెట్టకండి. నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది’’ అన్నాడు. ఈ సోఫా వల్ల సౌలభ్యం ఏమింటే, సినిమా బావున్నా, బాలేకపోయినా నిద్ర మాత్రం గ్యారంటీ.
 ఈమధ్య మా ఆవిడ సెల్‌లో రికార్డు చేసిన ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. కుక్క, పిల్లి, కోతి ఒక బోనులో గొడవపడుతున్నట్టుగా వుంది.
 
‘‘ఏంటీ శబ్దం?’’ అని కంగారుగా అడిగాను.
 ‘‘మీ గురక’’ అంది. మగవాళ్ల గురక వల్ల ఆడవాళ్లకి మతి భ్రమణమైనా కలుగుతుంది. లేదా వేదాంతమైనా అబ్బుతుంది. రెంటికీ పెద్ద తేడా లేదు. ఆడవాళ్లు కూడా భారీగా గురకపెడతారు. వయసుని ఒప్పుకోనట్టే, దీన్ని కూడా ఒప్పుకోరు. నా మిత్రుడు ఒకాయన భార్య గురకకి భయపడి హౌస్‌కి వెళ్లకుండా మాన్షన్‌హౌస్ మందు తాగుతున్నాడు. మరక మంచిదే అని సర్ఫ్‌వాళ్లు అన్నారు కానీ, గురక మంచిదే అని ఎవరైనా అన్నారా?
 
ఈ మధ్య మన సినిమాలు నిద్రకి మంచి మందుగా పనిచేస్తున్నాయి. నా మిత్రుడికి వ్యాపారంలో ఒక స్లీపింగ్ పార్టనర్ ఉన్నాడు. ఆయన సినిమాకెళితే టైటిల్స్ వస్తున్నప్పుడు నిద్రపోయి, రోలింగ్ టైటిల్స్‌లో లేస్తాడు. మధ్యలో ఏం జరిగినా ఆయనకి అనవసరం. ఈమధ్య సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకి వెళ్లి చిరాకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ప్రతి ఐదు నిముషాలకి ఒసారి తుపాకీతో కాల్చి నిద్రపట్టకుండా చేశాడట! డైలాగుల కంటే తుపాకి గుళ్లే ఎక్కువగా పేలాయట. కాల్చడం మొదలుపెడితే పవన్ ఎవరి మాటా వినడు.
 
నిద్రలో బోలెడు రకాలుంటాయి. కునుకు, దొంగనిద్ర, కలత నిద్ర, గాఢనిద్ర, యోగనిద్ర, దీర్ఘనిద్ర. చివరిదాన్ని ఎవడూ తప్పించుకోలేడు. వెనుకటికి ప్రధానిగా ఉన్నప్పుడు దేవెగౌడ కునుకు వేయకుండా ఏ సమావేశమూ ముగించేవాడు కాదు. దొంగనిద్ర ఎలా పోవాలో శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అందుకే కురుక్షేత్రం నడిపించాడు. విజయ్‌మాల్యాకి అప్పులిచ్చినవాళ్లంతా అనుభవిస్తుండేది కలతనిద్ర. గాఢనిద్ర పసి పిల్లల ఆస్తి. స్కూల్లో చేరిన తరువాత ఆ ఆస్తిని పోగొట్టుకుని అప్పులపాలవుతాం. ఇతరుల దుఃఖాన్ని తమదిగా భావించే మహాయోగులకి అబ్బేది యోగనిద్ర. అది మనకు చేతకాదు.
 
నిద్ర పట్టని వాళ్లుంటారు. నిద్రపోయేవాళ్లని చూస్తే వీళ్లకు జెలసీ. వీళ్లు ఆఫీస్‌లో బాస్‌లైతే మనం చచ్చినా నిద్రపోలేం. నిద్రలో నడిచేవాళ్లుంటారు. నా చిన్నప్పుడు ఒకాయనుండేవాడు. డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదివేవాడు. నిద్రలో నడుస్తూ ‘‘మిస్టర్ ఏజెంట్ త్రిబుల్‌వన్, నీ ఆటలు డిటెక్టివ్ యుగంధర్ వద్ద సాగవు’’ అని అరుస్తూ వీధిలో వాళ్ళందరికీ జేమ్స్‌బాండ్ సినిమాలు చూపించేవాడు.
 నిద్రలో కలలొస్తే వరం. పీడకలలొస్తే కలవరం. జర్నలిస్ట్‌లకి సరిగా నిద్ర వుండదు కాబట్టి కలలు కూడా సరిగా రావు.

జర్నలిస్ట్‌గా వున్నప్పుడు ఏది కలో, ఏది మెలకువో తెలిసేది కాదు. జర్నలిజమే ఒక వైష్ణవమాయ.
 తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో కొందరు నిద్రపోతూ పనిచేసేవాళ్లు. పనిచేస్తూ నిద్రపోయేవాళ్లు. ఈ నిద్రావస్థలో ఒకసారి మునిసిపల్ చైర్మన్ ఫోటోకి బదులు గజదొంగ ఫోటో పెట్టారు. జనం పెద్ద తేడా తెలుసుకోలేకపోయారు. చైర్మన్ కూడా తన మొహాన్ని గుర్తుపట్టలేకపోయాడు. (మనల్ని మనం గుర్తుపట్టడమే అన్నిటికంటే కష్టం). గజదొంగ పేపర్ చదవడు కాబట్టి, మా స్లీపింగ్ సబ్‌ఎడిటర్లు వాడికిచ్చిన గౌరవాన్ని గుర్తించలేకపోయారు.

మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా నిద్రపోయి గురకపెడతాయి. మన ప్రభుత్వాలకి వున్న మంచి లక్షణాల్లో ఇదొకటి. నిద్రపోవడం మన హక్కు. నిద్రని నేను గౌరవిస్తాను కానీ, గురక మాత్రం ఇతరుల హక్కుల్ని హరించడమే!
 - జి.ఆర్. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement